close

తాజా వార్తలు

చిన్నమ్మ ఇక లేరు

తీవ్ర గుండెపోటుతో సుష్మా స్వరాజ్‌ హఠాన్మరణం
ప్రధాని సహా ప్రముఖుల సంతాపం

దిల్లీ: భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఇక లేరు. తీవ్ర గుండెపోటుకు గురైన ఆమె హఠాన్మరణం చెందారు. 67 ఏళ్ల సుష్మాకు  మంగళవారం రాత్రి 10.15 గంటల సమయంలో గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)కు తరలించారు. ఆ వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు మార్చారు. చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు. సుష్మా స్వరాజ్‌ అస్వస్థతకు గురయ్యారని తెలియగానే పలువురు కేంద్ర మంత్రులు హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆమె మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  సుష్మా ఆకస్మిక మరణ వార్త భాజపా నేతలు, కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమెకు 2016లో మూత్రపిండ మార్పిడి జరిగింది. అనారోగ్య కారణాల రీత్యా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. ఆమెకు భర్త స్వరాజ్‌ కౌశల్‌, కుమార్తె బన్సురి ఉన్నారు.

భారతీయతకు ప్రతిబింబం
భారత రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. సాటిలేని వాగ్దాటి ఆగిపోయింది. నిండైన కుంకుమ బొట్టుతో సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఆ రూపం కనుమరుగైంది. పదునైన విమర్శలతో రాజకీయ ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసే ఆ గళం ఇక వినిపించదు. ఆపన్నులు ఏ సమయంలో సహాయం కోరినా నేనున్నానంటూ భరోసా ఇచ్చే ఆ అభయహస్తం వాలిపోయింది. దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకొని సుష్మా స్వరాజ్‌ దివికేగారు. సుష్మ సాధారణ నేపథ్యం నుంచి వచ్చారు. రాజకీయాల్లో రాణించాలని ఆంకాంక్షించే ఎందరో యువతులకు ఆదర్శంగా నిలిచారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎన్నెన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 
కళల్లో మేటి 
సుష్మ స్వస్థలం ప్రస్తుత హరియాణాలోని అంబాలా. హరిదేవ్‌ శర్మ, లక్ష్మీదేవి దంపతులకు ఆమె 1952 ఫిబ్రవరి 14న జన్మించారు. హరిదేవ్‌ ఆరెస్సెస్‌లో చాలా కీలకంగా పనిచేసేవారు. సుష్మ చదువుల్లో చురుకు. సంగీతం, లలిత కళలు, నాటకాలపై ఆసక్తి ఎక్కువ. సాహిత్యం, కవితలను విపరీతంగా చదివేవారు. అంబాలాలోని ఎస్‌.డి.కళాశాలలో బీఏ చదువుతున్నప్పుడు వరుసగా మూడేళ్లపాటు ఎన్‌సీసీలో ఉత్తమ క్యాడెట్‌గా ఎంపికయ్యారు. ఆ కళాశాలలో ఉత్తమ విద్యార్థి పురస్కారాన్నీ పొందారు. హరియాణా భాషా శాఖ నిర్వహించిన పోటీల్లో వరుసగా మూడేళ్లపాటు అత్యుత్తమ హిందీ వక్త అవార్డు గెలుపొందారు. పలు ఇతర వక్తృత్వ పోటీలు, చర్చలు, నాటక పోటీల్లో అవార్డులు పొందారు. 


విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి.. 
సుష్మ విద్యార్థిగా ఉన్నప్పుడే 1970ల్లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆపై జనతా పార్టీలో చేరారు. అత్యయిక స్థితికి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. 1977లో తొలిసారిగా హరియాణాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఏడాది కేవలం 25 ఏళ్ల వయసులో రాష్ట్ర కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మనదేశంలో అత్యంత పిన్న వయసులో కేబినెట్‌ మంత్రి పదవిని అలంకరించిన వ్యక్తి ఆమే. ఆపై 1987-90 మధ్య కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. 27 ఏళ్ల వయసులో హరియాణా జనతా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 
దిల్లీ సీఎం పీఠంపై 
1990 ఏప్రిల్‌లో రాజ్యసభ ఎంపీగా సుష్మ బాధ్యతలు చేపట్టారు. 1996లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998లో దిల్లీలోని హాజ్‌ ఖాస్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అదే ఏడాది అక్టోబరులో దిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దిల్లీ సీఎం పీఠమెక్కిన తొలి మహిళ ఆమే. 
విప్లవాత్మక నిర్ణయం 
1996లో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం కేవలం 13 రోజులపాటు కొనసాగిన సమయంలో సుష్మ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా ఉన్నారు. లోక్‌సభలో జరిగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని అప్పట్లో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 


విదేశాంగ మంత్రిగా..  
సుష్మ మళ్లీ 2000 సెప్టెంబర్‌ 30 నుంచి 2003 జనవరి 29 మధ్య కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర ఆరోగ్యం - కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 జూన్‌ 3న లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ ఉప నేతగా బాధ్యతలు చేపట్టారు. ఆపై లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ నేతగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఘనత సొంతం చేసుకున్నారు. 2014 మే 26 నుంచి 2019 మే 30 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన మహిళ సుష్మే.  
భర్త ప్రోత్సాహం 
క్రిమినల్‌ న్యాయవాది స్వరాజ్‌ కౌశల్‌ను 1975 జులై 13న సుష్మ వివాహమాడారు. రాజకీయాల్లో రాణించేలా ఆయన సుష్మకు పూర్తి ప్రోత్సాహం అందించారు. 1990-93 మధ్య మిజోరం గవర్నర్‌గా కౌశల్‌ పనిచేశారు. మనదేశంలో అతి పిన్న వయసులో గవర్నర్‌ పదవిని చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు. 1998-2004 మధ్య కౌశల్‌ ఎంపీగా కూడా ఉన్నారు. సుష్మ-కౌశల్‌ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె. ఆమె పేరు బన్సూరీ కౌశల్‌. బన్సూరీ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు.
తెలంగాణ ఉద్యమానికి అండగా..
ఈనాడు, హైదరాబాద్‌: ‘‘తెలంగాణ సాకారంలో ఆ అమ్మ (సోనియా)నే కాదు.. ఈ చిన్నమ్మనూ గుర్తుంచుకోండి’’.. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే తెలంగాణ ఎంపీలతో సుష్మాస్వరాజ్‌ అన్న మాటలివి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సుష్మ మనస్ఫూర్తిగా మద్దతిచ్చారు. 2009 నుంచి 2014 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఆమె వ్యవహరించడం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా మారింది. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉండగా.. ఆమె మాట మార్చకుండా సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో బిల్లు ఆమోదం పొందింది. ఉద్యమ సమయంలో సుష్మ.. పార్లమెంటు వెలుపలా, లోపలా తెలంగాణవాదానికి అండగా నిలిచారు. దిల్లీలో జంతర్‌మంతర్‌, ఏపీ భవన్‌, ఇతర చోట్ల జరిగిన ఆందోళనల్లో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో జరిగిన ఉద్యమ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. 2017 నవంబరు 28న హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు విదేశాంగ మంత్రి హోదాలో ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంలోనూ తాను తెలంగాణకు చిన్నమ్మనంటూ పునరుద్ఘాటించారు. రాష్ట్రంతో ఉన్న అనుబంధాన్ని అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించుకున్నారు. 

సుష్మ ఘనతలు 
* అతి పిన్న వయసులో రాష్ట్ర కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు 
* లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన తొలి మహిళ 
* 2008, 2010లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డులు 
* జాతీయ స్థాయి పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేసిన తొలి మహిళ 

జైపాల్‌ రెడ్డిలా ఉత్తమ వక్త  
శుద్ధహిందీలో ఆమె చేసే ప్రసంగాలు గంగా ప్రవాహంలా సాగేవి. చట్టసభల్లో అత్యుత్తమ వక్తల్లో ఒక్కరైన జైపాల్‌రెడ్డి కన్నుమూసిన వారం రోజులకే ఆమె స్వర్గస్థులవడం ప్రజాస్వామ్య ప్రేమికులకు ఆవేదన కలిగించింది. 

చివరి అభినందన ప్రధాని మోదీకే!
జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించటంపై ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ ఆమె మంగళవారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. ‘‘థ్యాంక్యూ ప్రైమ్‌ మినిస్టర్‌. థ్యాంకూ వెరిమచ్‌. నా జీవితంలో ఇలాంటి రోజు కోసమే ఎదురుచూస్తున్నాను’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సంతాపం..
సుష్మా స్వరాజ్‌ ఆకస్మిక మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశం గొప్ప ప్రజాదరణ ఉన్న నేతను కోల్పోయిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. పాలనా దక్షత ఉన్న నేత, గొప్ప పార్లమెంటేరియన్‌, మంచి వక్త అయిన సుష్మా స్వరాజ్‌ మృతి తీరనిలోటు అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు.
గొప్ప అధ్యాయం ముగిసింది: ప్రధాని నరేంద్ర మోదీ
సుష్మాజీ అస్తమయంతో భారత రాజకీయాల్లో ఓ గొప్ప అధ్యాయం ముగిసింది. ఆమె అద్భుత కార్యదక్షత కలిగిన నేత. ఆమె నిర్వహించిన ప్రతి మంత్రిత్వ శాఖలోనూ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారు. వివిధ దేశాలతో భారత్‌ సంబంధాలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషించారు. ప్రపంచంలో ఎక్కడైనా భారతీయులు బాధల్లో ఉంటే ఆమె వెంటనే స్పందించి సాయం అందించేవారు. 
సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి
కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వివిధ హోదాల్లో ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడారు. సుష్మ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.