close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 11/03/2020 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సెక్యూరిటీ.. ప్రైవసీరెండూ ఒకటేనా?

జరసోచో

ప్రైవసీ.. సెక్యూరిటీ..డిజిటల్‌ యుగంలో ఎక్కువగా వినిపించే పదాలు..రెండూ ఒకటేనా? వేరు వేరా? ఎప్పుడైనా ఆలోచించారా?‘లేదే.. రెండూ ఒకటేగా?’ అనుకుంటే పొరబాటే.రెండింటికీ చిన్న వ్యత్యాసం ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే చాలు. సైబర్‌ సెక్యూరిటీపై ప్రాథమిక అవగాహనకి వచ్చినట్టే! రక్షణ చర్యలకు నడుం బిగించినట్టే!
మహా నగరాల్లోని మెట్రో స్టేషన్లలోనే కాదు.. మారుమూల పల్లెల్లోని మండువా లోగిళ్లలోనూ టెక్నాలజీని యాక్సెస్‌ చేస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్‌లు.. టీవీలు.. డిజిటల్‌ అసిస్టెంట్‌లు.. ఇలా చెప్పుకొంటూ వెళ్తే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) వరకూ అన్నీ ప్రజల జీవనశైలిలో భాగమైపోయాయి. ఇప్పుడంతా ఆలోచించేది కేవలం నెట్‌ డేటా ప్యాక్‌ల గురించే కాదు.. నా డేటా సంగతేంటి? అని. దీనికి కారణం సైబర్‌ దాడులు.. వాటి ద్వారా బయటపడుతున్న వేల మంది యూజర్ల వ్యక్తిగత వివరాలు.. ఎప్పుడో ఒకప్పుడు నా డేటా కూడా అలానే రచ్చకెక్కుతుందని యూజర్లు సైబర్‌ సెక్యూరిటీ వైపు అడుగులు వేస్తున్నారు. బేసిక్స్‌ నేర్చుకుంటున్నారు. కానీ, హ్యాకర్లు వేసే బిస్కెట్‌లకు అప్పుడప్పుడు కొందరు బలవుతున్నారు. వై-ఫైలు, పబ్లిక్‌ నెట్‌వర్క్‌లు పలకరిస్తే చాలు.. కనెక్ట్‌ అవ్వడం.. యాప్‌లను ఓపెన్‌ చేయడం.. వాడేయడం.. యాప్‌లు ఏమీ  బిల్ట్‌ఇన్‌ ఆప్షన్‌లు కాదు. అనుక్షణం వ్యక్తిగత వివరాల్ని యాక్సెస్‌ చేస్తూ.. మీకు తగిన ప్రకటనల్ని ప్రత్యక్షమయ్యేలా చేస్తుంటాయి. యాప్‌ల ముసుగులో యూజర్ల వ్యక్తిగత డేటాని సేకరించడమే పనిగా పెట్టుకునే వారూ ఉన్నారు. ఒక్క నకిలీ లింక్‌ని క్లిక్‌ చేస్తే చాలు.. ఫోన్‌ లేదా పీసీలో సమాచారం హ్యాకర్‌కి చేరిపోతుంది. అందుకే సిటిజన్‌లు కాస్తా నెటిజన్‌లుగా మారుతున్న క్రమంలో సైబర్‌ సెక్యూరిటీపై అవగాహన పెంచుకోవడం అనివార్యం. అందుకే ప్రైవసీ, సెక్యూరిటీని ఎలా బ్యాలెన్స్‌ చేయాలో కచ్చితంగా తెలుసుకోవాలి.
అవగాహనతో మొదలు..
చాలా మంది నెటిజన్లు ప్రైవసీ, సెక్యూరిటీ.. రెండు ఒకటే అనుకుంటారు. కాదు.. రెండూ వేరని గ్రహించాలి. అప్పుడే నేటి డిజిటల్‌ వరల్డ్‌లో మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుంటారు. ముందు సెక్యూరిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. నెట్టింట్లో మీకు సంబంధించిన డేటాని సైబర్‌ నేరగాళ్లు, హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండేందుకు తీసుకునే రక్షణ చర్యల్ని సెక్యూరిటీ అనొచ్చు. ఉదాహరణకు ఇంటికి రక్షణగా సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఎందుకు? అవి నిత్యం ఇంటిపై నిఘా నేత్రాలుగా పని చేస్తూ.. రక్షణ కల్పిస్తాయి. ఇదే మాదిరిగా నెట్టింట్లో మీ కోసం డేటా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఆ సెక్యూరిటీ వ్యవస్థ మీకు సంబంధించిన ముఖ్యమైన పాస్‌వర్డ్‌లు, ఇతర డాక్యుమెంట్‌లు, డేటాని భద్రం చేస్తుందన్నమాట. ఉదాహరణకు మీరు వాడే యాంటీవైరస్‌లు, పాస్‌వర్డ్‌ మేనేజర్లు, ఫాలో అయ్యే చిట్కాలు సెక్యూరిటీ కిందికే వస్తాయి. ఇప్పుడు ప్రైవసీ అంటే ఏంటో చూద్దాం. ఆన్‌లైన్‌ ప్రపంచంలో గోప్యతని పాటించడమే ప్రైవసీ. వ్యక్తిగత సమాచారాన్ని బట్టబయలు చేసుకోకుండా మీకు మీరు పెట్టుకునే కట్టుబాట్లే ప్రైవసీ అన్నమాట.   మీ పేరు, అడ్రస్‌, ఆధార్‌ నంబర్లు, బ్యాంకింగ్‌ వివరాలు, ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు?.. ఇలా ఏదైనా మీకు సంబంధించిన వివరాల్ని నెట్టింట్లో బహిర్గతం చేయకుండా తీసుకునే చర్యలే మీకు మీరు పెట్టుకునే ప్రైవసీ పాలసీలు.
వీటికి ముప్పు ఎలా?
నేటి డిజిటల్‌ మార్కెట్‌లో వినియోగదారుడే ఓ ఉత్పత్తి. అంటే.. మీ అవసరాలేంటి? మీరేం కోరుతున్నారు.. ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? వేటిని వెతుకుతున్నారు?.. ఇలా మీకు సంబంధించిన మొత్తం వివరాల్ని సేకరించాలి. అది జరగాలంటే.. వెబ్‌ విహారంలో మీ సెక్యూరిటీ, ప్రైవసీని దాటుకుని రావాలి. అప్పుడే మిమ్మల్ని లక్ష్యంగా చేసుకోవడం సాధ్యం అవుతుంది. మిమ్మల్ని ట్రాక్‌ చేయడం సులభం అవుతుంది. ఇలా ఓ ‘థ్రెట్‌’లా యూజర్లను సమీపించేందుకు నెట్టింట్లో అనేక మార్గాలు ఉన్నాయి. మీరు రోజూ వాడే మెయిన్‌ సర్వీసులు మొదలు, అవసరం నిమిత్తం సందర్శించే వెబ్‌సైట్‌ల వరకూ అన్నీ ఏదో ఒక మార్గం ద్వారా మిమ్మల్ని ట్రాక్‌ చేస్తూనే ఉంటాయి. మీ వెబ్‌ విహారాన్ని అనుకరిస్తూ మీకు సరిపడే వాటిని ప్రకటనల రూపంలో చూపుతూ మిమ్మల్ని ఊరిస్తుంటాయి. ఇదేదో బాగుందే.. అని ఫేక్‌ లింక్‌లపై క్లిక్‌ చేస్తే చాలు. మీ సెక్యూరిటీ వలయాన్ని చిటికెలో ఛేదించేస్తారు. ఇలా వ్యక్తిగతంగా ఎదురయ్యే థ్రెట్‌లు ఒక రకమైతే.. మీరు యూజర్‌గా ఉన్న కంపెనీలపై చేసే సైబర్‌ దాడులు మరో రకం. ఉదాహరణకు ఫేస్‌బుక్‌కి ఉన్న కోటానుకోట్ల యూజర్లలో మీరూ ఒకరు. ఎఫ్‌బీ క్లౌడ్‌ డేటాబేస్‌లో ఎక్కడ చిన్న లోపం ఉన్నా హ్యాకర్లు మాలిషియస్‌ రాన్‌సమ్‌వేర్‌ దాడికి దిగొచ్చు. అంతే.. ఒక్క దెబ్బకి వేల మంది యూజర్ల రికార్డులు రోడ్డుపాలు కావచ్చు. దీంతో ప్రైవసీని గాలికి వదిలేసి అడ్డూ అదుపూ లేకుండా మీరు పంచుకున్నవన్నీ ప్రమాదాలుగా మారొచ్చు.
రక్షణ మాటేంటి?
ఎల్లలులేని ఆన్‌లైన్‌ జిందగీలో వ్యక్తిగా మీ సెక్యూరిటీ, ప్రైవసీని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవగాహన లేకుండా తోచినట్టుగా డేటా పంచుకుంటున్నారంటే.. మీరో డిజిటల్‌ నిరక్షరాస్యులని అర్థం. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు కాస్త డిజిటల్‌ విజ్ఞతను ప్రదర్శించాలి. ఇక మీరు సభ్యులై ఉన్న సర్వీసులు ఏవైనా వినియోగదారుల డేటాకి రక్షణ కల్పించడంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాయి. ఎప్పటికప్పుడు సరికొత్త రక్షణ మార్గాల్ని అన్వేషిస్తూ సెక్యూర్‌గా ప్రాసెస్‌ చేస్తాయి. హ్యాకర్ల దాడుల్ని తిప్పికొడుతుంటాయి. అంతేకాదు.. వినియోగదారులకూ అప్‌డేట్స్‌ రూపంలో సెక్యూరిటీపై అవగాహన కల్పిస్తాయి. ఉదాహరణకు గూగుల్‌ అందించే    జీ మెయిల్‌ సర్వీసుని తీసుకుంటే. ఎప్పటికప్పుడు ఎకౌంట్‌ని సెక్యూర్‌ చేసుకునేందుకు తగిన చర్యల్ని చేపడుతుంది. మెయిల్‌ ఎకౌంట్‌ని ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుని సెక్యూరిటీ లోపాల్ని అధిగమించొచ్చు. ప్రైవసీ చెక్‌అప్‌తో గోప్యతని మరింత సున్నితంగా మార్చుకోవచ్చు. రానున్న రోజుల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌.. లాంటి ఆధునిక టెక్నాలజీలతో సెక్యూరిటీ, ప్రైవసీని మరింత దృఢంగా మార్చేయొచ్చు. నాణేనికి మరోవైపు అన్నట్టుగా అదే లేటెస్ట్‌ మార్గాలతో సైబర్‌ నేరగాళ్లు, హ్యాకర్లూ రక్షణ గోడల్ని కూల్చేందుకు కొత్త దారుల్ని కనిపెడుతున్నారు.


ఆగి ఆలోచించాల్సిందే!

‘సోషల్‌’లైఫ్‌లో ఎక్కువ శాతం పంచుకునే డేటా ఎక్కడికి పోతుందిలే అనే భ్రమలో ఉంటారు. మన సెక్యూరిటీ, ప్రైవసీకి ఏం చేటు లేదులే అనుకుంటూ అన్నీ పంచుకుంటారు. ఇలాంటి వారు వాడుతున్న సర్వీసుకి సంబంధించిన ‘టెర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌’ ఎన్నడూ చదివి ఉండరు. వెబ్‌సైట్‌, సోషల్‌ నెట్‌వర్క్‌, యాప్‌.. ఏదైనా సర్వీసుని వాడడానికి ముందు వాటికి సంబంధించిన పాలసీ డాక్యుమెంట్‌లను చదవండి. అప్పుడే మీరు వాడబోయే సర్వీసుల్లో మీకు సంబంధించిన డేటా ఏం చేస్తారో అర్థమవుతుంది. అంతేకాదు. రోజూ పంచుకునే వాటిపై నియంత్రణ కోల్పోతున్నామా? అనే ఆలోచన చేయాలి. ఊరెళ్లే దారిలో నేషనల్‌ హైవేపై ఫొటో దిగుతారు. దానికి తోడు.. ‘కుటుంబ సమేతంగా ఊరు వెళ్తున్నాం’ అని రాసి ఎఫ్‌బీలో పోస్ట్‌ చేస్తారు. దీన్ని మీరు కేవలం అప్‌డేట్‌ అనుకోవద్దు. పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్‌పై మీ అంతట మీరే దొంగలకి ఇస్తున్న సమాచారం. రిలాక్స్‌గా మీ ప్రొఫైల్‌ని బ్రౌజ్‌ చేస్తే మీ ఇంటి అడ్రస్‌, ఫొటోలతో సహా అన్నీ దొరుకుతాయి.ఓ స్మార్ట్‌ దొంగ రిలాక్స్‌గా ఇంటిని లూటీ చేయొచ్చు. అందుకే సెక్యూరిటీ, ప్రైవసీని కాపాడుకునే ప్రయత్నం చేయండి. వీటిని కచ్చితంగా ఫాలో అవ్వండి...

* ప్రైవసీ సెట్టింగ్స్‌ని డీఫాల్ట్‌గా ఉంచొద్దు.
*
“Check your death day”, “Find which celebrity do you look like”లాంటి మోసపూరిత పోస్ట్‌లకు స్పందించొద్దు.
* అవసరం లేకుంటే లొకేషన్‌ని టర్న్‌ఆఫ్‌ చేయండి.
* లాగిన్‌ వివరాలకు ‘సెక్యూరిటీ ఆన్సర్స్‌’ని పెట్టుకోవడం మర్చిపోవద్దు.
* ఎకౌంట్‌లను నిత్యం లాగిన్‌లో ఉంచొద్దు.
* పోస్ట్‌ చేయడానికి ముందు దాంట్లో ఏమైనా సున్నితమైన సమాచారాన్ని ఇస్తున్నామేమో చెక్‌ చేసుకోవాలి. ఉదాహరణకు.. ఓ పోస్ట్‌లో తండ్రి తన అందమైన కూతురు ఫొటో పోస్ట్‌ చేశాడు. దాంట్లో అమ్మాయి చదివే స్కూల్‌ పేరు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆ ఫొటో చూసిన వారికి ఆమె ఎక్కడ చదువుతుందో తెలుస్తుంది. దాని పర్యవసానాలు ఎలాగైనా ఉండొచ్చు. అందుకే ఏదైనా పోస్ట్‌ చేసే ముందు చెక్‌ చేసుకోండి.
* సోషల్‌ మీడియా ఎకౌంట్‌లలో అందుబాటులో ఉండే పుట్టిన రోజు, ఈమెయిల్‌ వివరాలతోనే హ్యాకర్లు మీరు వాడే సర్వీసుల్ని హ్యాక్‌ చేయొచ్చు. అందుకే పాస్‌వర్డ్‌లుగా క్లిష్టమైనవిగా ఉండాలి. ముద్దు పేర్లు, పుట్టిన రోజు, ఇంటి పేరు.. లాంటి వాటితో పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటే వాటిని ఇట్టే కనిపెట్టేస్తారు.
* అనవసరంగా ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని వాల్‌పై పోస్ట్‌ చేయొద్దు. ఉదాహరణకు.. ‘హ్యాపీ బర్త్‌ డే అమ్మా..’ అని చెప్పకుండా.. ‘హ్యాపీ బర్త్‌డే టూ మై డియర్‌ అమ్మ  సూర్యకాంత కుమారి’ అని పెడితే చాలు. మీ చేత్తో మీరే మీ పాస్‌వర్డ్‌కి పెట్టుకున్న ‘సెక్యూరిటీ ఆన్సర్‌’ని చెప్పినట్టే.
www.urlvoid.com అనేది ప్రశ్న అయితే.. మీ అమ్మ పేరుని కనుక్కోవడం హ్యాకర్‌కి క్షణాల్లో సాధ్యం అవుతుంది. ఎందుకంటే.. మిమ్మల్ని లక్ష్యం చేసుకున్నాక ప్రథమంగా చేసేది మీ సోషల్‌ ఎకౌంట్‌ని జల్లెడపట్టడమే.
* ట్విటర్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే యూఆర్‌ఎల్‌ లింక్‌పై క్లిక్‌ చేసే ముందు జాగ్రత్త పడండి. లింక్‌లు సురక్షితమో కాదో చెక్‌ చేసుకున్నాకే ఓపెన్‌ చేయండి.
www.urlvoid.com ఫేక్‌ లింక్‌లను పట్టుకునేందుకు ఈ సైట్‌ని వాడొచ్చు.
* ట్రావెల్‌ ప్లాన్‌ని పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్‌లపై పంచుకోవద్దు. ట్రిప్‌లో ఉండగా ఫొటోలను పోస్ట్‌ చేయకండి. వెకేషన్‌ పూర్తయ్యి ఇంటికి వచ్చాకే పోస్ట్‌ చేయడం మంచిది.
* ముఖ్యమైన సర్వీసుల్ని వాడే క్రమంలో ‘టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌’ని వాడండి. దీంతో లాగిన్‌ని సురక్షితం చేయొచ్చు.
* ఫోన్‌, పీసీ... వాడే డివైజ్‌ ఏదైనా సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లను వాడండి. డేటాని ఆన్‌లైన్‌లో పంపాల్సివస్తే సురక్షిత నెట్‌వర్క్‌లను వాడండి. పబ్లిక్‌ వై-ఫైల్లో వ్యక్తిగత సమాచారాన్ని షేర్‌ చేయొద్దు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.