
తాజా వార్తలు
బుల్ జోరు: లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: రెండు రోజులుగా నష్టాల బాటలో పయనించిన దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కలిగించేందుకు ప్రధాని నరేంద్రమోదీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడంతో మార్కెట్లు కళకళలాడాయి. కొనుగోళ్లు పెరిగాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 637.49 పాయింట్లు లాభపడి 32008.61 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 187 పాయింట్లు పెరిగి 9383.55 వద్ద ముగిసింది. 1633 కంపెనీల షేర్ల ధరలు పెరగ్గా 723 కంపెనీల షేర్లు తగ్గుముఖం పట్టాయి. 169 కంపెనీల షేర్ల ధరల్లో మార్పులేదు.
యాక్సిస్ బ్యాంకు, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, జీ ఎంటర్టైన్మెంట్స్ షేర్లు కళకళలాడాయి. నెస్లే, సన్‌ఫార్మా, బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మాను మినహాయిస్తే మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ 4 శాతం, ఆటో, లోహ, ఇంధన, ఐటీ సూచీలు సానుకూలంగా ముగిశాయి.