
తాజా వార్తలు
సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
ఇంటర్నెట్ డెస్క్: సిడ్నీ టెస్టు ముగిసిన వెంటనే రాహుల్ ద్రవిడ్ తనకు సందేశం పంపించారని టీమ్ఇండియా ఆటగాడు హనుమ విహారి తెలిపాడు. క్రికెటర్‌గా తన ఎదుగుదలలో ఆయన పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడానికి ముందూ తనలో ఆత్మవిశ్వాసం నింపారని వివరించాడు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో కీలకమైన మూడో టెస్టులో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ శక్తికి మించి పోరాడిన సంగతి తెలిసిందే. సిడ్నీ టెస్టు ఆఖరి రోజు వికెట్లు పడకుండా ఉండేందుకు వీరిద్దరూ ఎంతో శ్రమించారు. యాష్‌కు విపరీతంగా నడుం నొప్పి ఉన్నా.. విహారి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నా అజేయంగా నిలిచారు. ఆ మ్యాచ్ ముగిశాక విహారి భారత్‌కు తిరిగివచ్చేశాడు.
‘సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ నుంచి సందేశం రావడం సంతోషంగా అనిపించింది. గొప్పగా ఆడావని ఆయన ప్రశంసించారు. ఆయనెంతో గొప్ప వ్యక్తి. ఆయన్ను నేనెంతగానో ఆరాధిస్తాను. నిజానికి ఆయన వల్లే రంజీలు, టీమ్ఇండియా మధ్య అంతరం తొలగిపోయింది. భారత్-ఏకు ఆడుతున్నప్పుడు మమ్మల్ని మేం నిరూపించుకొనేలా ఆయన స్వేచ్ఛనిచ్చేవారు. సిరాజ్, సైని, శుభ్‌మన్, మయాంక్, నేను కలిసి భారత్-ఏకు ఆడాం. 3-4 ఏళ్లు ఆయన మాకు కోచింగ్ ఇచ్చారు. ఆయన ఏర్పాటు చేసిన షాడో పర్యటనల వల్లే మేమీ సవాళ్లకు సిద్ధపడ్డాం. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం’ అని విహారి అన్నాడు.
ఇవీ చదవండి
ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్
స్పైడర్ పంత్..!