
తాజా వార్తలు
భయం లేదు.. దాదా క్షేమం
గురువారం రెండో స్టెంట్ అమర్చే అవకాశం
ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం అత్యంత నిలకడగా ఉందని తెలిసింది. ఆయన ఆరోగ్యంపై దిగులుపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. దాదా ఈసీజీ రిపోర్టులో స్వల్ప మార్పులు కనిపించాయి. బుధవారం రాత్రి వైద్యులంతా కలిసి రెండో యాంజియోప్లాస్టీపై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. దాదాపుగా గురువారం రెండో స్టెంటు అమర్చే అవకాశం ఉంది.
గతంలోనే గుండెనొప్పితో బాధపడిన దాదా హృదయ రక్తనాళాల్లో మూడు పూడికలను గుర్తించారు. ఒకదాంట్లో స్టెంట్‌ను అమర్చారు. ఆ తర్వాత ఆరోగ్యంగానే ఉండటంతో రెండో స్టెంట్ వేయడాన్ని వాయిదా వేశారు. అయితే బుధవారం గంగూలీ అసౌకర్యంగా ఉన్నారని, ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పడంతో కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. సీసీయూ 142 యూనిట్లో ఆయనను ఉంచి చికిత్స అందిస్తున్నారు. దాదా ఆరోగ్యం అత్యంత నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు.. కుటుంబసభ్యులకు తెలిపారు.
ఆస్పత్రి వర్గాల ప్రకారం గంగూలీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసీజీ) నివేదికలో స్వల్ప మార్పులు గుర్తించారని తెలిసింది. వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దాదా ఆరోగ్యం విషమంగా ఏమీ లేదని ఆందోళన అక్కర్లేదని వారు తెలిపారు. యాంజియోప్లాస్టీపై నిర్ణయం తీసుకొనేముందు మరోసారి దాదాను పరీక్షించనున్నారు. గురువారం రెండో స్టెంట్ అమర్చుతారని అంటున్నారు.
ఇవీ చదవండి
రూట్.. రైట్ రైట్! కోహ్లీ ఆపగలడా?
గంగూలీకి మరోసారి అస్వస్థత?