
తాజా వార్తలు
సామాజిక మాధ్యమాలు చట్టాలకు లోబడి ఉండాలి
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా
దిల్లీ: అన్ని సామాజిక మాధ్యమాలు, ఓటీటీ సంస్థలకు పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. అదే విధంగా అన్ని డిజిటల్ సంస్థలూ దేశ చట్టాలకు లోబడి ఉండాలని ఆయన సూచించారు. గురువారం కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ డిజిటల్ మీడియాకు కొత్త నియమావళిని సూచించిన నేపథ్యంలో అమిత్‌షా ట్విటర్లో స్పందించారు. ‘‘ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు భారతీయ చట్టాలను గౌరవించాల్సిందే. కొత్త నియమ నిబంధనలు ఈ రోజు ప్రకటించాం. ఇవి సోషల్ మీడియా వినియోగదారులకు బలాన్నిస్తాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్‌కు నా అభినందనలు. ఈ నియమాలు ప్రస్తుతం ఎంతో అవసరం.’’ అని హోంమంత్రి ఆ ట్వీట్లలో పేర్కొన్నారు. ఆ ట్వీట్లలో ‘రెస్పాన్సిబుల్ ఫ్రీడం’ పేరుతో ఆయన హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారానికి కారణమయ్యే వ్యక్తి వివరాలను ప్రభుత్వానికి అందించడం, ఫిర్యాదులకు వీలైనంత త్వరలో పరిష్కరించడం వంటివి కేంద్రం తెలిపిన నిబంధనల్లో ప్రధానమైనవి.