
తాజా వార్తలు
ఆ హత్య చేసిందెవరు?
ముంబయి: మీరా కపూర్ ఓ అందమైన అమ్మాయి. రోజూ ఓ ట్రైన్లో ప్రయాణిస్తుంటుంది. ఆమె తన ప్రయాణంలో రైలు కిటికీ నుంచి ఓ అమ్మాయిని గమనిస్తూ ఉంటుంది. ఆమె సంతోషంగా ఉండటాన్ని చూసి ఆమె జీవితం తన జీవితానికి దగ్గరగా ఉన్నట్టు భావిస్తుంటుంది మీరా. అసూయ పడుతుంది. మీరా ఓ రోజు అనుకోకుండా ఆమెను కలవడానికి వెళుతుంది. కలిసిందో లేదో తెలియదు. కానీ ఇంతలో ఆ అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆ హత్య కేసులో మీరా ఇరుక్కుంటుంది. అది ఎలా జరిగింది? తర్వాత ఏమైంది? లాంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ చిత్రంలో దొరుకుతుందని చెబుతుంది పరిణీతి చోప్రా. ఆమె మీరా కపూర్ పాత్రలో నటించిన చిత్రమిది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. అదితీరావ్ హైదరి, కృతి కుల్హరి, అవినాష్ తివారీ కీలక పాత్రల్లో నటించారు. రిబు దాస్ గుప్తా దర్శకత్వం వహించారు. పరిణీతి మాట్లాడుతూ ‘‘ఓ నటిగా సవాల్ విసిరే పాత్రలు కోరుకుంటాను. అలాంటి పాత్రే మీరా కపూర్. నా కెరీర్లో ఇప్పటివరకూ పోషించని పాత్ర ఇది. ఎంతో నేర్చుకున్నాను’’అని చెప్పింది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా ఈ నెల 26న విడుదల కానుంది.
ఇదీ చదవండి
త్వరలోనే ఓ మూవీ డైరెక్ట్ చేస్తా:బోనీకపూర్