close

తాజా వార్తలు

Updated : 26/10/2020 07:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డిజిటల్‌ రావణ దహనాలు.. దశకంఠ కేకులు!

దిల్లీ: దసరా రోజున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతాయి. చెడుపై మంచి గెలిచిన సందర్భంగా రావణాసురుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తుంటారు. దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో జరిగే రావణ దహనం కార్యక్రమాలకు లెక్కేలేదు. కానీ, ఈ ఏడాది దేశరాజధానిపై వాయు కాలుష్యం.. కరోనా తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రావణ దహన కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంత ప్రజలు కాలుష్యం, కరోనాను అరికట్టడం కోసం బహిరంగంగా రావణ దహనం చేయడానికి ఇష్టపడట్లేదు. అయితే, రావణ దహనానికి ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు. వినూత్న పద్దతిలో ఆ తంతు నిర్వహిస్తున్నారు.

డిజిటల్‌ రావణ దహనం

వాయుకాలుష్యం కారణంగా వాతావరణ సమతుల్యం దెబ్బతింటుండంతో దిల్లీ ప్రజలు ప్రకృతిని కాపాడుకోవాలనే నిర్ణయానికి వస్తున్నారు. ఏ సంబరాలైనా ఎకో ఫ్రెండ్లీగా జరుపుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే రావణ దహనాన్ని డిజిటల్‌గా నిర్వహిస్తున్నారు. ఉత్తర దిల్లీకి చెందిన ఓ కుటుంబం తమ ఐదేళ్ల కూతురుకి ఆన్‌లైన్‌లో ఇంటి పెద్దలతో రామాయణం చెప్పించి.. ఆ తర్వాత కంప్యూటర్‌ తెరపైనే రావణుడి దిష్టబొమ్మను దహనం చేయిస్తోందట. తమ కూతురికి పురాణ గాథలు తెలపడంతోపాటు సంస్కృతిని కాపాడుకునేలా ఎకో ఫ్రెండ్లీగా సంబరాలు జరుపుకోవడం నేర్పించాలనుకుంటున్నట్లు చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. 

రావణ కేకులు

ప్లాస్టిక్‌, పేపర్‌, బాణాసంచాలతో రావణాసురుడి దిష్టిబొమ్మ దహనం చేసే బదులు.. రావణుడి బొమ్మతో కేకు తయారు చేసి కట్‌ చేస్తే సరిపోతుంది కదా అని దిల్లీలోని హరి నగర్‌కు చెందిన ప్రభకీన్‌ కౌర్‌ అంటున్నారు. బేకరీ షాపు నిర్వహిస్తున్న ఆమె.. విభిన్న ఆకృతుల కేకులను తయారు చేయడంలో నిపుణురాలు. దసరా సందర్భంగా నిర్వహించే రావణ దహనంతో వాయు కాలుష్యం.. బాణాసంచాలతో శబ్ధ కాలుష్యం జరుగుతోందని, అందుకే ఈ ఏడాది పర్యావరణహిత దారి ఎంచుకొని రావణాసురుడి కేకులు తయారు చేస్తున్నట్లు కౌర్‌ చెప్పుకొచ్చారు. ఆమె తయారు చేసిన రావణసురుడి కేక్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో తమకు అలాంటి కేకులు కావాలంటూ ప్రజలు ఆమెకు ఆర్డర్స్‌ ఇస్తున్నారట.

మరికొందరు పర్యావరణ ప్రేమికులు చిన్నారులకు, యువతకు ప్లాస్టిక్‌ వాడకుండా.. పునరుత్పాదక వస్తువులతో రావణాసురుడి దిష్టిబొమ్మను తయారు చేయడం ఎలాగో ఆన్‌లైన్‌లో నేర్పిస్తున్నారు. స్టేజ్‌క్రాకర్స్‌ అనే సంస్థ మొబైల్‌యాప్‌ ద్వారా ఈ ఎకో ఫ్రెండ్లీ దిష్టిబొమ్మల తయారీపై క్లాసులు తీసుకుంటోంది. చిన్నారులు, తల్లిదండ్రులు కరోనా కారణంగా బయటకు వెళ్లే పరిస్థితులు లేవని, అందుకే ఆన్‌లైన్‌ ద్వారా రావణాసురుడి దిష్టిబొమ్మలు తయారు చేయడం నేర్పిస్తున్నామని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. వీటిని తయారు చేస్తూ పిల్లలు దసరా పండుగ ప్రాముఖ్యత, నేపథ్యాన్ని తెలుసుకుంటారని అంటున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.