
తాజా వార్తలు
బిహార్‌లో కీచక ప్రిన్సిపల్‌కు ఉరిశిక్ష
సహకరించిన ఉపాధ్యాయుడికి జీవితఖైదు
పట్నా: పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న పదకొండేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో ఓ కీచక ప్రిన్సిపల్‌కు ఉరిశిక్ష పడింది. ఈ ఘటన బిహార్‌లోని పట్నాలో చోటుచేసుకుంది. నిందితుడికి సహకరించిన మరో ఉపాధ్యాయుడికి కోర్టు జీవితఖైదు విధించింది. పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి అవధేశ్ కుమార్ ఈ మేరకు తీర్పును వెలువరించారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఫుల్వారీ షరీఫ్ ప్రాంతానికి చెందిన బాధిత బాలిక ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. 2018 సెప్టెంబరులో బాధిత చిన్నారి తరచూ అనారోగ్యం పాలవుతుండటంతో ఆమె తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించారు. అప్పుడు ఆ బాలిక గర్భవతి అని నిర్ధరణ కావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో సమీప మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ అరవింద్ కుమార్ ఆమెపై అత్యాచారం చేయగా, మరో ఉపాధ్యాయుడైన అభిషేక్ కుమార్ ఈ దుశ్చర్యకు సహకరించాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపల్, టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు పట్నాలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం కోర్టు ప్రిన్సిపల్‌కు మరణశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. అలాగే, అతడికి సహకరించిన ఉపాధ్యాయుడికి రూ.50వేల జరిమానా, జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు.