Crime News: భార్యను దారుణంగా హత్య చేసి.. దొంగల పనిగా చిత్రీకరించి..

తాజా వార్తలు

Updated : 27/07/2021 15:48 IST

Crime News: భార్యను దారుణంగా హత్య చేసి.. దొంగల పనిగా చిత్రీకరించి..

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: చదువులో మేటి... అందరితో కలివిడిగా ఉండటం.. ఎక్కువ సమయం ఫోన్‌లో మాట్లాడటం.. ఇవే ఆమె పాలిట శాపంగా మారాయి. ఏడడుగులు నడిచి జీవితాంతం తోడుగా ఉంటానని ఒట్టేసి చెప్పిన వాడు... 60 రోజులు గడవక ముందే కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి దొంగల పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఈ నెల 23న చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన నవవధువు మ్యాదర ప్రణాళిక అలియాస్‌ గరిగె ప్రణాళిక(21) హత్యకు సంబంధించిన వివరాలను సోమవారం పోలీస్‌ కమిషనర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. హుజూరాబాద్‌ చెందిన ప్రణాళిక, చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన మ్యాదర అనిల్‌(26)కు రెండు నెలల కిందట వివాహం జరిగింది. ప్రణాళిక ప్రస్తుతం బాసర ట్రిపుల్‌ ఐటీలో చివరి సంవత్సరం చదువుతోంది. ప్రణాళిక వివాహం జరిగినప్పటి నుంచి తనతో మాట్లాడకపోవడం, తనకన్నా ఎక్కువగా చదువుకోవడంతో అనిల్‌ జీర్ణించుకోలేకపోయాడు. ఎక్కువ సమయం ఫోన్‌లో స్నేహితులు, తల్లిదండ్రులతో మాట్లాడేది. ఈ విషయంపై అనిల్‌ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అనిల్‌ డిగ్రీ మధ్యలోనే వదిలేసి హుస్నాబాద్‌లో బ్యాటరీ రిపేరింగ్‌ దుకాణం కొనసాగిస్తున్నాడు. ఆషాఢమాసం కావడంతో ప్రణాళిక పుట్టింటికి వెళ్లింది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని సర్దిచెప్పి అతను ఈ నెల 18న ఆమెను బొమ్మనపల్లికి తీసుకువచ్చాడు.

ఎలాగైనా ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకుని సమయం కోసం వేచి చూశాడు. ఈ నెల 23న పని నిమిత్తం హుస్నాబాద్‌లోని తన దుకాణానికి, తల్లిదండ్రులు సైతం వ్యవసాయ పనులకు వెళ్లిపోయారు. కొత్త కత్తి కొనుగోలు చేసిన అనిల్‌ తన స్నేహితుడి ద్విచక్రవాహనంపై మెకానిక్‌ దుస్తులతో బొమ్మనపల్లికి చేరుకున్నాడు. ఇంట్లో ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉన్న ప్రణాళిక వీపు, మెడపై కత్తితో రెండు సార్లు దాడి చేశాడు. ఇంట్లో ఉన్న గొడ్డలితో మరో మారు దాడి చేసి మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాడు. గొడ్డలిని శుభ్రం చేసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. సాయంత్రం సమయంలో పొలం నుంచి ఇంటికి వచ్చిన ఆమె అత్తమామలు ప్రణాళిక రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అనిల్‌ ఏమీ తెలియనట్లు ఇంటికి చేరుకుని దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనిల్‌ను విచారించగా అనుమానంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి గొడ్డలి, కత్తి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. సమావేశంలో శిక్షణ ఐపీఎస్‌ రితిరాజ్‌, ఏసీపీలు విజయసారథి, కె.శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్లు మల్లయ్య, శశిధర్‌రెడ్డి, సృజన్‌రెడ్డి, రవి తదితరులు ఉన్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని