
తాజా వార్తలు
‘వైకాపా పాలనను బేరీజు వేసుకొని ఓటేయండి’
తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు
అమరావతి: వైకాపా పాలనలో ఆ పార్టీ నేతల ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజల ఆస్తులు పెరగలేదని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో 20 నెలలుగా అభివృద్ధి లేదన్నది ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయన్నారు. రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేటాయింపులకు తగ్గ ఖర్చులు లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటాయింపులకు ఖర్చులకు పొంతన లేదని ధ్వజమెత్తారు.
వైకాపా 20 నెలల పాలనను తెదేపాతో బేరీజు వేసుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయాలని యనమల ప్రజలను కోరారు. ఎవరికి, ఎందుకు ఓటేయాలో ప్రజలు పరిశీలించాలని యనమల విజ్ఞప్తి చేశారు. సుపరిపాలన ఎవరు ఇస్తారనేది ప్రజలు ఆలోచించాలన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను తెదేపా నెరవేర్చి తీరుతుందని వివరించారు. వైకాపా పాలనలో అనేక వర్గాలు జీవనోపాధి కోల్పోయారని, అభివృద్ధి కుంటుపడిందని వివరించారు. శాంతిభద్రతలు లోపించి నేరాలు పెరిగిపోయాయని ఆయన ఆక్షేపించారు.