యూపీలో 5నగరాల్లో లాక్‌డౌన్‌పై సుప్రీం స్టే
close

తాజా వార్తలు

Published : 20/04/2021 13:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీలో 5నగరాల్లో లాక్‌డౌన్‌పై సుప్రీం స్టే

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఐదు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించాలని ఆదేశిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ యూపీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ అంశంలో అమికస్‌ క్యూరీని నియమించింది.  

కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా లఖ్‌నవూ, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, కాన్పూర్‌, గోరఖ్‌పూర్‌ నగరాల్లో ఏప్రిల్‌ 26 వరకు లాక్‌డౌన్‌ విధించాలని అలహాబాద్‌ హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ యూపీ సర్కారు నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లాక్‌డౌన్‌ విధించే అంశం న్యాయవ్యవస్థ పరిధిలో లేదని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందని యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని కోర్టును అభ్యర్థించారు.

ప్రభుత్వం అభ్యర్థన మేరకు నేడు అత్యవసర విచారణ జరిపిన జస్టిస్‌ బోబ్డే ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించినట్లు వెల్లడించింది. ఈ విషయంలో కోర్టుకు సలహాలు ఇచ్చేందుకు సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ నరసింహాను అమికస్‌ క్యూరీగా నియమించింది. కరోనా వ్యాప్తి కట్టడికి యూపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో వారం రోజుల్లోగా కోర్టుకు వివరించాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

మరోవైపు ఉత్తర్‌ ప్రదేశ్‌లో వారాంతపు లాక్‌డౌన్‌‌ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి శుక్రవారం రాత్రి ఎనిమిది నుంచి సోమవారం ఉదయం ఏడు గంటల వరకు ఈ లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. ఈ సమయంలో  అత్యవసర సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే మిగిలిన రోజుల్లో రాత్రి కర్ఫ్యూ ఉంటుందని రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీష్‌ కె అవాస్తి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని