close

తాజా వార్తలు

Updated : 19/01/2021 14:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు 

విజయవాడ: బెజవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమైన తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే... నిన్న మంత్రి కొడాలి నాని గొల్లపూడిలో దేవినేని ఉమాను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమా .. ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపడతానని, దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్‌ విసిరారు. ఆమేరకు ఈరోజు ఉదయం గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు తెదేపా శ్రేణులతో కలిసి ఉమా చేరుకున్నారు. ఉమా దీక్షకు సిద్ధమవుతుండగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైకాపా శ్రేణులతో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ బాహాబాహీకి దిగారు. తీవ్ర గందరగోళం మధ్య ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద దేవినేని ఉమా బైఠాయించారు. పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో పోలీసులు ఉమాను అరెస్టు చేశారు. పోలీసు వాహనంలో స్టేషన్‌కు తరలిస్తుండగా ఈలప్రోలు వద్ద మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో మహిళలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేవినేని ఉమాను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తీరుపై ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తే పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.

 మరోవైపు దేవినేని ఉమా తీరుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా మీడియా వేదికగా చర్చకు రావాలని మంత్రి కొడాలి నాని... ఉమాకు చెప్పినా వినకుండా రాజకీయ ప్రచారం కోసం రోడ్డెక్కారని విమర్శించారు. అంతకుముందు దేవినేని ఉమా ఇంటి వద్దకు రాకుండా తెదేపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గొల్లపూడిలో 144 సెక్షన్, పోలీసు యాక్టు 30 అమల్లో ఉందని తెలిపారు. దేవినేని ఉమ నిరసనకు అనుమతి లేదని స్పష్టం చేశారు.  ఇంటికి వెళ్లే మార్గాల వద్ద బారికేడ్లు పెట్టి అనుమతించలేదు.  

కొడాలి నాని ఏమన్నారంటే...
 గొల్లపూడిలో నిన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి  కొడాలి నాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాజీ మంత్రి దేవినేని తన చేతిలోనో, ఎమ్మెల్యేలు కృష్ణప్రసాద్‌, వల్లభనేని వంశీ చేతిలోనో దెబ్బలు తినక తప్పదని హెచ్చరించారు. ‘ఈ రోజు మైలవరం నియోజకవర్గం వచ్చి మాట్లాడుతున్నా. నేను ఎప్పుడైనా వస్తా. మీ చంద్రబాబు ఏం చేశారో? మా జగన్‌ ఏం చేశారో చెబుతా. మీ ఇంట్లో అయినా సరే చర్చకు నేను సిద్ధం’ అని సవాల్‌ విసిరారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇంటికొచ్చి బడితె పూజ చేస్తానన్నారు. లేకపోతే తన పేరు కొడాలి నాని కాదన్నారు.  

బుద్దా వెంకన్న గృహనిర్బంధం

 తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను పోలీసులు గృహనిర్బంధం చేశారు. దేవినేని ఉమా గొల్లపూడిలో చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావం తెలపడానికి బయల్దేరిన బుద్దా వెంకన్నను పోలీసులు అడ్డుకుని హౌస్‌ అరెస్టు చేశారు.

 

ఇవీ చదవండి...

సీఎం జగన్‌పై మాట్లాడితే దెబ్బలే

కేంద్రం రంగంలోకి దిగితేతీవ్ర పరిణామాలు: జీవీఎల్‌




Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని