
తాజా వార్తలు
స్టూడెంట్స్ స్పెషల్... కొత్త ర్యాంక్స్
జలకాలాటల ‘స్పీకర్’
స్నానాల గదిలో పాటలు పాడడం మనకి కొత్తేం కాదు. బాత్రూమ్ సింగర్లూగా అలాంటి వారికి మంచి పేరుంది. ఆ జోష్ని మరింత పెంచేలా ‘షవర్ స్పీకర్’ తోడైతే. అంతేనా.. షవర్ నుంచి వెలువడే నీటినే విద్యుత్‌గా (హైడ్రోపవర్) మార్చుకుని అది ఛార్జ్ అయితే! అదరహో..! అనాల్సిందే. కనిపించే ‘షవర్ పవర్’ స్పీకర్ అలాంటిదే. వాటర్‌ప్రూఫ్ రక్షణ కవచంతో దీన్ని తీర్చిదిద్దారు. సులభంగా షవర్‌కి అమర్చుకుని పాటలు లేదా వార్తలు.. ఏవైనా వింటూ స్నానం చేయొచ్చు. బ్లూటూత్ నెట్వర్క్ ద్వారా దీన్ని స్మార్ట్ ఫోన్‌కి కనెక్ట్ చేయొచ్చు. సముద్రాల్లో వెలికి తీసిన ప్లాస్టిక్‌ని రీసైకిల్ చేసి స్పీకర్‌ని తయారు చేయడం మరో ప్రత్యేకత. ఇంకా చెప్పాలంటే.. మ్యూజిక్ వింటున్నప్పుడు ఎల్ఈడీ లైట్లు వెలుగుతాయి కూడా.
విద్యార్థులకు ప్రత్యేకం
ఫోన్, ల్యాపీ, ట్యాబ్.. ఏదైనా కొనే ముందు ప్రధానంగా ఆలోచించే వాటిల్లో ఒకటి ఛార్జింగ్ బ్యాక్అప్. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ చదువులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత నేపథ్యంలో ఏసర్ కంపెనీ క్రోమ్‌బుక్‌లను ప్రపంచ మార్కెట్లో పరిచయం చేసింది. మోడళ్లు వరుసగా.. క్రోమ్‌బుక్ 511, 311, స్పిన్ 512, స్పిన్ 511, ట్రావెల్‌మేట్ స్పిన్ బీ3. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 గంటల పాటు వాడుకోవచ్చు. విద్యార్థులకు అధిక ప్రయోజనం చేకూరేలా వీటిని తీర్చిదిద్దారు. వీటి తెర పరిమాణం 11.6 అంగుళాలు. 4జీ ఎల్టీఈ నెట్వర్క్ సపోర్టుతో పని చేస్తాయి. వెబ్ కెమెరాని సురక్షితంగా వాడుకునేలా ‘ప్రైవసీ షటర్’ని కొన్ని మోడళ్లకు ఏర్పాటు చేశారు. ట్రావెల్‌మేట్ స్పిన్ మోడల్ని ల్యాప్టాప్గానే కాకుండా ట్యాబ్లెట్లా మడతపెట్టి వాడుకోవచ్చు. వీటి ప్రారంభ ధర రూ.21,900.
ప్లే స్టోర్‌లో కొత్త ర్యాంకింగ్
లెక్కకు మిక్కిలి యాప్స్‌తో యూజర్లలను అలరించే ఆండ్రాయిడ్ యాప్‌ల అడ్డా కొత్తగా విభాగంతో ముందుకొచ్చింది. అదేంటంటే.. ట్రెండింగ్ యాప్‌లు అన్నింటినీ ఇప్పుడు కొత్త జాబితాగా చూపిస్తోంది. ప్లే స్టోర్‌ని ఓపెన్ చేశాక సెర్చ్ బాక్స్ కింద చూడండి. కొత్తగా ‘టాప్ ఛార్ట్స్’ విభాగం కనిపిస్తుంది. ట్యాప్ చేస్తే ర్యాకింగ్‌లో వరుసగా యాప్‌లను చూపిస్తుంది. దీంతో డెవలపర్లు, పబ్లిషర్లు, యూజర్లు ఎప్పటికప్పుడు ఏది ట్రెండింగ్‌లో తెలుసుకోవచ్చు. విభాగాల వారీగా చూసేందుకు పక్కనే ‘కేటగిరీస్’ని సెలెక్ట్ చేయొచ్చు.
వెబ్ కెమెరాతో ‘ఎంఐ నోట్‌బుక్’
గత ఏడాదిలోనే నోట్‌బుక్ 14 సిరీస్‌తో ల్యాప్‌టాప్‌లను పరిచయం చేసిన షామీ కొత్త ఏడాదిలో జోరు పెంచింది. కొత్తగా హెచ్డీ కెమెరాతో ‘నోట్‌బుక్ 14ఐసీ’ మోడల్ని పరిచయం చేసింది. బిల్ట్ఇన్ వెబ్ కెమెరా సామర్థ్యం 720పిక్సల్స్. ఇంటి నుంచే పనులు, చదువులు సాగుతున్న నేపథ్యంలో హెచ్డీ వెబ్ కెమెరాతో ఆఫీస్ మీటింగ్‌లు, ఆన్లైన్ క్లాసుల్లో చక్కగా పాల్గొనొచ్చు. ఇక డిజైన్ విషయానికొస్తే.. నాజూకుగా తీర్చిదిద్దారు. బరువు 1.5 కేజీలు. తెర పరిమాణం 14 అంగుళాలు. రిజల్యూషన్ 1920*1080 పిక్సల్స్. ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్ 8జీబీ. ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం 512జీబీ. ఒక్కసారి ఛార్జ్ చేసి 10 గంటల పాటు వాడుకోవచ్చు. అంచనా ధర రూ.43,999.