ఓట్ల కోసం నటించను: శ్రీప్రియ
close

తాజా వార్తలు

Published : 03/04/2021 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓట్ల కోసం నటించను: శ్రీప్రియ

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: అన్నా, కలైంజ్ఞర్, ఎంజీఆర్, జయలలిత అం దరూ సినిమా రంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటారని, ఆ వరుసలోనే తాము ఉంటామని అంటున్నారు ఎంఎన్‌ఎం మైలాపూర్‌ అభ్యర్థి శ్రీప్రియ. చెన్నైలోని కీలకమైన నియోజకవర్గం మైలాపూర్‌. ఇక్కడ అన్నాడీఎంకే తరఫున నటరాజ్, డీఎంకే నుంచి వేలు, మక్కల్‌ నీది మయ్యం తరఫున నటి శ్రీప్రియ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం సమయంలో శ్రీప్రియ ఇచ్చిన ఇంటర్వ్యూలో...

ప్రశ్న: మైలాపూర్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?

జవాబు: మైలాపూర్‌ నా స్వస్థలం. నేను పుట్టి పెరిగింది, వివాహం చేసుకుంది అన్నీ ఇక్కడే. చెన్నైలో నాకు బాగా తెలిసిన చోటు కూడా ఇదే. ఒక చోట మనం పనిచేస్తున్నామంటే ఆ ప్రాంతం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. నాకు మైలాపూర్‌ గురించి బాగా తెలుసు. అందుకే దీనిని ఎంచుకున్నా.

ప్రశ్న: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్య?

జ: మైలాపూర్‌ అంటేనే కపాలీశ్వరర్‌ ఆలయం, మసూదీలు, శాంతోమ్‌ చర్చి, సముద్రతీర రోడ్డులున్న అందమైన ప్రదేశం అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ దారిద్య్రరేఖకు దిగువన ఎంతోమంది నివసిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వీళ్లకోసం ఏదైనా చేసి ఉంటే ఈ ప్రజలు కూడా అభివృద్ధి చెంది ఉండేవారు. తాగునీరు, దోమలు, చెత్తకుప్పలు, డ్రైనేజ్‌ కాలువలను ఆనుకొని వారి గుడిసెలు ఉండడమే ప్రధాన సమస్యలు.

ప్రశ్న: అన్నాడీఎంకే, డీఎంకే ప్రభావం ఆ ప్రాంతంలో ఉందా?

జ: ప్రతి నాయకుడు పేదరికం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ధనవంతులయ్యారు. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి ఓట్లు అడిగి వెళ్లారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం మాకు ఉంది. ప్రజలు మార్పు రావాలని భావిస్తున్నారు. కాబట్టి తమకే ఓటు వేస్తారని నమ్ముతున్నా.

ప్రశ్న: గెలిస్తే మైలాపూర్‌లో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహిస్తారు?

జ: పట్టా సమస్యలు తీర్చి నీటి కొరత సమస్యను పరిష్కరిస్తాం. డ్రైనేజీలు పూడికతీయించి, దోమలు వృద్ధి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటాను. గెలిచిన మరుక్షణం ప్రజా సేవలోనే ఉంటాను.

ప్రశ్న: మీకు రాజకీయ అనుభవం లేదు కదా? ప్రజలు స్వీకరిస్తారా?

జ: నటన నా వృత్తి. జీవనాధారానికి నటిస్తున్నాను. ఓట్ల కోసం ఇక్కడ రాజకీయ నాయకులు నటిస్తున్నారు. నిస్వార్థంగా సేవ చేసేవారినే ప్రజలు ఎన్నుకుంటారు. కావున నన్ను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని