తమిళనాడుకు శశికళ..ఆసక్తిగా రాజకీయాలు
close

తాజా వార్తలు

Updated : 08/02/2021 11:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమిళనాడుకు శశికళ..ఆసక్తిగా రాజకీయాలు

చెన్నై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ సోమవారం తమిళనాడులో అడుగుపెట్టడంతో రాష్ట్ర రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పాలక అన్నాడీఎంకే(ఏఐఏడీఎంకే) పార్టీ హెచ్చరికలను ఖాతరు చేయకుండా..తాను ప్రయాణిస్తున్న కారుపై ఆ పార్టీ జెండాను ఉపయోగించి తన వైఖరేంటో రాజకీయ వర్గాలకు వెల్లడించారు. 

అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో నాలుగేళ్ల శిక్షను అనుభవించిన శశికళ..సోమవారం తమిళనాడులో అడుగుపెట్టారు. ఏఐఏడీఎంకే పార్టీ నుంచి తొలగింపునకు గురైనప్పటికీ..ఆమె మాత్రం తన కారుపై ఆ పార్టీ జెండాను ప్రదర్శించారు. అలాగే ఆకుపచ్చని చీరలో దర్శనమిచ్చిన ఆమె, తన మద్దతుదారులను కారు నుంచే పలకరించారు. అయితే ఆ జెండాను ఉపయోగించడంపై అధికార పార్టీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ‘మేం ఎవరికి భయపడం. పార్టీ కార్యకర్తలు మాతోనే ఉన్నారు. ఏఐఏడీఎంకే పార్టీ జెండా మాకు చెందినది’ అని ఆ రాష్ట్ర మంత్రి సీవీ షణ్ముగమ్ అన్నారు. ఇప్పటికే తాము శశికళపై ఫిర్యాదు చేశామని ఆయన మీడియాకు వెల్లడించారు. 

శశికళ తేవార్ వర్గానికి చెందినవారు. ఏఐఏడీఎంకేకు అది కీలక ఓటు బ్యాంకు. కాగా, మేలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో శశికళ వైఖరి ఎన్నికల్లో ప్రభావం చూపనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆమెపై ఆరు సంవత్సరాల నిషేధం ఉన్నకారణంగా..ఆమె ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. మరోవైపు, చెన్నైలో ఆమెకు భారీ ఎత్తున స్వాగతం పలకాలని మద్దతుదారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏఐఏడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి శశికళేనంటూ పోస్టర్లు వెలిశాయి. కొవిడ్ నిబంధనల కారణంగా భారీగా జనాలు గుమిగూడే సమావేశాలు నిర్వహించవద్దని పోలీసులు ఆదేశించారు. అయితే ఇది అధికార పార్టీతో ఘర్షణకు దారి తీయనుంది. 

ఇటీవల కొవిడ్ బారినపడిన ఆమె ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన అనంతరం కొంతకాలం బెంగళూరులోని ప్రెస్టీజ్ గోల్ఫ్‌షైర్ క్లబ్‌లో ఉన్నారు. అక్కడి నుంచి తమిళనాడుకు బయలుదేరారు. 

ఇవీ చదవండి:

రైతుల పేరుతో రాజకీయం తగదు: తోమర్

మమత నుంచి ‘మమత’ కరవు: మోదీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని