తొలి మహిళా స్పేస్‌ టూరిస్ట్‌.. బెత్‌ మోసెస్‌

తాజా వార్తలు

Updated : 03/07/2021 08:49 IST

తొలి మహిళా స్పేస్‌ టూరిస్ట్‌.. బెత్‌ మోసెస్‌

స్పేస్‌ అనగానే ఎక్కువమందికి గుర్తొచ్చేది నాసా. అలాంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న సంస్థ నుంచి ఓ ప్రైవేటు స్పేస్‌ ఫ్లైట్‌ కంపెనీకి మారడం ఊహించగలమా? అలా చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఓ మహిళ. బెత్‌ మోసెస్‌.. నాసా నుంచి బయటికి వచ్చి వర్జిన్‌ గెలాక్టిక్‌ అనే కమర్షియల్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సంస్థకు మారింది. ఇదో స్పేస్‌ టూరిజం సంస్థ. ఇది గతంలో ప్రయోగించిన వ్యోమనౌకలో ప్రయాణించి, కమర్షియల్‌ స్పేస్‌ ఫ్లైట్‌లో ప్రయాణించిన తొలి మహిళగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ప్రయాణానికి సిద్ధమైంది.

బెత్‌ది యూఎస్‌లోని ఇల్లినాయిస్‌. పర్‌డ్యూ విశ్వవిద్యాలయం నుంచి ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌ల్లో డిగ్రీ, పీజీ పూర్తిచేసింది. విద్యాభ్యాస సమయంలోనే పారాబొలిక్‌ ఫ్లైట్‌పై మెటీరియల్స్‌ రిసెర్చ్‌ చేసింది. ఇందుకు నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ నుంచి మైక్రోగ్రావిటీ రిసెర్చ్‌ అవార్డును అందుకుంది. ఆపై నాసాలో చేరే అవకాశం దక్కించుకుంది. ఇక్కడ ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు అసెంబ్లీ మేనేజర్‌గా వ్యవహరించింది. ‘హ్యూమన్‌ ఇన్‌ ద లూప్‌ టెస్టింగ్‌’ అనే అంతర్జాతీయ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహించింది. ఏరోనాటిక్స్‌ విభాగంలో సాధించిన విజయాలకు గుర్తింపుగా 2009లో రాబర్డ్‌ జె. కాలియర్‌ ట్రోఫీని అందుకుంది.

2014లో వర్జిన్‌ గెలాక్టిక్‌ అనే కమర్షియల్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సంస్థకు మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సంస్థలో ఈమె చీఫ్‌ ఆస్ట్రోనాట్‌ ఇన్‌స్ట్రక్టర్‌. క్యాబిన్‌ లేఅవుట్‌ డిజైనింగ్, స్పేస్‌షిప్‌లో ప్రయాణించేవారికి శిక్షణనివ్వడం ఈమె బాధ్యత. ఈ సంస్థ రూపొందించిన స్పేస్‌షిప్‌2లో అంతరిక్షంలోకి ప్రవేశించి, కమర్షియల్‌ స్పేస్‌ ఫ్లైట్‌లో ప్రయాణించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. తాజాగా వర్జిన్‌ గెలాక్టిక్‌ మనుషులతో కూడిన ఒక టెస్ట్‌ ఫ్లైట్‌ను మళ్లీ అంతరిక్షంలోకి పంపనున్నట్లుగా సంస్థ స్థాపకుడు బ్రాన్‌సన్‌ ప్రకటించారు. ఆయనతో సహా ఆరుగురు దీనిలో ప్రయాణిస్తున్నారు. దీనిలో ఇద్దరు మహిళలు. వాళ్లలో బెత్‌ మోసెస్‌ ఒకరు కాగా.. మరొకరు మన తెలుగమ్మాయి శిరీష బండ్ల. 

ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసి, 2022 చివరినాటికి అందరి కంటే ముందుగా స్పేస్‌ టూరిజం ప్రారంభించాలన్నది సంస్థ లక్ష్యం. అందులో భాగంగానే తన పోటీదారుడు, బ్లూ ఆరిజన్‌ సంస్థ అధ్యక్షుడు జెఫ్‌ బెజోస్‌ స్వయంగా కొంతమందితో కలిసి అంతరిక్షంలోకి ప్రయాణించనున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే బ్రాన్‌సన్‌ కూడా తమ ప్రయాణ వివరాలను వెల్లడించారు. జెఫ్‌ బెజోస్‌ ప్రకటించిన తేదీ కంటే 9 రోజులు ముందుగానే వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌ ఫ్లైట్‌ అంతరిక్షంలోకి వెళ్లనుండటం విశేషం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని