
తాజా వార్తలు
తెదేపా నేత హత్యకేసు: ఆరుగురి అరెస్ట్
వివరాలు వెల్లడించిన ఎస్పీ విశాల్ గున్నీ
గుంటూరు నేర వార్తలు : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ఈనెల 3న హత్య గురైన తెదేపా నేత, మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని మీడియాకు బుధవారం వెల్లడించారు. పాతకక్షల నేపథ్యంలోనే అంకులు హత్య జరిగినట్లు వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ‘‘పెదగార్లపాడు గ్రామానికి చెందిన పురంశెట్టి అంకులు గతంలో నిషేధిత నక్సల్ సంస్థ జనశక్తిలో పనిచేశారు. అతడితో పాటే అదే గ్రామానికి చెందిన చిన్నశంకరరావు, వెంకట కోటయ్య, వెంకటేశ్వరరెడ్డి కూడా గతంలో అందులో ఉన్నారు. వీరికి, అంకుల్‌కు మధ్య కొనేళ్లుగా విభేధాలు ఉన్నాయి. ఈ సమయంలోనే అంకులు వద్ద మూడు దశాబ్దాలుగా నమ్మకంగా పనిచేస్తున్న చిన్న కోటేశ్వరరావు తనకు సరిగా జీతం ఇవ్వడం లేదని ద్వేషం పెంచుకున్నాడు.
ఇలా వీరంతా చేతులు కలిపి అంకులును హతమార్చేందుకు ప్రణాళిక వేశారు. పథకం ప్రకారం చిన్నశంకరరావు తన బంధువులైన అంకారావు, రమేశ్‌లను పిలిపించాడు. అనంతరం జనవరి 3న అంకులును పెదగార్లపాడు గ్రామంలో ఉన్న తన అపార్టుమెంట్‌కు రావాలని కోరారు. జనశక్తిలో పనిచేసి ఉండటంతో ఆ సంస్థకు సంబంధించిన కొత్త నియామకాల గురించి మాట్లాడుకుందామన్నారు. దాంతో అక్కడి వచ్చిన అంకులుకు తొలుత మత్తు పదార్థం కలిపిన అల్పాహారం తినిపించారు. తర్వాత టవల్‌తో గొంతు బిగించి, కత్తితో కోసి హతమార్చారు’’ అని ఎస్పీ పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వెంకటకోటయ్య, చిన్నశంకరరావు, వెంకటేశ్వరరెడ్డి, చిన్నకోటేశ్వరావు, అంకారావు, రమేశ్‌లను అరెస్టు చేశామన్నారు. త్వరలో వీరిని కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.
ఇవీ చదవండి..
‘వాల్తేర్ క్లబ్ వివాదంలో సిట్ జోక్యం వద్దు’
నల్లపురెడ్డి మాటలు వినిపించలేదా?: జేసీ