Nandigram: హోరాహోరీ పోరులో సువేందు గెలుపు
close

తాజా వార్తలు

Updated : 02/05/2021 21:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nandigram: హోరాహోరీ పోరులో సువేందు గెలుపు

ఫలితమేదైనా అంగీకరిస్తానన్న మమతా బెనర్జీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఆదినుంచి ఉత్కంఠరేపిన నందిగ్రామ్‌లో భాజపా అభ్యర్థి సువేందు అధికారి విజయం సాధించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 1736 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో చివరకు భాజపా నేత సువేందు అధికారి విజయం సాధించారు. ఈ సందర్భంగా నందిగ్రామ్‌లో ఫలితమేదైనా అంగీకరిస్తానని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

ఆదినుంచి ఉత్కంఠే..!

తృణమూల్‌ను వీడిన సువేందు అధికారి భాజపా తరపున నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగారు. ఇదే సమయంలో భవానీపూర్‌ నుంచి పోటి చేస్తారనుకున్న మమతా బెనర్జీ చివరకు నందిగ్రామ్‌ నుంచే పోటీకి దిగడంతో అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అప్పటినుంచి ఓట్ల లెక్కింపు వరకు ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. తొలుత మమతా బెనర్జీదే విజయమని వార్తలు వచ్చినప్పటికీ.. తర్వాత సువేందు అధికారి ఆధిక్యం సాధించడంతో ఆయన గెలుపు ఖాయమైంది.

కొనసాగిన మాటల యుద్ధం..

సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సువేందు అధికారిపై ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ప్రత్యర్థిగా పోటీలో దిగడంతో ఆయనపై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ రాష్ట్రంలో తృణమూల్‌ శ్రేణుల అరాచకాలను సువేందు అధికారి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ముఖ్యంగా తృణమూల్‌కు ఓటేస్తే బెంగాల్‌ మరో మినీ పాకిస్తాన్‌ అవుతుందంటూ సువేందు తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా భాజపా నాయకులపై అసభ్య పదజాలాన్ని వాడుతూ నందిగ్రామ్‌ ప్రజలను దీదీ అవమాన పరుస్తోందని విమర్శించారు. తన కాలికి జరిగిన గాయాన్ని కూడా దాడిగా వక్రీకరించి సానుభూతి పొందేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఒకప్పుడు సాధారణ మహిళగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం వేల రూపాయల విలువైన దుస్తులు ధరిస్తున్నారని దీదీని విమర్శించారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో మమతా బెనర్జీ రిగ్గింగ్‌కు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేసిన సువేందు అధికారి చివరకు విజయం సాధించారు.

సువేందుపై తీవ్ర ఆరోపణలు చేసిన దీదీ

పార్టీని వీడడంతో పాటు తనపైనే విమర్శలకు దిగిన సువేందు అధికారిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యుద్ధం ప్రకటించారనే చెప్పవచ్చు. ప్రచారం ప్రారంభించిన తొలినుంచి సువేందుతో పాటు ఆయన కుటుంబంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన మమతా బెనర్జీ..  సువేందు, అతని తండ్రిని నమ్మక ద్రోహులుగా పేర్కొన్నారు. 2007లో నందిగ్రామ్‌లో చోటుచేసుకున్న మరణాల వెనక సూత్రధారులు వారే( శిశిర్‌ అధికారి, సువేందు అధికారి) అని మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, పద్నాలుగేళ్ల తరవాత మమత అకస్మాత్తుగా బహిరంగంగా ఈ విషయాన్ని ఎందుకు ప్రకటించారనే ప్రశ్నలు మొదలయ్యాయి. కేవలం రాజకీయాల కోసమే అత్యంత కీలకమైన ఎన్నికలకు కొన్ని రోజుల ముందు అలాంటి ప్రకటన చేశారనే విమర్శలు వచ్చాయి. ఇలా పలు రకాలుగా మమతా బెనర్జీ ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.

మూడు దశాబ్దాల చరిత్రను మట్టికరిపించి..

నందిగ్రామ్‌ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది అధికారి కుటుంబమేనని బెంగాల్‌లోని మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఒకరకంగా ఆ ఉద్యమం వల్లే 2011లో వామపక్ష ప్రభుత్వం కుప్పకూలిపోయినట్లు చెబుతారు. సీపీఎంకు కంచుకోటగా ఉన్న జంగల్‌మహల్‌ ప్రాంతాన్ని తృణమూల్‌ వైపు తిప్పడంలో అధికారి కుటుంబానిదే కీలక పాత్ర. తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాకు చెందిన సువేందు అధికారి.. ముర్షీదాబాద్‌, మాల్దా, పురూలియా, బంకురాలలో రాజకీయంగా అధిక ప్రభావం చూపగలిగిన నాయకుడు. ఈ జిల్లాల్లోనే తృణమూల్‌ కాంగ్రెస్‌కు గట్టి పునాదులు ఏర్పడేందుకు ఆయన క్షేత్రస్థాయిలో విశేషంగా పనిచేశారు. అయితే, తాజాగా బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే తనపై పోటీకి దిగడంతో సువేందు అధికారి ఛాలెంజ్‌గానే తీసుకున్నారు. ప్రచారంలో భాగంగా తృణమూల్‌ శ్రేణుల అరాచకాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో కలియదిరిగారు. చివరకు హోరాహోరీ పోరులో మమతా బెనర్జీపై విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాత్రం టీఎంసీ తరపున పోటీ చేసిన సువేందు అధికారి లక్షా 30వేల ఓట్లు సాధించారు. ఈసారి మాత్రం ఓట్ల సంఖ్య తక్కువగానే వచ్చినట్లు తెలుస్తోంది.

ఇలా దేశం మొత్తం ఆసక్తిగా చూసిన నందిగ్రామ్‌ పోరు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. వాడీవేడీగా జరిగిన పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయ దుందుభి మోగించినప్పటికీ నందిగ్రామ్‌లో మాత్రం ఓటమి పాలయ్యారు. అయితే, నందిగ్రామ్‌లో ఓటమి చెందడం పెద్ద విషయమేమి కాదని..ఫలితమేదైనా అంగీకరిస్తానని మమతా బెనర్జీ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని