ఇంగ్లాండ్‌. వివాదాస్పదం చేయొద్దు: వివియన్‌ 
close

తాజా వార్తలు

Published : 02/03/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంగ్లాండ్‌. వివాదాస్పదం చేయొద్దు: వివియన్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పిచ్‌ల విషయంలో ఇంగ్లాండ్‌ చేస్తున్న రాద్ధాంతానికి స్వస్తి పలకాలని క్రికెట్‌ దిగ్గజం సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ సూచించారు. అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టులో స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఆ జట్టు‌ రెండు రోజుల్లోనే చాపచుట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పిచ్ బాగోలేదని,‌ టెస్టు క్రికెట్‌కు సరికాదని పలువురు మాజీలు విమర్శలు చేశారు. అలాగే ఇదే విషయంపై ఇంగ్లాండ్‌ జట్టు కూడా ఐసీసీకి ఫిర్యాదు చేయాలనే ఆలోచనతో లోలోపల భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా స్పందించిన విండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌.. ఇంగ్లాండ్ ఇకనైనా వాటిని ఆపేయాలని చెప్పారు.

‘భారత్‌లో ఇటీవల జరిగిన చివరి రెండు టెస్టుల విషయంలో పిచ్‌లపై స్పందించమని నన్ను కొంత మంది కోరారు. అయితే, అది నాకు ఆశ్చర్యమేసింది. ఎవరైతే పిచ్‌ల గురించి అసహనం వ్యక్తం చేస్తున్నారో వారు ఒక విషయం అర్థం చేసుకోవాలి. పేస్‌కు అనుకూలించే వికెట్లపైనా టెస్టు మ్యాచ్‌లు ఆడతారు. అప్పుడు లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో పడిన బంతుల్ని ఎదుర్కోలేక బ్యాట్స్‌మెన్‌ విఫలమౌతారు. అయితే, ఆ సమయంలో బ్యాట్స్‌మెనే‌ సరిగ్గా ఆడలేకపోయారని అంటారు. ఒక్కోసారి కొంతమంది ఆటగాళ్లు ఆ బంతుల్ని చక్కగా ఎదుర్కొని ఆడతారు కూడా. అందుకే వీటిని ‘టెస్టు మ్యాచ్‌’లని పిలుస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మన ఆలోచనా విధానాన్ని పరీక్షించేదిగా ఉంది’ అని వివియన్‌ రిచర్డ్స్‌ అభిప్రాయపడ్డారు.

‘అలాగే భారత్‌కు వెళ్లేటప్పుడు స్పిన్‌కు అనుకూలించే గడ్డ పై అడుగుపెడుతున్నామని ముందే తెలియాలి. అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటామనే విషయాలకు సిద్ధంగా ఉండాలి. మూడో టెస్టు ఫలితం ఇంగ్లాండ్‌కు ఓ మంచి అవకాశంతో పాటు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకునే వీలు కల్పించింది. అయితే, నాలుగో టెస్టులోనూ ఇలాంటి వికెటే ఉంటుందని అర్థంచేసుకోవాలి. ఒకవేళ నేను అక్కడ ఉండి, పిచ్‌ను సిద్ధం చేసే బాధ్యత నాకు అప్పగిస్తే మళ్లీ అలాంటి పిచ్‌నే తయారు చేస్తా’ అని విండీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం పేర్కొన్నాడు. ఇక తొలి టెస్టు వరకూ ఇంగ్లాండ్‌ తనకు అనుకూల పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేసిందని, ఇప్పుడా పరిస్థితి లేదని ఈ మాజీ బ్యాట్స్‌మెన్‌ అంచనా వేశారు. వాళ్ల కంఫర్ట్‌ జోన్‌ దాటారు.. పరిస్థితులు మారాయి.. ఇప్పుడు స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు మార్గం అన్వేషించాలని సూచించాడు. టెస్టు మ్యాచ్‌లో స్పిన్‌కు కూడా ప్రాధాన్యం ఉంటుందని వివియన్‌ రిచర్డ్స్‌ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని