Corona ఒక్కచోటే 519మందిని చంపేసింది! 
close

తాజా వార్తలు

Published : 21/04/2021 18:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona ఒక్కచోటే 519మందిని చంపేసింది! 

కొత్త మరణాల్లో 82.6శాతం 10 రాష్ట్రాల్లోనే..

దిల్లీ: కరోనా సృష్టిస్తోన్న విలయానికి భారత్‌ చిగురుటాకులా వణుకుతోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కొవిడ్‌ కేసులు, మరణాలు ఆయా రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరోనా ఉగ్రరూపం దాల్చుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా ఓ వైపు వ్యాక్సినేషన్‌ శరవేగంగా కొనసాగుతున్నా.. పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలవుతున్నా ఈ వైరస్‌ తుపానులా విరుచుకుపడుతుండటంతో కలవరపడుతున్నారు. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో దాదాపు మూడు లక్షల కొత్త కేసులు నమోదవ్వగా.. 2వేలకు పైగా మరణాలు వెలుగుచూడటం దేశంలో ఈ మహమ్మారి సృష్టిస్తున్న ప్రళయానికి నిదర్శనం.

10 రాష్ట్రాల్లోనే 82.6శాతం మరణాలు..

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. తాజాగా నమోదైన మొత్తం 2023 మరణాల్లో 82.6శాతం 10 రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 519 మంది మరణించారు. ఆ తర్వాత దిల్లీలో 277మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లో 191మంది, యూపీ 162, కర్ణాటక 149, గుజరాత్‌ 121, మధ్యప్రదేశ్ 77, రాజస్థాన్‌ 64, పంజాబ్‌ 60, బిహార్‌ 51 చొప్పున కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. మరోవైపు, తొమ్మిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో గడిచిన 24గంటల వ్యవధిలో ఒక్క కొవిడ్‌ మరణమూ నమోదు కాలేదని కేంద్రం వెల్లడించింది. సిక్కిం, మేఘాలయా, త్రిపుర, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌, దాద్రానగర్‌, డామన్‌ డయ్యూ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌లలో కరోనా మరణాలు రాలేదని తెలిపింది. కరోనాతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1.82లక్షల మందికి పైగా మృతిచెందగా.. మరణాల రేటు 1.17శాతంగా ఉంది.

ఈ 10 రాష్ట్రాల్లోనే కొత్త కేసులెక్కువ..

దేశంలో తాజాగా 2,95,041 కొత్త కేసులు రాగా.. వాటిలో 76శాతం కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 62వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. ఆ తర్వాత యూపీలో 29,574, దిల్లీ 28,395, కర్ణాటక 21,794, కేరళ 19,577, ఛత్తీస్‌గఢ్‌ 15,625, మధ్యప్రదేశ్‌ 12,727, గుజరాత్‌ 12,206, రాజస్థాన్‌ 12,201, తమిళనాడు 10,986 చొప్పున కొత్త కేసులు వచ్చాయి.

యాక్టివ్‌ కేసుల్లో టాప్‌ 5 రాష్ట్రాలివే.. 
కొత్త కేసులు భారీగా పెరిగిపోతుండటంతో యాక్టివ్‌ కేసుల గ్రాఫ్‌ పైపైకి పోతోంది.  ప్రస్తుతం దేశంలో మొత్తంగా ఉన్న 21,57,538 యాక్టివ్‌ కేసుల్లో 61శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్రలోనే 31.77శాతం ఉండగా.. ఆ తర్వాత యూపీలో 10.36శాతంగా ఉన్నాయి. అలాగే, కర్ణాటకలో 7.38శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 5.83శాతం, కేరళలో 5.52శాతం, దేశంలోని మిగతా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలో కలిపి 39.14శాతంగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని