6 దశాబ్దాలుగా ఆ గ్రామానికి సర్పంచి ఏకగ్రీవమే..!
close

తాజా వార్తలు

Published : 14/02/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

6 దశాబ్దాలుగా ఆ గ్రామానికి సర్పంచి ఏకగ్రీవమే..!

ఆత్మకూరు: ఆ గ్రామానికి ఆయన మాటే వేదం. ఎంత పెద్ద సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తారు. పోలీసులు ఆ ఊరి వైపు రారు. గ్రామస్థులూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లరు. 1959లో గ్రామానికి మొదటి సర్పంచిగా గెలిచి 1972 వరకు ఏకగ్రీవంగా నిలిచి.. ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయనే నెల్లూరు జిల్లా నారంపేట గ్రామానికి చెందిన శ్రీహరి నాయుడు. మరి ఆ ఊరు, ఆ సర్పంచి విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ గ్రామంలో  ఎన్నికలు జరుగుతున్నాయి.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో నారంపేట ఓ ప్రత్యేకమైన గ్రామం. అందరూ గొప్పగా చెప్పుకునేలా ఆదర్శవంతమైన గ్రామం. ఈ ఊరిలో అందరూ ఒకే మాటపై నిలబడి సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. అంతే ఐక్యతతో ఊరిని అభివృద్ధి చేసుకుంటున్నారు. 600 జనాభా ఉన్న నారంపేట పంచాయతీలో చక్కటి రోడ్లు, పరిశుభ్రమైన మురుగునీటి వ్యవస్థ ఉంది. 1959 నుంచి ఇప్పటికీ ఆ ఊరిలో సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. తొలిసారి 1959లో కంచర్ల శ్రీహరి నాయుడును గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1972 వరకు ఆయన ఒక్కరే ఏకగ్రీవ సర్పంచిగా కొనసాగారు. గ్రామంలో ఎన్నో సమస్యలకు సునాయాసంగా పరిష్కార మార్గం చూపించారు.

శ్రీహరినాయుడు గురించి గ్రామస్థులు మాట్లాడుతూ.. ‘మాకు ఏ సమస్య వచ్చినా శ్రీహరి నాయుడు దగ్గరుండి ఆదుకుంటారు. పోలీసులు, పోలీస్‌స్టేషన్లతో సంబంధం లేకుండా సమస్యల్ని, వివాదాల్ని పరిష్కరిస్తారు. గ్రామంలో రహదారులు గానీ, మంచి నీటి వ్యవస్థ గానీ ఏదైనా దగ్గరుండి పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఆయన అందరికీ అనుకూలంగా ఉండటంతో ఆ గ్రామంలో ఆయనకు పోటీగా నిలబడే వారు లేరు. ఉదయం లేచినప్పటి నుంచి గ్రామస్థులందరినీ పలకరిస్తూ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తారు’ అని గ్రామస్థులు తెలిపారు. 

శ్రీహరినాయుడు సేవల్ని గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ 1972లో ఆయన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించింది. 1978 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన ఎంతో సాధారణ వ్యక్తిలా అందరితో కలిసి తిరుగుతారు. 8 పదుల వయసు వచ్చినా గ్రామ సమస్యలు తీర్చడంలో ముందే ఉంటారు. ఈ సందర్భంగా శ్రీహరి నాయుడు మాట్లాడుతూ... ‘ 1959లో మా పంచాయతీ ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి 1972 వరకు నేను సర్పంచిగా సేవలందించాను. రాజకీయాల్లో నాటికీ, నేటికీ ఎంతో మార్పు వచ్చింది. ప్రస్తుత రాజకీయాలు మొత్తం డబ్బుమయం అయ్యాయి. అయితే మా గ్రామాన్ని మాత్రం అటువంటి బాటలో నడవకుండా ఆదర్శనీయంగా రూపొందించుకున్నాం’ అని పేర్కొన్నారు. 

ఇదీ చదవండి..

ఢోబాల్‌ ఇంటిపై ఉగ్రవాదులు రెక్కీ!


ఇవీ చదవండి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని