
తాజా వార్తలు
విశాఖలో తెదేపా అభ్యర్థిపై రాళ్లదాడి
విశాఖ: విశాఖపట్నంలోని గవర కంచరపాలెం ఎన్నికల ప్రచారం ఉద్రిక్తంగా మారింది. 56వ వార్డు తెదేపా అభ్యర్థి రాజశేఖర్‌పై డీజిల్ లోకోషెడ్ కుంచమాంబ గుడి వద్ద కొంత మంది దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తెదేపా అభ్యర్థి రాజశేఖర్ తలకు గాయాలు కాగా.. అవినాష్ అనే యువకుడూ గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. 56వ వార్డులోని తెదేపా కార్యాలయానికి దగ్గర్లోనే వైకాపా నేతలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నందున శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పూర్తిగా వారి అదుపులోకి తీసుకున్నారు.