
తాజా వార్తలు
కేరళ భాజపా సీఎం అభ్యర్థిగా మెట్రోమ్యాన్
ప్రకటించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘మెట్రోమ్యాన్’ ఈ శ్రీధరన్ కీలకంగా మారారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు భాజపా ప్రకటించింది. కేరళ భాజపా చీఫ్ కే సురేంద్రన్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే మిగతా అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తామని ఆయన అన్నారు. శ్రీధరన్ ఇటీవల భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కమలం పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పదవి చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా వెల్లడించారు. కేరళలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు.
ఈ ప్రకటన రావడానికి ముందు శ్రీధరన్ మీడియాతో మాట్లాడారు. దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) యూనిఫాంలో ఇదే తనకు చివరిరోజని వెల్లడించారు. డీఎంఆర్సీకి రాజీనామా సమర్పించిన తరవాతే తాను ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపారు. దిల్లీ మెట్రో ప్రాజెక్టు రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన ఆయన.. దేశవ్యాప్తంగా మెట్రోమ్యాన్‌గా సుపరిచితులు. అలాగే దేశంలో పలు మెట్రో ప్రాజెక్టులకు ప్రధాన సలహాదారుగా పనిచేసిన ఘనత ఆయన సొంతం.