అన్సారీని యూపీకి తరలించండి..!
close

తాజా వార్తలు

Published : 27/03/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్సారీని యూపీకి తరలించండి..!

ఇంటర్నెట్‌డెస్క్‌ : పంజాబ్‌ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌ ఎమ్మెల్యే ముక్తార్‌ అన్సారీని ఆ రాష్ట్రానికి అప్పజెప్పాలని నేడు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో రెండు వారాల్లో ముక్తార్‌ అన్సారీని పంజాబ్‌లోని రోపర్‌ జైలు నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బండ జైలుకు తరలించాల్సి ఉంది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దీంతో ఉత్తర ప్రదేశ్‌లో పలు కేసులను ఎదుర్కొంటున్న ఈ బీఎస్‌పీ ఎమ్మెల్యేను యూపీ తరలించనున్నారు.

ఎవరీ ముక్తార్‌ అన్సారీ..?
ఉత్తరప్రదేశ్‌లోని ‘మావు’ నియోజకవర్గం నుంచి అన్సారీ ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనపై ఘజియాబాద్‌ జిల్లాలో దాదాపు 38కి పైగా కేసులు నమోదయ్యాయి. అన్నీ తీవ్రమైన నేరాలకు సంబంధించినవే. 2005లో జరిగిన భాజపా ఎమ్మెల్యే  కిష్ణానంద్‌ రాయ్‌ హత్య కేసులో ముక్తార్‌ ప్రధాన నిందితుల్లో ఒకరు. 2009లో జరిగిన ఓ జంట హ్యత కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. పంజాబ్‌ వెళ్లక ముందు యూపీలో ఆగ్రా, లఖ్‌నవూ, మావు, ఘజియాపూర్‌ జైళ్లలో గడిపారు. 2018లో గుండెపోటు వచ్చిందని చికిత్సకోసం కొన్ని ఆసుపత్రులు కూడా తిరిగారు. 2019లో జైలు నుంచి ఫోన్‌ చేసి పంజాబ్‌లోని ఓ వ్యాపారవేత్తను బెదిరించనట్లు ఆరోపణలు వచ్చాయి. అన్సారీ రూ.10 కోట్లు డిమాండ్‌ చేశారు. దీంతో పంజాబ్‌ పోలీసులు ప్రొడక్షన్‌ వారెంట్‌పై అన్నారీని తీసుకెళ్లారు. అక్కడి నుంచి వివాదం మొదలైంది.

పంజాబ్‌ వర్సెస్‌ యూపీ..!
అన్సారీని తిరిగి యూపీ పోలీసులకు అప్పజెప్పే విషయంలో వివాదం చెలరేగింది. ముక్తార్‌ అన్సారీని సుదూర ప్రయాణాలు చేయకూడదని వైద్యులు చెప్పారని పంజాబ్‌ పోలీసులు అతడిని యూపీ పోలీసులకు అప్పగించలేదు. అతడికి వెన్నునొప్పి, మదుమేహం ఉన్నాయని వెల్లడించారు. అన్సారీని మూడు నెలలు పూర్తిగా బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొన్నారు. ఇక పంజాబ్‌లో కాంగ్రెస్‌ సర్కారు ఉండటం.. యూపీలో భాజపా సర్కారు ఉండటంతో ఈ విషయం రాజకీయ రంగు పులుముకొంది. పంజాబ్‌ సర్కారు నేరస్థుడిని కాపాడుతోందంటూ యూపీలోని భాజపా ఆరోపించింది. ఈ విషయం సుప్రీం కోర్టుకు చేరింది.

ఈ కేసులో అన్సారీని యూపీకి తరలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను, కేసులను దిల్లీకి బదలీ చేయాలని అన్సారీ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. వీటిని విచారించి నేడు తీర్పును వెలువరించింది. అన్సారీ పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అన్సారీని రెండు వారాల్లో యూపీలో బండ జైలుకు తరలించాలని తీర్పునిచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని