close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 19/05/2020 10:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్‌పీఏలకు బ్యాడ్‌ బ్యాంక్ దారి చూపేనా?

ఇంటర్నెట్ డెస్క్‌: మూలిగే నక్కపై తాడి పండు పడట్టు ఇప్పటికే మాంద్యంలో చిక్కుకున్న భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా రూపంలో ఊహించని గట్టి దెబ్బే తగిలింది. కరోనా ధాటికి ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఇప్పట్లో కరోనా వైరస్‌కు విరుగుడు వ్యాక్సిన్‌ వచ్చే దాఖలాలు కనిపించడంలేదు. ఈ దశలో కరోనాతో  మానవజాతి జీవించాల్సిన పరిస్థితి ఎదురైంది. వైరస్‌ ప్రభావంతో దేశంలోని పర్యాటక, ఆతిథ్య,రవాణా రంగాలు ప్రత్యక్షంగా నష్టపోగా.. మిగతా రంగాలపై పరోక్షంగా ప్రభావంగా పడింది. అందులో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే బ్యాంకింగ్‌ రంగం ఒకటి.  ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా బ్యాంకులే మూలం. ఇటీవల కొన్ని బ్యాంకుల విలీనాలతో పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేసిన కేంద్రం.. కొత్తగా ‘బ్యాడ్‌ బ్యాంక్‌’ ఏర్పాటుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. దేశంలో వాణిజ్య, ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలవంటివి ఉండగా కొత్తగా ఈ బ్యాడ్‌ బ్యాంకు ఏంటి? అసలు ఇది వస్తే బ్యాంకింగ్ రంగానికి వచ్చే లబ్ధి ఎంటన్న విషయాలు ప్రస్తుతం ఆసక్తిగా మారాయి.

బ్యాడ్‌ బ్యాంక్‌ అంటే..

సాధారణంగా వాణిజ్య బ్యాంకులు అవి ఇచ్చే రుణాలపై వడ్డీ ఆధారంగా మనుగడ సాగిస్తుంటాయి. డిపాజిట్లు ఎక్కువగా ఉంటే ఆ బ్యాంకుకు అధికంగా రుణాలు ఇచ్చే వసూలు వెసులుబాటు కలుగుతుంది. ఫలితంగా కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చి ఉద్యోగాలు లభించి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతుంది. మరీ ఒకవేళ బ్యాంకులు ఇచ్చిన రుణాలు వసూలు కాకపోతే బ్యాంకులు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. ఇవే రుణాలు మొండి బకాయిలు (ఎన్‌పీఏ)లుగా మారి బ్యాంకులకు గుదిబండగా తయ్యారవుతున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ఎన్‌పీఏలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఈ తరుణంలో వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న ఎన్‌పీఏల సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఏర్పాటు చేస్తున్న కొత్త వ్యవస్థే బ్యాడ్‌ బ్యాంక్‌. ఈ బ్యాంకు ఎన్‌పీఏలపైనే ప్రధానంగా పనిచేస్తుంది.

బ్యాంకులకేంటి లాభం?
కొత్త బ్యాడ్ బ్యాంక్‌ ఏర్పాటు వల్ల వివిధ వాణిజ్య బ్యాంకుల్లో ఎటూ తేలకుండా ఉండిపోయిన ఎన్‌పీఏ ఖాతాలను బ్యాడ్‌ బ్యాంక్‌కు బదిలీ చేసే వెసులుబాటు కలుగుతుంది. దీంతో బ్యాంకులకు ఎన్‌పీఏ ఖాతాల తలనొప్పి తగ్గుతుంది. ఆయా ఖాతాల నుంచి రుణాలను రికవరీ చేయడం, రుణాలు తీసుకున్న సంస్థలతో చర్చలు జరపడం, లేదా ఈ మెండి బకాయిలను ఎలా తిరిగి రాబట్టాలో వంటి అంశాలపై బ్యాడ్ బ్యాంక్‌ దృష్టి సారిస్తుంది. ఎన్‌పీఏ ఖాతాలు బ్యాడ్‌ బ్యాంక్‌కు వెళ్లడంతో బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్‌లో వాటి ప్రస్తావన ఉండదు. ఫలితంగా బ్యాంకు పనితనం మెరుగపడి.. బ్యాంకు మూలధనం, డిపాజిట్లు పెరిగి బ్యాంకు అభివృద్ధికి బాటలు పడతాయి.

ఏఆర్‌సీ బ్యాడ్‌ బ్యాంక్‌కు తేడా?
బ్యాంకులు తమ వద్ద ఉన్న ఎన్‌పీఏలను వదిలించుకునేందుకు అసెట్ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీలను (ఏఆర్‌సీ)ను ఆశ్రయిస్తుంటాయి. ఏఆర్‌సీలు బ్యాంకుల వద్ద చౌకగా ఎన్‌పీఏలను కొని వాటి ఆర్థిక కార్యకలపాలు సాగిస్తుంటాయి. అలా బ్యాంకులు ఏఆర్‌సీలకు ఎంతో కొంతకు ఎన్‌పీఏలను అమ్మడం వల్ల నష్టాలను మూటగట్టుకుంటాయి.  మరోవైపు ఏఆర్‌సీలకు ఎన్‌పీఏలను విక్రయించడంతో బ్యాంకులు మొత్తం నష్టపోకుండా వాటికి కొంతైన మేలు జరుగుతుంది. మరీ బ్యాడ్‌ బ్యాంకు కూడా దాదాపు ఏఆర్‌సీ లాంటిదే. అయితే బ్యాడ్ బ్యాంక్‌లుకు వాణిజ్య బ్యాంకులు ఎన్‌పీఏలు అమ్మకుండా బదిలీ చేస్తాయి. బ్యాడ్‌ బ్యాంకు ఎన్‌పీఏలపై పనిచేసి తిరిగి వాటి నుంచి ఎలా రుణాలు రాబట్టాలి.. వాటిని లాభాల్లోకి తీసుకొచ్చేందకు తీసుకోవాల్సిన చర్యలు.. కొన్ని వెసులుబాటుల ద్వారా ఎన్‌పీఏ పనితీరు మెరుగుపరచడం వంటి వాటిపై బ్యాడ్‌ బ్యాంక్‌ దృష్టి సారిస్తుంది. 

ఏర్పాటు ఇలా..
ఎన్‌పీఏల సమస్యను పరిష్కరించేందుకు 2017 ఆర్థిక సర్వే పబ్లిక్‌ సెక్టార్‌ అసెట్ రిహాబిలిటేషన్‌ ఏజెన్సీ (PARA)ను ఏర్పాటు చేయాలని అప్పటి విత్త మంత్రి పీయూష్‌ గోయల్‌కు ప్రతిపాదించింది. దీనికి ప్రతిరూపమే బ్యాడ్ బ్యాంక్‌. అప్పటి నుంచి బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుపై చర్చలు సాగుతూనేతున్నాయి. మళ్లీ ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ఈ బ్యాడ్‌ బ్యాంక్‌ ప్రతిపాదనను కేంద్రం ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. ఇకవేళ అన్నీ కుదిరితే దాదాపు రూ. 9000 నుంచి రూ.10000 కోట్ల మూలధనంతో ఈ బ్యాడ్ బ్యాంక్‌ ఏర్పాటు కావచ్చని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో కేంద్రం వాటా 50శాతం ఉండనుండగా.. మిగతా మొత్తాన్ని వివిధ వాణిజ్య బ్యాంకులు సమకూర్చనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.  వీలైనంత త్వరగా ఈ బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటైతే బ్యాంకుల ఎన్‌పీఏల సమస్యకు పరిష్కారం దొరకడంతో పాటు వాటి బ్యాలెన్స్‌ షీటుల్లో ఎన్‌పీఏల ప్రస్తావన సమసిపోతుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.