close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 13/07/2020 22:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా వ్యాక్సిన్‌ మనకెంత దూరం?

ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పరిశోధనలు
మానవులపై ప్రయోగాల్లో రష్యా ముందడుగు
భారత్‌లోనూ వేగంగా ట్రయల్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందా? అని ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. 160కి పైగా టీకాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని మూడో దశ ప్రయోగాల వరకు వచ్చాయి. ఎన్ని ప్రయోగాలు జరుగుతున్నా అవి మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తాయనే దానిపై స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పరీక్షలూ పూర్తి చేసుకుంటూ రేసులో దూసుకొచ్చింది రష్యా! ఈ ప్రకటనే ఇప్పుడు ఆశలు రేపుతోంది. కరోనాపై టీకాను సిద్ధం చేస్తున్నట్లు ఒడెర్నా, ఆస్ట్రాజెనెకా, సినోవాక్‌, భారత్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థలు ప్రకటించడంతో అందరి ఆశలు చిగురించాయి. పరిశోధన, అభివృద్ధిలో సానుకూల ఫలితాలతో ఒడెర్నా, ఆస్ట్రాజెనెకాతో పాటు భారత్‌ బయోటెక్‌ రేసులో నిలిచింది. వీటన్నింటినీ దాటుకుని రష్యాకు చెందిన సెచెనోవ్‌ యూనివర్సిటీ ముందుకు దూసుకొచ్చింది.

రష్యా ప్రకటనతో ఆశలు..
కరోనా నియంత్రణకు టీకా ప్రయోగాలకు కొదవేమీ లేదు. చాలా దేశాలకు చెందిన పరిశోధన సంస్థలు ఎప్పటి నుంచో ప్రయోగాలు జరుపుతున్నాయి. ఇందులో కొన్ని తుది దశ ప్రయోగాలకు చేరుకున్నాయి. అన్నీ పూర్తయ్యాక అనుమతులు లభించాక వ్యాక్సిన్‌ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఒక్కటీ ఎప్పుడనేది స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో కరోనాకు సంబంధించిన ప్రయోగాలన్నీ పూర్తయ్యాయని రష్యాకు చెందిన యూనివర్సిటీ ప్రకటించడం గమనార్హం. ఇలా అన్ని దశలూ దాటిన తొలి టీకా తమదేనని సెచెనోవ్‌ యూనివర్సిటీ వెల్లడించింది. పరీక్షల్లో పాల్గొన్న మొదటి వాలంటీర్లను జులై 15న, రెండో విడత పాల్గొన్న వారిని జులై 20న డిశ్చార్జి చేస్తామని ప్రకటించింది. రష్యాలోని గమేలెయ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీ అండ్‌ మైక్రో బయాలజీ అభివృద్ధి చేసిన టీకాపై ఈ వర్సిటీ ప్రయోగాలను చేసింది. జూన్‌ 18న ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇతర టీకాల మాదిరిగానే తమ టీకా కూడా సురక్షితమేనని వర్సిటీ ప్రకటించింది.

టీకాకు సంబంధించిన అన్ని సంస్థలూ క్లినికల్‌ ప్రయోగాలు పూర్తి చేస్తుంటాయి. అయితే, మానవులపై ప్రయోగానికి సంబంధించిన ఫలితాలపైనే టీకా సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సెచెనోవ్‌ వర్సిటీ చీఫ్‌ సైంటిస్ట్‌ ఎలీనా చెబుతున్న దాని ప్రకారం ఇలా మనుషులపై ప్రయోగాలు పూర్తి చేసిన తొలి దేశం రష్యానే. దీంతో టీకా రూపకర్తలు వాణిజ్య ఉత్పత్తికి సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేదీ వెల్లడించలేదు. ఈ వ్యాక్సిన్‌ను తొలుత ద్రవ రూపంలో బుర్డింకో సైనిక ఆస్పత్రిలో ప్రయోగించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు సెచెనోవ్‌ వర్సిటీలో ప్రయోగించింది పొడి రూపంలో ఉన్న వ్యాక్సిన్‌ అని అంటున్నారు. వాలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత 28 రోజుల పాటు వారిని ఆస్పత్రిలోనే పరిశీలన ఉంచారు. రెండు బృందాల్లోని వాలంటీర్లలోనూ రోగ నిరోధక వ్యవస్థ కరోనాకు వ్యతిరేకంగా ఉత్తేజితమైనట్లు పరిశోధకులు గుర్తించారు. క్లినికల్‌ ప్రయోగాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అందరి దృష్టీ ఇప్పుడు రష్యాపై పడింది.

12 దేశాలు.. 160కి పైగా టీకాలు
ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో 160కి పైగా టీకా అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇందులో 12 సంస్థల టీకా ప్రయోగాలు ఆశాజనకంగా ఉన్నాయి. వీటిలో భారత్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిలా ప్రయోగాలు చేస్తున్నాయి. చైనా, అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, ఆస్ట్రేలియా దేశాలు సైతం టీకా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నాయి. అమెరికాలో మెర్క్‌తో పాటు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీలు ఇదే పనిలో ఉన్నాయి. వీటి ఫలితాలు విజయవంతమైతే వచ్చే ఏడాది జులై నాటికి మార్కెట్‌లోకి టీకాలు వస్తాయని చెబుతున్నారు అమెరికాకు చెందిన నిపుణులు. వాస్తవానికి మూడు దశల్లో ప్రయోగాల అనంతరం మార్కెట్లోకి పంపించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నేరుగా మూడో దశ పరీక్షలు చేసేందుకు అమెరికా ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించింది.

రష్యా టీకా కంటే ముందు ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, సినోవాక్‌, కాన్సినో బయోలాజిక్స్‌ వ్యాక్సిన్‌ పరిశోధనలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. మరో మూడు నెలల్లో ఈ రెండూ కలిసి ఏజెడ్‌టీ 1222 టీకాను విడుదల చేస్తామని ప్రకటించాయి. ఈ టీకా మూడో దశ పరీక్షలను బ్రెజిల్‌లో నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ టీకాను ఉత్పత్తి చేసేందుకు భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన మోడెర్నా ఇన్‌కార్పొరేషన్‌ ఎంఆర్‌ఎన్‌ఏ 1273 రెండో దశ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెలలో 30 వేల మందిపై మూడోదశ పరీక్షలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ టీకా విజయవంతమైతే ఒక ఏడాదిలో 50 కోట్ల టీకాలను ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. 2021కల్లా టీకా అందుబాటులోకి వస్తుందని అంటోంది మోడెర్నా.

మరోవైపు చైనాలోని కాన్సినో బయోలాజిక్స్‌ మూడు దశల ప్రయోగాలు పూర్తి చేసుకుని అనుమతులు కోసం వేచిచూస్తోంది. సినోవాక్‌ సైతం కరోనావాక్‌ పేరుతో టీకాను అభివృద్ధి చేస్తోంది. రెండు దశల పరీక్షలను పూర్తిచేసుకుంది. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు టీకా కోసం పనిచేస్తున్నాయి. లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ అత్యంత చౌకగా టీకాను తెచ్చేందుకు కృషి చేస్తోంది. జర్మనీకి చెందిన క్యూర్‌ వాక్‌ ఏజీ వచ్చే ఏడాది మధ్యలో టీకాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 

భారత్‌లో బయోటెక్‌పై ఆశలు
భారత్‌లో కొవాగ్జిన్‌ పేరుతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న భారత్‌ బయోటెక్‌పై పెద్ద ఎత్తునే ఆశలు ఉన్నాయి. ఇప్పటికే మొదటి, రెండు విడతల ప్రయోగాల కోసం భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసింది. నిర్దేశించిన కేంద్రాల్లో ఇప్పటికే ప్రయోగాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ప్రీ క్లినికల్‌ అధ్యయనాలకు సంబంధించి ఈ సంస్థ పంపిన సమాచారం ఆధారంగా పరీక్షలకూ డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఆగస్టులో ఈ ప్రయోగాలు పూర్తిస్థాయిలో సాగనున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో కొవాగ్జిన్‌ టీకాను భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా సార్స్‌కోవ్‌-2 వైరస్‌ ట్రెయిల్‌ను భారత్‌ బయోటెక్‌కు ఎన్‌ఐవీ బదిలీ చేసింది. ఇప్పటికే పోలియో, రేబిస్‌, రోటా వైరస్‌, చికున్‌ గున్యా, జికా వైరస్‌ వంటి టీకాలను భారత్‌ బయోటెక్‌ ఆవిష్కరించింది. భారత్‌ బయోటెక్‌తో కలిసి వ్యాక్సిన్‌ను వీలైనంత తొందరగా తెచ్చేందుకు ఐసీఎంఆర్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. భారత ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆగస్టు 15 కల్లా టీకాను అందుబాటులోకి తేనున్నట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ఆ గడువుపై కొంత అనుమానాలు ఉన్నా.. సాధ్యమైనంత తొందరగా వ్యాక్సిన్‌ను తేనున్నట్లు చెబుతున్నారు. లక్ష్యాన్ని చేరుకోవడం అనేది క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్న చోట్ల నుంచి అందే సహకారంపైనే ఆధారపడి ఉండనుంది. విశాఖపట్నం కేజీహెచ్‌, హైదరాబాద్‌ నిమ్స్‌ సహా దేశవ్యాప్తంగా 12 చోట్ల ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇనాక్టివేటెడ్‌ విధానంలో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు జైడస్‌ క్యాడిలా కూడా మనుషులపై ప్రయోగాలకు సిద్ధమైంది.

అప్పటి వరకు దూరం.. దూరం
వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్రజలు తమవంతుగా బాధ్యతగా వ్యవహరించడం ఒక్కటే మార్గమని నిపుణులు అంటున్నారు. ఈ విషయంలో ఫ్రాన్స్‌కు చెందిన నిపుణుడు ఆర్నార్డ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాపై 100 శాతం సమర్థంగా పనిచేసే టీకా 2021 నాటికి కూడా వచ్చే అవకాశం తక్కువేనని అన్నారు. అంతవరకు ప్రజలు భౌతిక దూరం పాటించడం సహా వైరస్‌ నియమాలను కఠినంగా పాటించడమొక్కటే మార్గమంటున్నారు. కాబట్టి వ్యాక్సిన్‌ పట్ల ఆశాభావంతో ఉంటూనే కరోనా మహమ్మారి మన దరి చేరకుండా జాగ్రత్తగా వ్యవహరిద్దాం!!


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.