ఎన్నికలపై ఎలా ముందుకు?
close

తాజా వార్తలు

Published : 02/04/2021 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్నికలపై ఎలా ముందుకు?


అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెదేపా అనుసరించాల్సిన విధానంపై నిర్ణయాధికారాన్ని అధినేత చంద్రబాబుకే వదిలేస్తూ తెలుగుదేశం పొలిట్‌బ్యూరో ఏకగ్రీవంగా తీర్మానించింది. బలవంతపు ఏకగ్రీవాలు జరిగినందున కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే... రాత్రికి రాత్రే పాత నోటిఫికేషన్‌ ప్రకారం ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ నిర్ణయించడాన్ని తెలుగుదేశం తీవ్రంగా తప్పుబట్టింది.

ఎన్నికలు బహిష్కరించాలని మెజారిటీ నేతలు పొలిట్‌ బ్యూరోలో తమ అభిప్రాయాన్ని  వ్యక్తం చేశారు. సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్‌ తదితరులు మాత్రం పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్నందున వారి పరిస్థితి ఏమిటనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. 25 శాతం స్థానాలు ఏకగ్రీవమైతే 75 శాతం స్థానాల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఎన్నికల బహిష్కరణ నిర్ణయం సబబుకాదని వారు అన్నట్టు తెలుస్తోంది. స్థానిక పరిస్థితుల దృష్ట్యా పోటీలో ఉన్న అభ్యర్థులకే నిర్ణయాధికారాన్ని వదిలేసి పార్టీ పరంగా దూరంగా ఉండాలనే అభిప్రాయాన్ని మరికొందరు నేతలు వ్యక్తం చేశారు. ఎన్నికలు బహిష్కరిస్తున్నామని పార్టీ పరంగా ప్రకటించి, పోటీ చేయాలా వద్దా  అనేది బరిలో ఉన్న అభ్యర్థుల ఇష్టమంటూ ప్రకటన ఇవ్వడం సబబు కాదని సీనియర్లు స్పష్టం చేశారు.  సుప్రీంకోర్టు నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా  న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉండగానే రాత్రి రాత్రే నోటిఫికేషన్‌ జారీచేయడం అధికార దుర్వినియోగమే అని పయ్యావుల కేశవ్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి నేతలు తేల్చి చెప్పారు. అధికారపార్టీతో ఎన్నికల సంఘం కుమ్మక్కై నిర్వహిస్తున్న ఈ ఎన్నికలను తెదేపా బహిష్కరించడమే సబబని వారు సూచించినట్టు తెలిసింది.
గత ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. వైకాపా నేతలు అధికార దుర్వనియోగంతో బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారనే విషయాన్ని మాజీ ఎస్‌ఈసి కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో ప్రస్తావించడాన్ని నేతలు గుర్తుచేశారు. ఎస్‌ఈసీనే అధికార దుర్వనియోగం జరిగిందని నిర్ధారించినందున పాత నోటిఫికేషన్‌తో ఎన్నికలు నిర్వహించడం అర్ధరహితమని అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ అధినేత తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని పొలిట్‌బ్యూరో సభ్యులు స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయాన్ని మీడియా సమావేశంలో వెల్లడిస్తానని చంద్రబాబు తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని