పూరి మాట: డ్రైనేజీ మూతలూ అమ్మేస్తాం
close

తాజా వార్తలు

Updated : 14/08/2020 16:03 IST

పూరి మాట: డ్రైనేజీ మూతలూ అమ్మేస్తాం

ఇంటర్నెట్‌ డెస్క్‌: పూరి జగన్నాథ్‌ సమాజం గురించి ఏదైనా చెబితే కొంచెం కఠినంగా ఉంటుంది కానీ... ఆలోచిస్తే నిజమే కదా అనిపిస్తుంది. ‘మ్యూజింగ్స్‌’ పేరుతో పాడ్‌కాస్ట్‌ నిర్వహిస్తున్న పూరి ఈ రోజు ‘మేరా భారత్‌ మహాన్‌’ అంటూ దేశభక్తి గురించి ఆయన భావాలు వ్యక్తపరిచారు. 200 ఏళ్ల పోరాటంతో మనం సాధించుకున్న స్వాతంత్ర్యంతో మనమేం చేస్తున్నామో వ్యంగ్యంగా చెప్పాడు. పూరి ఇంకా ఏం చెప్పారో చదివేయండి.

‘‘కాసేపు మన గురించి, మన దేశం గురించి నిజాలు మాట్లాడుకుందాం. 

భారతదేశం కర్మ భూమి.. మనకు కామన్‌సెన్స్‌ ఉండదు. 

మనది వేద భూమి... కానీ ఆ వేదాలు ఎక్కడున్నాయో తెలియదు. 

ఇది పుణ్యభూమి.. మనం చేయని పాపం లేదు. 

మన తల్లి భరతమాత.. కానీ గంటకో రేప్‌ జరుగుతోంది. 

సువిశాల భారత ఖండం...  పాపులేషన్‌తో కిటకిటలాడుతోంది. 

గంగ, యమున, గోదావరి...  ఆ నీళ్ల కోసమే కొట్టుకు చస్తుంటాం. 

ఎన్నో పుణ్య క్షేత్రాలు.. ఆ గుళ్ల బయటే చెప్పులు దొంగిలిస్తుంటాం. 

మహా కవులు పుట్టిన దేశం మనది.. 65 శాతం నిరక్షరాస్యత. 

మనది ఆర్య సంస్కృతి.. అందుకే పెట్రోల్‌లో కిరోసిన్‌ కలిపేస్తుంటాం. పాలల్లో నీళ్లు కలిపేస్తాం. మునిపిసాటిలీ నీళ్లు లాగేస్తాం. రేషన్‌ బియ్యం బయట అమ్మేస్తాం. ఓట్లు అమ్ముకుంటాం. దొంగ బిల్స్‌ పెడతాం... బిల్స్‌ ఎగ్గొడతాం. దొంగ సర్టిఫికేట్లు పెడతాం.. దొంగ నోట్లు గుద్దేస్తాం. టికెట్‌ లేకుండా ట్రైన్‌ ఎక్కుతాం.. పక్క స్థలం కలిపేస్తాం. ఆఖరికి డ్రైనేజీ మూతలు కూడా అమ్మేస్తాం. 

ఇవి కాకుండా స్వాతంత్ర్యం వల్ల మూడు చక్కని విషయాలు నేర్చుకున్నాం. ఒకటి అనవసరమైన విషయాలు నెత్తికి రాసుకోవడం... రెండోది కోడి గుడ్డు మీద ఈకలు పీకడం... మూడోది అనవసరంగా పక్కవాణ్ని కెలకడం. వీటిలో చాలా వాటిని మనందరం చేసే ఉంటాం. అందుకే ఓ పేపర్‌ మీద రాసుకుందాం... ‘నేను చేసిన వెదవ పనులు ఇవీ’ అని. వాటిని ఎవరికీ చూపించొద్దు... మన కోసమే రాసుకుందాం. అలా రాసుకొని భవిష్యత్తులో అవి చేయకుండా జాగ్రత్తపడదాం. 200 ఏళ్లు యుద్ధం చేసి స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం... ఉపయోగం ఏమిటి? మనం మారకపోతే ఏ నాయకుడూ మనల్ని మార్చలేడు. మీతోపాటు మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు.. కరెంట్‌ దొంగతనం. 

మొన్ననే గల్వాన్‌ లోయలో గొడవైంది. భారతీయ సైనికులు చనిపోయారు. చైనా సైనికుల‌తో హ్యాండ్‌ టు హ్యాండ్‌ ఫైట్‌ జరిగింది. ప్రాణం పోయేంతవరకు కొట్లాడారు. ఎందుకు మన కోసం, మన దేశం కోసం. చనిపోయిన సైనికులు వాళ్ల కుటుంబం గురించి ఆలోచించలేదు. ప్రాణాల గురించి అస్సలు పట్టించుకోలేదు. కొన ఊపిరి వరకు వారికి ఒక్కటే గుర్తుంది. దేశం దేశం అంటూ జాతి గౌరవంతో చనిపోయారు. ‘మేరా భారత్‌ మహాన్‌’
వాళ్ల కోసమైనా మనం చీప్‌ పనులు మానేద్దాం. వాళ్లలా మనం దేశం కోసం చావనక్కర్లేదు. కనీసం రోడ్ల మీద మూత్రవిసర్జన చేయకపోతే చాలు.. అది కూడా దేశభక్తే. జనగణమన
’’

- పూరి జగన్నాథ్‌ @ మ్యూజింగ్స్‌

ఈ పాడ్‌కాస్ట్‌ను ఆయన మాటల్లో వినాలంటే...


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని