సీఎం ఆమోదంతోనే ఉక్కు ప్రైవేటీకరణ: తెదేపా
close

తాజా వార్తలు

Published : 18/02/2021 13:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎం ఆమోదంతోనే ఉక్కు ప్రైవేటీకరణ: తెదేపా

విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద తెదేపా నిరసన 

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఆమోదంతోనే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనే నిర్ణయం తీసుకుందని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి స్వయంగా చెప్పడంతోనే సీఎం నిజస్వరూపం బయటపడిందన్నారు. వైకాపా ప్రభుత్వం వాస్తవాలను దాచి పెట్టి ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డారు. ఈ మేరకు అయ్యన్నపాత్రుడు గురువారం వీడియో సందేశాన్ని విడుదల చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేసి వాటాల కోసం యత్నించడం దుర్మార్గమన్నారు.  

 విశాఖ వచ్చి స్వామీజీ కాళ్లు మొక్కిన జగన్‌కు స్టీల్‌ ప్లాంట్‌ దగ్గరికి వెళ్లి కార్మికులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చే తీరిక లేదా అని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. విమానాశ్రయానికి కొందరిని పిలిపించుకొని మాట్లాడిన సీఎం గర్వం, అహకారం ప్రదర్శించారన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ప్రధాన సూత్రధారి అయిన ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తాననడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. విజయసాయిరెడ్డి చేతనైతే సీఎంతో కలసి దిల్లీలో పాదయాత్ర చేయాలన్నారు. చీకటి ఒప్పందం వల్లే ప్రధాని వద్దకు వెళ్లలేకపోతున్నారని ఆక్షేపించారు. 

ప్రజలను మాయ చేసేందుకే పాదయాత్ర నిర్ణయం 

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ఇందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వమే ఉక్కు ప్రైవేటీకరణకు సహకరిస్తోందన్నారు. పోస్కో సంస్థతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారన్నారని మండిపడ్డారు. దిల్లీలో పెద్దలను కలిసి ఒప్పందాలు అమలయ్యేలా చూశారని ఆరోపించారు. విశాఖ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి మాట్లాడిన తర్వాత వైకాపా ప్రభుత్వం కుట్ర అర్థమైందన్నారు. ప్రజలను మాయ చేసేందుకే విజయసాయి పాదయాత్ర నిర్ణయమని తెలిపారు. వైకాపా ఎంపీలంతా రాజీనామా చేసి స్టీల్‌ ప్లాంట్‌ కోసం పోరాడాలని బోండా ఉమా డిమాండ్‌ చేశారు.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని