Crime News: నవవధువుకు వరకట్న వేధింపులు.. పెళ్లైన నెల రోజులకే బలవన్మరణం

తాజా వార్తలు

Published : 15/09/2021 08:28 IST

Crime News: నవవధువుకు వరకట్న వేధింపులు.. పెళ్లైన నెల రోజులకే బలవన్మరణం


ఝాన్సీ పెళ్లినాటి చిత్రం

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : ఎన్నో కలలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆ యువతికి కన్నీళ్లే మిగిలాయి. మెట్టినింట అడుగుపెట్టినప్పటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులు మొదలయ్యాయి. తోడుగా నిలవాల్సిన భర్త తల్లితో చేరి హింసించడం మొదలుపెట్టాడు. డబ్బుతోనే ఇంట్లో అడుగు పెట్టాలని చెప్పి ఆమెను పుట్టినింట్లో వదిలి వెళ్లాడు. అత్తింట్లో వేధింపులు.. పుట్టింటి వారు తన వల్ల నవ్వులపాలవుతున్నారని మనస్తాపానికి గురైన ఆ యువతి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కడప నగరంలోని నెహ్రూనగర్‌లో మంగళ వారం చోటుచేసుకుంది. కడప చిన్నచౌకు ఎస్సై అమర్‌నాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నెహ్రూనగర్‌కు చెందిన ఝాన్సీ (26)కి రాజంపేట పట్టణం బోయినపల్లెకు చెందిన రాధాకృష్ణతో ఆగస్టు 15న వివాహమైంది. కట్నకానుకల కింద సుమారు రూ.20 లక్షలు ఇచ్చారు. రాధాకృష్ణ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఝాన్సీ కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. వివాహమైన అనంతరం ఉద్యోగం మానేసి ఇంటి వద్దనే ఉంటోంది. వివాహమైన రెండు రోజుల నుంచే వేధింపులు మొదలయ్యాయి. అధిక కట్నం తీసుకురావాలని భర్త, అత్త వెంకటసుబ్బమ్మ, ఆడబిడ్డలు శేషమ్మ, గీతాంజలి వేధించేవారు. రూ.70 లక్షలు తీసుకొస్తేనే కాపురం చేస్తానని ఈ నెల మొదటి వారంలో భర్త ఆమెను పుట్టింట్లో వదిలి వెళ్లాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసినా మార్పు రాలేదు. పుట్టింటివారికి భారం కాకూడదని మంగళవారం ఉదయం తన గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. గదిలో నుంచి కుమార్తె ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అనుమానంతో వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందింది. ఝాన్సీ పెదనాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్త, ఆడబిడ్డలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌.ఐ. చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని