
తాజా వార్తలు
సూర్య అదే జోరు: 47 బంతుల్లో 120
ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పరుగుల వరద పారించిన సూర్యకుమార్ యాదవ్ ఇంకా అదే టచ్‌లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి ముందు జరిగిన ఓ సన్నాహక టీ20 మ్యాచులో సుడిగాలిలా విరుచుకుపడ్డాడు. ఎడాపెడా బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. కేవలం 47 బంతుల్లో 120 పరుగులు సాధించాడు. దీనికి తోడు సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ వేసిన ఓ ఓవర్లో 21 పరుగులు సాధించడం గమనార్హం.
సయ్యద్ ముస్తాక్ టోర్నీకి ముందుగా టీమ్-బి, టీమ్-డి ఓ సన్నాహక మ్యాచులో తలపడ్డాయి. బి-జట్టుకు సూర్యకుమార్ సారథ్యం వహించగా డి-జట్టుకు యశస్వీ జైస్వాల్ నాయకత్వం వహించాడు. కాగా మూడో స్థానంలో దిగిన సూర్య ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. వారి బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. 10 బౌండరీలు, 9 సిక్సర్లతో 255.32 స్ట్రైక్‌రేట్‌తో 120 పరుగులు చేశాడు. ఇక అర్జున్ తెందూల్కర్ వేసిన 13వ ఓవర్లో వరుస బౌండరీలతో 21 పరుగులు సాధించాడు. అంతకుముందు రెండు ఓవర్లు అర్జున్ బాగా వేయడం గమనార్హం. సూర్య దూకుడుతో అతడి జట్టు 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
ఇవీ చదవండి
2020.. కోహ్లీ ఏంటి?
క్రికెటర్ సురేశ్ రైనా అరెస్టు