close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 03/07/2020 20:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రూప్‌ డ్యాన్సర్‌ నుంచి సక్సెస్‌ఫుల్‌ కొరియోగ్రాఫర్‌గా..

సరోజ్‌ఖాన్‌ జీవిత ప్రస్థానం

‘మదర్‌ ఆఫ్ డ్యాన్సర్‌’ పేరొందిన సరోజ్‌ ఖాన్‌ శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధ పడుతూ ముంబయిలో మరణించిన ఆమె.. బాలీవుడ్‌లో రెండు వేలకు పైగా పాటలకు నృత్యరీతులు సమకూర్చారు. శ్రీదేవి, మాధూరి దీక్షిత్‌ వంటి హీరోయిన్లు మంచి డ్యాన్సర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారంటే.. వారి వెనకుంది సరోజ్‌ఖాన్‌ అని చెప్పడంలో సందేహం లేదు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా.. గ్రూప్‌ డ్యాన్సర్‌గా కెరీర్‌ ప్రారంభించి.. బాలీవుడ్‌లో ఓ గొప్ప కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన సరోజ్‌ ఖాన్‌ జీవిత ప్రస్థానం ఇలా..

సరోజ్‌ఖాన్‌ 1948 నవంబర్‌ 20న ముంబయిలోనే జన్మించారు. ఆమె తల్లిదండ్రులు 1947లో భారత్‌, పాక్‌ విభజన సమయంలో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చారు. చిన్నతనంలోనే డ్యాన్స్‌పై ఆసక్తి పెంచుకున్న సరోజ్‌ ఖాన్‌ గోడలపై తన నీడను చూస్తూ డ్యాన్స్‌ నేర్చుకునేవారట. ఆమె తల్లి కంగారుపడి డాక్టర్‌కి చూపిస్తే.. డ్యాన్స్‌ విషయంలో ప్రోత్సహించమని, బాలీవుడ్‌ సినిమాల్లోకి పంపమని సూచించారట. తన వద్దకు ఎవరైనా సినీ నిర్మాతలు వస్తే తన గురించి చెప్పి అవకాశం ఇప్పిస్తానని డాక్టర్‌ మాటిచ్చారట. అలా 1950 దశకంలో సరోజ్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. 

గ్రూప్స్‌ డ్యాన్సర్‌ నుంచి అసిస్టెంట్‌ కొరియోగ్రఫర్‌గా 

పదేళ్ల వయసులో సరోజ్‌ఖాన్‌కు ప్రముఖ నటి మధుబాల నటించిన సినిమాలో గ్రూప్‌ డ్యాన్సర్‌గా నటించే అవకాశం లభించింది. 1958లో వచ్చిన ‘హౌరాబ్రిడ్జ్‌’ చిత్రంలోని ‘ఆయియే మెహర్‌బాన్‌’ పాటతో సరోజ్‌ఖాన్‌ గ్రూప్‌ డ్యాన్సర్‌గా మారారు. అయితే సరోజాఖాన్‌ డ్యాన్స్‌ను గమనించిన కొరియోగ్రాఫర్‌ బి. సోహన్‌లాల్‌ తన సహాయకురాలిగా నియమించుకున్నారు. ఆయన ఆమెకు డ్యాన్స్‌ స్టెప్స్‌ నేర్పిస్తే.. ఆమె హీరో హీరోయిన్లను డ్యాన్స్‌ నేర్పించేది.

కొరియోగ్రాఫర్‌గా తొలి అవకాశం

అసిస్టెంట్‌ కొరియాగ్రాఫర్‌గా కొనసాగుతున్న రోజుల్లో ఓ సారి తన గురువు సోహన్‌లాల్‌... రాజ్‌కపూర్‌ చిత్రం సంఘం కోసం యూరప్‌ వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో ముంబయిలో ‘దిల్‌ హి తో హై’ అనే మరో సినిమాలోనూ సోహన్‌లాలే కొరియాగ్రఫీ చేయాల్సి ఉంది. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో సరోజ్‌ఖాన్‌నే కొరియోగ్రఫీ చేయమని ఆ సినిమా దర్శకుడు పీఎల్‌ సంతోషి చెప్పారట. మొదట సరోజ్‌ఖాన్‌ భయపడ్డా దర్శక నిర్మాతలు ఇచ్చిన ప్రోత్సహంతో ఆ సినిమాలోని ఓ పాటకి డ్యాన్స్‌ కంపోజ్‌ పూర్తి చేశారు. ఆ పాట అప్పట్లో హిట్‌ కావడంతో సరోజ్‌ఖాన్‌కు మంచి పేరొచ్చింది. సరోజ్‌ ఖాన్‌ కొరియోగ్రఫీ చేసిన ‘మేరా సయ్య’ అనే ఆల్బమ్‌లోని ‘ఝుమ్‌ కా గిరా రె’ పాట చూశాక దర్శకులు సాధన.. సరోజ్‌ఖాన్‌ అభిమానిగా మారిపోయాట. తను తీసే ప్రతి చిత్రంలోనూ సరోజ్‌ఖాన్‌నే కొరియోగ్రాఫర్‌గా పెట్టుకున్నారు. అయితే 1974లో వచ్చిన ‘గీతా మేరా నామ్‌’ చిత్రం టైటిల్స్‌లో తొలిసారి కొరియోగ్రాఫర్‌గా సరోజ్‌ఖాన్‌ పేరు వచ్చింది. ప్రముఖ దర్శకులు సుభాష్‌ ఘై తెరకెక్కించిన ‘విధాత’ చిత్రంలో ఓ పాటని కంపోజ్‌ చేసిన సరోజా ఫేమస్‌ అయ్యారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు.

సూపర్‌ హిట్‌ పాటల కొరియోగ్రాఫర్‌

‘మిస్టర్‌ ఇండియా’, ‘నగీనా’, ‘చాంద్‌నీ’ వంటి హిట్‌ చిత్రాల్లో సరోజ్‌ఖాన్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. మాధురీ దీక్షిత్‌కు పేరు తెచ్చిపెట్టిన ‘తెజాబ్‌’ చిత్రంలోని ‘ఏక్‌.. దో.. దీన్‌’కు, ‘తేనేదార్‌’ సినిమాలోని ‘తమ్మ తమ్మ లోగే’.. బేటా చిత్రంలోని ‘ధక్‌ ధక్‌ కర్నే’ పాటకు సరోజ్‌ఖానే డ్యాన్స్‌ కంపోజ్‌ చేశారు. వీటితో ఆమె బాలీవుడ్‌లో విజయవంతమైన కొరియోగ్రాఫర్‌గా వెలుగొందుతూ వచ్చారు. ఈ క్రమంలో సరోజ్‌ ఖాన్‌ 8 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. అంతేకాదు.. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘చూడాలని వుంది’ సినిమాకు గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా 1998లో సరోజ్‌ఖాన్‌ నంది పురస్కారం అందుకున్నారు. వీటితోపాటు మరెన్నో అవార్డులను దక్కించుకున్నారు. 

13ఏళ్ల వయసులోనే సరోజ్‌ఖాన్‌.. కొరియోగ్రాఫర్‌ బి. సోహన్‌లాల్‌ను వివాహం చేసుకున్నారు. 1965లో విడిపోయి సర్దార్‌ రోషన్‌ ఖాన్‌ను 1975లో రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు నలుగురు సంతానం. 

ఓ ఇంటర్యూలో సరోజ్‌ఖాన్‌ మాట్లాడూతూ ‘‘నేను కంపోజ్‌ చేసిన నృత్యాన్ని శ్రీదేవి, మాధూరీ దీక్షిత్‌, ఐశ్వర్యరాయ్‌, రాణీ ముఖర్జీ, కరీష్మాకపూర్‌, కరీనాకపూర్‌ తెరపై అద్భుతంగా చేసి చూపించారు. నాకెంతో మద్దతుగా నిలిచారు. నా విజయాన్ని వారితో పంచుకుంటాను’’అని  అన్నారు. డాక్టర్‌ విద్యా చిత్రంలోని ఓ పాటలో సరోజ్‌ కంపోజ్‌ చేసిన స్టెప్స్‌ను ఆ చిత్ర హీరోయిన్‌ వైజయంతిమాల మెచ్చుకున్నారట. ‘వైజయంతి మాల నా చేతిలో రూ. 21 పెట్టి.. నువ్వు కంపోజ్‌ చేసిన ఈ స్టెప్‌ నేను చేయలేను’అని చెప్పారట. అది తన జీవితంలో మర్చిపోలేని క్షణమని సరోజ్‌ఖాన్‌ చెప్పేవారు. 

డ్యాన్స్‌ మంచిదే

‘‘కొంత మంది డ్యాన్స్‌ మంచిది కాదని భావిస్తారు. కానీ డ్యాన్స్‌ చాలా మంచిది. మెదడు చురుగ్గా ఉండటానికి. శారీరక ఆరోగ్యానికి డ్యాన్స్‌ మంచిదే. తెరపై డ్యాన్స్‌ చేసినా.. చేయకపోయినా.. ఇంట్లో డ్యాన్స్‌ చేస్తే అదే వ్యాయామవుతుంది. మధుమేహం నుంచి రక్షిస్తుంది. కీళ్ల నొప్పులు రావు. బాధలో ఉన్నప్పుడు డ్యాన్స్‌ చేస్తే కొంత బాధ తగ్గి సంతోషంగా ఉండగలుతాం’’అని సరోజ్‌ ఖాన్‌ చెప్పుకొచ్చారు. 

రచయితగా.. హోస్ట్‌గా

కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతూనే సరోజ్‌ఖాన్‌ సినీ రచయితగానూ మెప్పించారు. వీర్‌ దాదా, దిల్‌ తేరా దివానా, దావా, బీనామ్‌ వంటి పలు చిత్రాలకు కథను అందించారు. ‘నాఛోలే వె విత్‌ సరోజ్‌ఖాన్‌’ డ్యాన్స్‌ షోకి జడ్జ్‌గా వ్యవహరించారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.