తిరుపతి ఉపఎన్నికపై తెదేపా ఎంపీల ఫిర్యాదు
close

తాజా వార్తలు

Published : 18/04/2021 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుపతి ఉపఎన్నికపై తెదేపా ఎంపీల ఫిర్యాదు

దిల్లీ: తిరుపతి ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని తెదేపా ఎంపీలు ఆరోపించారు. అన్ని చోట్లా దొంగ ఓట్లు వేసినందుకుగానూ ఉపఎన్నిక పోలింగ్ రద్దు చేయాలని ఆ పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నిక నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని.. మళ్లీ కొత్తగా తిరుపతి ఉపఎన్నిక నిర్వహించాలని కోరినట్లు వారు చెప్పారు.

‘‘నకిలీ ఓట్లు వేసేందుకు వేరే ప్రాంతాల నుంచి జనాలను తిరుపతికి తీసుకువచ్చారు. తిరుపతిలో ఓటు వేయడానికి స్థానిక ప్రజలు భయపడిపోయారు. దీన్ని ఆసరాగా తీసుకుని వైకాపా వాళ్లు దొంగ ఓట్లు వేసుకున్నారు. అధికార వైకాపా మినహా అన్ని పార్టీలు దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని పట్టుకున్నాయి. కడప నుంచి తీసుకొచ్చిన వారితో దొంగ ఓట్లు వేయించుకున్నారు. అయితే వారంతా తిరుమలకు వచ్చిన భక్తులని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

ఎన్నికల సంఘం నోడల్ అధికారుల నుంచి వివరాలు తీసుకొని విచారణ జరిపించాలి. ఉదయం నుంచి తిరుపతి ఉపఎన్నికపై వస్తున్న అన్ని మీడియా కథనాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజాస్వామబద్ధంగా ఎన్నికలు జరగలేదు కాబట్టి తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలి. తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి పరిశీలకులు తీసుకురావడం లేదు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చినవారిపై పోలీసులు కూడా ఎలాంటి కేసులు పెట్టకుండా వదిలివేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికార దుర్వినియోగంతోనే ఈ ఎన్నికలు జరిగాయి’’ అని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో ఎంపీలు పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వారు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని