తెదేపాది అనవసర రాద్ధాంతం: సజ్జల
close

తాజా వార్తలు

Updated : 17/04/2021 16:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెదేపాది అనవసర రాద్ధాంతం: సజ్జల

అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రశాంతంగా జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక జరిగే తొలి ఉప ఎన్నిక అని.. గతంతో పోలిస్తే ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ ఉప ఎన్నికలు జరగలేదన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాగే ఉండాలని తమ ప్రభుత్వం నిరూపిస్తోందని చెప్పారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ తెదేపా నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి దర్శనానికి బస్సుల్లో వస్తే, దానిపై కూడా గలాటా చేస్తారా?అని నిలదీశారు. రెండు రోజుల క్రితం నుంచే ఈ తరహా ఆరోపణలు తమపై చేస్తోందని, దీనికి తగిన రంగాన్ని తెదేపా ముందే సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోందని సజ్జల ఆరోపించారు.

వైకాపా ఓడిపోతుందని.. మెజారిటీ తగ్గుతుందనే భయం తమకేమీ లేదని సజ్జల స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు ఇదే తరహా ఆరోపణలు చేశారన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఏం చేస్తున్నారో తెదేపా, భాజపా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఎన్నికలను తెదేపా కించపరుస్తోందని మండిపడ్డారు. బయట నుంచి బస్సుల్లో ఓటర్లను తరలించి దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం వైకాపాకు పట్టలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం మంది ఓటర్లు ముఖ్యమంత్రి జగన్ వైపే ఉన్నారన్నారు. పదిసార్లు తిరుపతిలో ఉపఎన్నిక పెట్టినా వైకాపా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రీపోలింగ్‌కు అనుమతి ఇస్తే కేంద్ర ఎన్నికల సంఘం తనకు తానే అవమానించుకున్నట్లు అవుతుందని సజ్జల వ్యాఖ్యానించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని