
తాజా వార్తలు
తిరుపతిలో తెదేపా ధర్మపరిరక్షణ యాత్ర ఉద్రిక్తం
తెదేపా నేతలను నిర్బంధించిన పోలీసులు
తిరుపతి: తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ధర్మపరిరక్షణ యాత్రకు తెదేపా పిలుపునిచ్చింది. యాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. యాత్ర ప్రారంభించడానికి సిద్ధమైన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బస చేసిన హోటల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అచ్చెన్నాయుడితో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ తదితరులను హోటల్ గదిలోనే నిర్బంధించారు.
ఈ నేపథ్యంలో అచ్చెన్న బస చేసిన హోటల్ వద్దకు తెదేపా శ్రేణులు భారీగా చేరుకోవడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ధర్మం, న్యాయం లేకుండా వైకాపా అల్లకల్లోలం చేసింది. సీఎం జగన్కు దేవుళ్లంటే భయం లేదు. ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా ఆయనలో చలనం లేదు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తున్నారు. ధర్మపరిరక్షణ యాత్రకు నిన్న అనుమతి ఇచ్చిన పోలీసులు.. ఇవాళ రద్దు చేయడానికి గల కారణమేంటి. గదిలోనే ఉన్నా నిబంధనలు అతిక్రమించారని నిర్బంధించడం అన్యాయం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపరిరక్షణ యాత్ర జరిగితే ముఖ్యమంత్రి నిజస్వరూపం బయటపడుతుందనే అడ్డుకుంటున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. అచ్చెన్నను విడుదల చేయాలని తిరుపతి పార్లమెంట్ తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మీ డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి..
ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
కళా వెంకటరావు చేసిన తప్పేంటి?:చంద్రబాబు