తాడిపత్రి ఛైర్మన్‌ ఎన్నికపై అదే ఉత్కంఠ 
close

తాజా వార్తలు

Updated : 17/03/2021 12:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తాడిపత్రి ఛైర్మన్‌ ఎన్నికపై అదే ఉత్కంఠ 

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం రసవత్తరంగా మారింది. ప్రజా తీర్పుతో గెలుపొందిన తెదేపా కౌన్సిలర్లను ఏ విధంగానైనా తమ గూటికి తీసుకెళ్లాలని వైకాపా శక్తియుక్తులన్నీ ఒడ్డుతుంటే, చేజారిపోకుండా ప్రతిపక్ష పార్టీ వ్యూహంతో ఉంది. తాడిపత్రి పురపాలక ఛైర్మన్‌ ఎన్నిక గురువారం జరగనుంది. తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓటును మున్సిపల్‌ కమిషనర్‌ రెండు రోజుల కిందట తిరస్కరించారు. అప్పటి నుంచి  ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.

ఈ క్రమంలో కౌన్సిలర్లు చేజారకుండా తెలుగుదేశం పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి రహస్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో తెదేపా తరఫున గెలిచిన 18 మంది కౌన్సిలర్లతో పాటు ఒక సీపీఐ, ఒక స్వతంత్ర కౌన్సిలర్‌ ఉన్నారు. ఛైర్మన్‌ ఎన్నికలో తెలుగుదేశం పార్టీకే మద్దతిస్తామనే స్పష్టమైన హామీ ఇచ్చి శిబిరంలో కొనసాగుతున్నారు. 20 మందిలో ఏ ఒక్కరూ చేజారే అవకాశం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి దీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయలో తెదేపా ప్రతిపాదించే ఛైర్మన్‌ అభ్యర్థికే తాము మద్దతిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ తాడిపత్రి మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌రెడ్డికి ముందుగానే విప్‌ సమర్పించారు.

మొత్తం 36 స్థానాలున్న తాడిపత్రి పురపాలికలో తెదేపా 18, వైకాపా నుంచి 16 మంది కౌన్సిలర్లు గెలవగా.. ఒకటి సీపీఐ, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించిన విషయం తెలసిందే. కాగా, వైకాపాకు ఎంపీ, ఎమ్మెల్యేల ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నాయి. దీంతో వైకాపా బలం 18కి చేరి తెదేపాకు సమానమైంది. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో తెదేపా బలం 20కి చేరింది. దీంతో తామే ఛైర్మన్‌ పీఠం దక్కించుకుంటామని తెదేపా శ్రేణులు చెబుతున్నాయి.   


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని