
తాజా వార్తలు
ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాపరిషత్, మండలపరిషత్‌లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ఈమేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 5 నుంచి జిల్లాపరిషత్‌లలో, జనవరి 4 నుంచి మండల పరిషత్‌లలో ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.
గత ప్రభుత్వ హయాంలోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను ఆరు నెలలకు ఒకసారి పొడిగిస్తూ వచ్చింది. ఈనెల 4, 5 తేదీల్లో మండల పరిషత్, జిల్లాపరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలన ముగియనుంది. దీంతో మరో ఆర్నెల్లపాటు ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే ఏడాదిన్నరకు పైగా జడ్పీ, మండలపరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలన పూర్తయింది. గతేడాది స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ, ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య రగడ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, ఎస్ఈసీతో చర్చించి స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈక్రమంలో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
ఇవీ చదవండి..
ప్రమాణానికి నేను సిద్ధం.. జగన్ సిద్ధమా?: లోకేశ్
సీఎంపై బురద చల్లేందుకే..: సజ్జల