Oxygen కావాలా? రావిచెట్టు కిందకి పొండి!
close

తాజా వార్తలు

Updated : 30/04/2021 18:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oxygen కావాలా? రావిచెట్టు కిందకి పొండి!

కరోనా బాధితులకు వింత అనుభవాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను కకావికలం చేస్తోంది. కావాల్సిన వారు ఊపిరాడక కళ్లెదుటే గిలగిలా కొట్టుకుంటున్నా ఏమీ చేయలేక.. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ..దుఃఖాన్ని దిగమింగుకునే వారు కొందరు. కుటుంబ సభ్యులను కోల్పోయామన్న బాధతో ఆర్తనాదాలు చేస్తున్నవారు మరికొందరు. కొన్నిచోట్ల వైద్యుల నిర్లక్ష్యం.. ఆక్సిజన్‌ సరఫరాలో ప్రభుత్వ వైఫల్యం.. వెరసి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బాధితుల ప్రాణాలు కాపాడుకునేందుకు వారి బంధువులు ఆక్సిజన్‌ ప్లాంట్ల చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదు. దీనికితోడు కొన్నిచోట్ల వైద్యాధికారుల మాటలు, పోలీసుల తీరు మానవత్వాన్ని చంపేసేలా ఉంటున్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ నియోజవర్గ పరిధిలో జరిగిన సంఘటనే దీనికి ఓ ఉదాహరణ. స్థానిక ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో బాధితుల బంధువులంతా ప్రయాగ్‌రాజ్‌ భాజపా ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ వాజ్‌పేయీకి చెందిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఎదుట గుమిగూడారు. ఆస్పత్రికి ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కోరారు. కానీ, ప్లాంట్‌ యాజమాన్యంతో మాట్లాడేందుకు అక్కడి పోలీసు సిబ్బంది అనుతివ్వలేదు. అంతేకాదు కాదా..  ‘‘అంతగా ఆక్సిజన్‌ ఆవసరం అనుకుంటే బాధితులను తీసుకెళ్లి రావి చెట్టుకింద కూర్చోబెట్టుకోండి. ఆక్సిజన్‌ స్థాయులు పెరుగుతాయి’’ అంటూ ఉచిత సలహా ఒకటి పడేశారు. దీంతో వారంతా ప్లాంట్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ‘‘ ఎక్కడికెళ్లినా ఆక్సిజన్‌ దొరకడం లేదు. ఆస్పత్రులు, ఆక్సిజన్‌ ప్లాంట్ల ఎదుట ‘నో స్టాక్‌’ బోర్డులు పెట్టేస్తున్నారు. కనీసం ప్లాంట్ల యాజమాన్యంతో మాట్లాడే అవకాశం కూడా ఉండటం లేదు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు’’ అంటూ బాధితుల బంధువులు వాపోతున్నారు. ప్రయాగ్‌రాజ్‌ నుంచి లఖ్‌నవూ వరకు ఇదే పరిస్థితులు ఉన్నాయంటూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడటంతో యూపీ ప్రభుత్వం స్పందించింది. మొత్తం 75 జిల్లాల్లో 47 జిల్లాలకు పీఎం కేర్స్‌ నిధుల నుంచి ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు గతవారమే కేంద్రాన్ని ఒప్పించింది. అయినప్పటికీ రాష్ట్రంలో చాలా చోట్ల అవసరమైన స్థాయిలో ఆక్సిజన్‌ లభించకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆక్సిజన్‌ కొరతను దృష్టిలో పెట్టుకొని లఖ్‌నవూ, వారణాశి, గోరఖ్‌పూర్‌, ఆగ్రా, ఆలీఘర్‌ మీరట్‌ తదితర చోట్ల కొత్తగా ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు యూపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని