
తాజా వార్తలు
పంత్ బాగా ఆడితే నా కెరీర్ ముగిసిపోదు..
ఆస్ట్రేలియా పర్యటనపై వృద్ధిమాన్ సాహా
కోల్‌కతా: టీమ్ఇండియా యువ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్‌పంత్ వికెట్ల వెనుక మెల్లిగా మెరుగవుతాడని, ఎవరూ ఒకటో తరగతిలోనే అన్నీ నేర్చుకోరని సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో పంత్(89*) గబ్బా టెస్టులో భారత్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అతడు హీరోగా మారాడు. ఈ నేపథ్యంలోనే తుది జట్టులో సాహా స్థానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై స్పందించిన సాహా.. పంత్ బాగా ఆడినంత మాత్రాన తన కెరీర్ ముగిసిపోతుందని అనుకోవట్లేదని చెప్పాడు. తాజాగా పీటీఐతో మాట్లాడిన సీనియర్ వికెట్ కీపర్ అనేక విషయాలపై స్పందించాడు. ఏమన్నాడో అతడి మాటల్లోనే..
పంత్‌తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, కావాలంటే మీరు కూడా అతడిని అడగండి. తుది జట్టులో మా ఇద్దరిలో ఎవరున్నా ఒకరికి ఒకరం సహకరించుకుంటాం. అతడితో నాకు ఎలాంటి విభేదాలు లేవు. నంబర్ 1 ఎవరు, నంబర్ 2 ఎవరు అని నేను ఆలోచించను, ఎవరు బాగా ఆడితే జట్టు యాజమాన్యం వారికి అవకాశం ఇస్తుంది. నేను మాత్రం మరింత మెరుగవ్వడంపైనే దృష్టి సారిస్తా. తుది జట్టులో ఉండడం నా చేతుల్లో లేదు. అది జట్టు యాజమాన్యం చూసుకుంటుంది.
పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి దూరమయ్యాక పంత్ బాగా మెరుగయ్యాడు, ఎవరైనా నిదానంగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తారు. ఒకటో తరగతిలోనే అన్నీ నేర్చుకోరు. పంత్ కూడా అలాగే. మెల్లిగా నేర్చుకుంటాడు. తప్పకుండా భవిష్యత్‌లో మెరుగవుతాడు. గతంలోనూ ఇలాగే చేశాడు. ఇక గబ్బా టెస్టులో పంత్ మంచి ప్రదర్శన చేశాక ధోనీతో పోలుస్తున్నారు. కానీ, ధోనీ ఎప్పటికీ ధోనీనే. ఎవరి గుర్తింపు వారికి ఉంటుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో సరిగ్గా ఆడలేకపోయా. ఎవరైనా ఆటలో కష్టాలు ఎదుర్కొంటారు. ఒడుదొడుకులకు లోనవుతారు. ఒక ప్రొఫెషనల్ ఆటగాడెప్పుడూ ఎత్తుపల్లాలను సమానంగా స్వీకరిస్తాడు. అది ఫామ్ పరంగా అయినా, విమర్శల పరంగానైనా. నేను పరుగులు చేయలేనందు వల్లే పంత్‌కు అవకాశం వచ్చింది. అయితే, నేనెప్పుడూ నా నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకే ప్రయత్నిస్తా. ఆటకు వీడ్కోలు పలకాలని అనుకోను. నేను క్రికెట్ ప్రారంభించినప్పుడు కూడా ఇదే ఫార్ములాను అనుసరించా’.
ఇక అడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌటయ్యాక సిరీస్ విజయం సాధించడం ప్రపంచకప్ విజయానికి ఏమాత్రం తక్కువ కాదు. చివరి మూడు టెస్టుల్లో నేను ఆడకపోయినా ప్రతీ క్షణాన్ని నేను ఆస్వాదించాను. నాలుగో టెస్టుకు 11 మందిని ఎంపిక చేయడానికి ఇబ్బందులు పడ్డాం. అయినా సిరీస్ గెలుపొందామంటే అదో గొప్ప విశేషం. అదంతా ఆటగాళ్ల కష్టం ఫలితమే. గొప్ప విజయాల్లో కచ్చితంగా ఇదీ ఒకటిగా నిలుస్తుంది. అలాగే పలువురు ఆటగాళ్లు గాయాలబారిన పడకపోతే టీమ్ఇండియాకు రిజర్వ్ బెంచ్ ఆటగాళ్ల సత్తా తెలిసేది కాదు. సెషన్ సెషన్‌కూ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుకొని ముందుకు సాగారు. గత పర్యటనలో విజయం సాధించిన తీరును గుర్తు చేసుకొని ఆడారు.
ఇక కెప్టెన్సీ విషయానికొస్తే రహానె ప్రశాంతంగా ఉంటాడని, విరాట్ లాగే ఆటగాళ్లపై పూర్తి నమ్మకం కలిగి ఉంటాడని సాహా పేర్కొన్నాడు. కాకపోతే కోహ్లీలా భావోద్వేగాలను బయటపెట్టడని చెప్పాడు. ప్రశాంతంగా ఉంటూనే తన పని తాను చేసుకుపోతాడని తెలిపాడు. ఆటగాళ్లలో ఎలా స్ఫూర్తి నింపాలో రహానెకు బాగా తెలుసన్నాడు. అదే అతడి సక్సెస్ మంత్రం అని సాహా ముగించాడు.
ఇవీ చదవండి..
ఆసీస్ కాదు.. టీమిండియాపై దృష్టిపెట్టండి
ఇండియా అంటే ఇది: సెహ్వాగ్