
తాజా వార్తలు
‘ప్రత్యేకహోదాను వైకాపా తాకట్టు పెట్టింది’
జగన్ దిల్లీ పర్యటనపై గోప్యతెందుకు.?
తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్
న్యూదిల్లీ: జగన్ సర్కారు ప్రత్యేక హోదా హామీని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. రెవెన్యూ లోటు ఉందని చెబుతున్న వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని భర్తీ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ దిల్లీకి చాలా సార్లు వచ్చారు. ఇంకా రావచ్చు కూడా. అయితే ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న హామీలను ఎంత వరకు సాధించారు? ఆ చట్టంలో ఉన్న సమస్యలపై మాట్లాడారా.. పరిష్కారం జరిగిందా?ఒకవేళ మాట్లాడితే కేంద్రం ఏం చెప్పింది?’ అని ప్రశ్నించారు.
కోర్టులో కేసులున్నా ఉగాది సమయానికి విశాఖకు రాజధానిని తరలిస్తామంటోందని.. ఆ మేరకు కేంద్రాన్ని అడిగినట్లు చెబుతోందని కనకమేడల అన్నారు. ఓ వైపు రాజధాని మార్పు విషయం కేంద్రానికి సంబంధం లేదంటూనే మరో వైపు కేంద్రాన్ని కోరినట్లు చెప్పడంలో ఆంతర్యమేంటన్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు తొందరపడుతున్న వైకాపా.. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వే జోన్‌పై నోరెందుకు మెదపడం లేదని నిలదీశారు. ‘‘సీఎం జగన్ దిల్లీ పర్యటన విషయాలను గోప్యంగా ఉంచడానికి కారణమేంటి? ఇలా చేయడం వల్ల వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరుతున్నాయా? రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా?’’ అని ప్రశ్నించారు. ఇటువంటి ప్రవర్తన పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రశ్నలు లేవనెత్తితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమను తిడుతున్నారని.. ప్రజల కోసం వాటిని భరిస్తామన్నారు.
ఇవీ చదవండి..
జగన్ రోజుకో వేషంతో మోసం: అచ్చెన్న
గొల్లపూడిలో దేవినేని ఉమా దీక్ష