
తాజా వార్తలు
రహదారులు.. పాదచారుల మృత్యుగీతికలు
గాలికంటే వేగంగా దూసుకొచ్చే వాహనాలు.. ఇసుకవేస్తే రాలనంత రద్దీ. నగరాల్లో ఇది నిత్యం కనిపించేదే. ఏటా వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరుగుతోంది. వీటితోపాటు ప్రమాదాలూ అధికమవుతున్నాయి. ఈ ఘటనల్లో అధికంగా నష్టపోయేది ఎవరు? అంటే.. ద్విచక్ర వాహనదారులు, పాదచారులే అన్న సమాధానం వినిపిస్తోంది. ఆయా దేశాల రవాణా విభాగాలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయం చెబుతోంది. రోడ్డు దాటుతున్న క్రమంలో ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలు ఢీ కొని పాదచారులు మరణిస్తున్నారు. దీంతో బాధిత కుటుంబాలను ఆర్థికంగానే కాక, మానసికంగా ఈ ప్రమాదాలు కుంగదీస్తున్నాయి.
93 శాతం మరణాలు అక్కడే..
ప్రపంచవ్యాప్తంగా ఏటా 13 లక్షల 50 వేల మంది రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారు. మరణిస్తున్న వారిలో సగం మంది పాదచారులు, సైక్లిస్టులు, ద్విచక్ర వాహనదారులే. రహదారి ప్రమాదాలతో ఆయా రాష్ట్రాల జీడీపీలో 3 శాతం మేర నష్టం వాటిల్లుతోంది. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించిన గణాంకాలివి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణాల్ని సగానికి తగ్గించాలని నిర్దేశించుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ గణాంకాలను చూస్తుంటే.. ఆ లక్ష్యం చేరుకోలేదనే అర్థమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో అల్ప, మధ్య ఆదాయా దేశాల్లోనే 93 శాతం మేర ఉంటున్నాయి. 5 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సున్న వారిపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోంది.
రెండో స్థానంలో భారత్
గత ఏడాది లాక్డౌన్ కారణంగా రోడ్డు ప్రమాదాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, 2019లో తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆ ఏడాది జరిగిన ప్రమాదాలను లెక్కగట్టగా అత్యధికంగా చైనాలోనే నమోదయ్యాయి. తర్వాతి స్థానం భారత్‌దే. 2019లో భారత్‌లో 2,12,846 ప్రమాదాలు జరగ్గా.. 63,093 మంది మరణించారు. ఆ తర్వాత అమెరికాలో 2లక్షల 21 వేలకుపైగా రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా.. 37,461 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్రీయ రహదారులు 5 శాతం మేర ఉండగా.. ఆ రోడ్లపైనే 61శాతం మరణాలు జరుగుతున్నాయి. మృతుల్లో 37శాతం ద్విచక్ర వాహనదారులు, 17శాతం మంది పాదచారులు ఉన్నారు. కార్లు, జీప్‌లు, ట్యాక్సీల ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య 16శాతంగా ఉంది. మిగతా.. ప్రమాదాల్లో మరణాలు ఏటా నమోదయ్యేవే అయినప్పటికీ మృతుల్లో పాదచారుల సంఖ్య పెరిగిపోతూ ఉండటమే ప్రధాన సమస్యగా మారింది. 2019లో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 25,858 మంది పాదచారులు ప్రాణాలొదిలారు.
చితికిపోతున్న పేదబతుకులు
రోడ్డు ప్రమాదాల్లో పేదల బతుకులు చితికిపోతున్నాయి. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఈ ప్రమాదాల్లో ఎక్కువగా పేదలే మృత్యువాతపడుతున్నారు. ఇలా మరణించిన వారిలో తగిన జీవనభృతి, ఉపాధిహామీ వంటివి లేనివారే అధికంగా ఉంటున్నారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో ద్విచక్రవాహనదారులు, పాదచారులు కలిపి సగటున 79శాతం మంది ఉంటున్నారని ఇటీవల విస్త్రృత పరిశీలనల్లో వెల్లడైంది. ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ అండ్ ఇంజూరీ ప్రివెన్షన్ ప్రోగ్రాం (టీఆర్ఐపీపీ), ఐఐటీ దిల్లీ ఆధ్వర్యంలోని బృందం పోలీస్స్టేషన్ల నుంచి రోడ్డుప్రమాదాలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు సేకరించింది. రోడ్డు ప్రమాదాల కారణంగా ఆర్థికంగా, సామాజికంగా పడే భారం, ప్రభావాలను పరిశీలించింది. దేశవ్యాప్తంగా 20 నగరాల్లోని 54 ఆస్పత్రుల్లో రోడ్డు ప్రమాద వివరాలను సేకరించగా.. సగటున 39శాతం మంది పాదచారులు రోడ్డు దాటుతున్న క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నట్లు వెల్లడైంది.
ఐఎఫ్‌పీ అదే చెప్పింది
భారత్‌లో రోడ్డు ప్రమాదానికి గురవుతున్న ప్రతి అయిదుగురు బాధితుల్లో ఒకరు పాదచారులని అంతర్జాతీయ సమాఖ్య (ఐఎఫ్‌పీ) గతంలోనే తేల్చి చెప్పింది. 2019లో ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టి మరణించిన పాదచారుల సంఖ్య 6,934గా ఉంది. కార్లు, ట్యాక్సీలు, మితిమీరిన వేగంతో వచ్చి ఢీ కొట్టడం వల్ల 6,458 మంది పాద చారులు మృత్యువాత పడ్డారు. దేశరాజధాని దిల్లీలోనూ ఇదే దుస్థితి. అంతర్జాతీయ రహదారి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, రహదారుల్లో లోపాలు లాంటి కారణాల వల్ల ఇక్కడ పాదచారుల మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
భాగ్యనగరంలో బిక్కు బిక్కు
2019లో దిల్లీలో 1,463 మరణాలు నమోదు కాగా.. అందులో 46 శాతం మేర పాదచారులే ఉన్నారు. ఇవి స్వయంగా దిల్లీ ట్రాఫిక్ పోలీస్ విభాగం చెప్పిన లెక్కలే. దిల్లీ, నోయిడా,గుడ్‌గావ్, ఘజియాబాద్ ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉన్నట్లు ఐఐటీ ముంబయి వెల్లడించింది. నాగ్‌పూర్‌లో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 22 శాతం మంది పాదచారులు మరణించారు. అత్యధిక ట్రాఫిక్ ఉండే హైదరాబాద్ విషయానికొస్తే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రోడ్డుపై నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏక్షణాన ఎటువైపు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియక పాదచారులు బిక్కుబిక్కుమంటూ అడుగులు వేస్తున్నారు. గత ఏడాది రోడ్డు దాటుతూ హైదరాబాద్‌లో 364 మంది మరణించారు. ఇటీవల అల్వాల్ ఠాణా పరిధిలో లారీ ఢీ కొట్టడం వల్ల ఇద్దరు దంపతులు అక్కడికక్కడే చనిపోగా.. చింతల్ బస్‌స్టాప్‌కు సమీపంలో జరిగిన మరో ఘటనలో ద్విచక్రవాహనం ఢీ కొట్టగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.