
తాజా వార్తలు
కొత్త మదుపరీ.. కాస్త జాగ్రత్త
కొవిడ్ -19 లాక్డౌన్ తర్వాత స్టాక్ మార్కెట్లో మదుపు చేసే యువ, కొత్త మదుపరుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించే వారు.. కొంత జాగ్రత్తగా ఉండక తప్పదు.. అందుకోసం వారు మార్కెట్‌పై అవగాహన పెంచుకోవాలి..
* మార్కెట్లో హెచ్చుతగ్గులు సహజం. ఒక షేరు స్వల్పకాలంలో రెట్టింపు అవుతుందనే వదంతులు నమ్మొద్ధు సొంత నిర్ణయాలు కాకుండా.. ఇతరుల ఆలోచనలకు మీరు ప్రభావితం కావద్ధు వారు చెప్పిన మాటలకు ఆకర్షితులై.. మీ అవసరాలకు కాకుండా.. ఇతరులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవద్ధు
* స్వల్పకాలంలో మార్కెట్లో వచ్చే హెచ్చుతగ్గుల నుంచి లాభాలను పొందాలనుకునే వారు ట్రేడర్లు. మంచి కంపెనీతో దీర్ఘకాలంపాటు ప్రయాణించి, పెట్టుబడి వృద్ధి చెందేలా చూసుకునే వారు ఇన్వెస్టర్లు. ఈ రెండింటిలో మీరేది అనేది చూసుకోండి. ఈ స్పష్టత లేకుండా మార్కెట్లోకి ప్రవేశించవద్ధు వీలైనంత వరకూ దీర్ఘకాల మదుపరిగానే కొనసాగండి.
* స్వల్పకాలంలోనే సంపదను సృష్టించాలనే తాపత్రయం వద్ధు మీ స్తోమతకు మించిన పెట్టుబడులు చేయొద్ధు అప్పులు చేసి, మదుపు చేయడం సరికాదు.
* మీ పెట్టుబడికి ఒక లక్ష్యం ఉండాలి. దీంతోపాటు వ్యవధినీ నిర్ణయించుకోవాలి. అప్పుడే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలరు.
* స్వల్పకాలంలో ట్రేడింగ్ నిర్వహించాలనుకుంటే స్టాప్ లాస్, ట్రెయిలింగ్ స్టాప్ లాస్‌ల వంటి వ్యూహం మేలు.
* మార్కెట్లో ఉండే వాస్తవ పరిస్థితులకు భిన్నంగా.. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్ధు ఇది నష్టాలకు దారి తీస్తుంది.
* నాణ్యత లేని కంపెనీల షేర్లు తగ్గే కొద్దీ కొనుగోలు చేస్తూ.. సగటు చేసేందుకు ప్రయత్నించవద్ధు దీనివల్ల నష్టపోయే ప్రమాదం ఉంది.
* మంచి యాజమాన్యం, సరైన వృద్ధితో లాభార్జన, రుణ భారం లేని సంస్థలను ఎంచుకునేందుకు ప్రయత్నించండి. ఆయా కంపెనీలు ఉన్న రంగాలనూ పరిశీలించాలి.
* దీర్ఘకాలిక పెట్టుబడి కోసం సంస్థలను ఎంచుకునేటప్పుడు గత ఐదేళ్ల వార్షిక నివేదికలు, పనితీరును అధ్యయనం చేయండి. దీనివల్ల కంపెనీ భవిష్యత్తును కొంతమేరకు అంచనా వేసేందుకు వీలవుతుంది. మీకు అవగాహనా పెరుగుతుంది.
* మీరు పెట్టిన పెట్టుబడికి దీర్ఘకాలంలో నష్టం రాకుండా చూసుకోవాలి. అదే సమయంలో మంచి రాబడీ అందాలి. పెట్టుబడులతో మీరెలా ప్రవర్తిస్తున్నారన్నదీ కీలకం. సరైన వ్యూహం, క్రమశిక్షణ మార్కెట్లో ఎప్పుడూ విజయాన్ని అందిస్తాయి.
- జె.వేణుగోపాల్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, జెన్ మనీ