close
Array ( ) 1

తాజా వార్తలు

తిరిగి.. తిరిగి.. మొదటికే చేరిన ‘4’ కథ

రెండేళ్లు.. 12 ప్రయోగాలు.. తేలిన ఫలితం? ప్రపంచకప్‌ తెచ్చే సామర్థ్యం ఉండీ సెమీస్‌లో టీమిండియా నిష్క్రమణ. దాంతో కుప్పకూలిన ఆశలు. ఎందుకోసం ఈ ప్రయోగాలు? ఏం ఆశించి చేశారు?చివరికి ఏం సాధించారు?ఇంతకాలం కష్టపడి పరీక్షించాక ఇప్పుడు మళ్లీ..! నాలుగో స్థానంలో మనకో అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌ కావాలని చెప్పడం దేనికి నిదర్శనం?2017లో వెస్టిండీస్‌ సిరీస్‌లో యువరాజ్‌ సింగ్‌తో మొదలైందీ ప్రహసనం. 2019 ప్రపంచకప్‌లో రిషభ్‌ పంత్‌తో ముగిసింది. ఈ పరీక్షా కాలంలో కోచ్‌ రవిశాస్త్రి, సారథి విరాట్‌ కోహ్లీ, చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అసలేం చేశారు? ఎక్కడ పొరపాట్లు చేశారో ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే!!

యువీతో మొదలు!

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ముగిసిన తర్వాత టీమిండియా జులైలో వెస్టిండీస్‌తో తలపడింది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో విఫలమైనప్పటికీ మొదటి, మూడో వన్డేలో యువరాజ్‌ సింగ్‌ను నాలుగో స్థానంలో ఆడించారు. తక్కువ స్కోర్లు చేయడంతో చివరి రెండు వన్డేల్లో దినేశ్‌ కార్తీక్‌ను పంపించారు. ఈ సిరీస్‌లో పంత్‌ను సైతం ఎంపిక చేయడం గమనార్హం. అప్పుడే భారత్‌-ఏ, అండర్‌-19 కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఓ పక్కా ప్రణాళికతో 2019 ప్రపంచకప్‌కు వెళ్లండని సూచించారు. ఈ సిరీస్‌లో 4, 13, 39 స్కోర్లు చేసిన యువీ మళ్లీ నీలం రంగు జెర్సీ ధరించలేదు.

యువీ పాత్ర ఏంటీ?

యువరాజ్‌ ఎంపికపై ద్రవిడ్‌ టీమిండియా జట్టు యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. ‘యువీ ఎంపిక సెలక్టర్ల నిర్ణయం. భారత క్రికెట్‌ భవిష్యత్తు గురించి వారు ఏం ఆలోచించారు? వచ్చే రెండేళ్ల కాలంలో యువీ నుంచి ఏం ఆశిస్తున్నారు? అతడి పాత్ర ఏంటి? ఏడాది లేదా ఆర్నెల్ల సమయంలో సమీక్ష చేస్తారా? ఆ ఇద్దరికీ మద్దతిచ్చే ముందు మిగిలిన ప్రతిభావంతులను పరీక్షించి చూస్తారా?’ అని అడిగాడు.

మళ్లీ అదే గోల

2017 సెప్టెంబర్‌లో శ్రీలంక సిరీస్‌తో టీమిండియా ప్రపంచకప్‌ ప్రణాళికలు మొదలయ్యాయని చెప్పొచ్చు. రవిశాస్త్రి తిరిగి ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో నాలుగో స్థానంలో కేఎల్‌ రాహుల్‌ ఆడతాడని చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ స్పష్టం చేశారు. కానీ అది జరగలేదు. ఐదు మ్యాచుల్లో ఆ స్థానంలో ఐదుగురిని ఆడించారు. ఆటగాళ్లకు సమాన అవకాశాలు ఇచ్చిన తర్వాత నాలుగో స్థానంపై స్పష్టత వస్తుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

పాండే+పాండ్య ప్రయోగం

2017 అక్టోబర్‌లో ఆస్ట్రేలియా భారత్‌లో పర్యటించింది. తొలి వన్డేలో ఆసీస్‌ను ఓడించిన తర్వాత మిడిలార్డర్‌, లోయర్‌ మిడిలార్డర్‌ను విరాట్‌ ప్రశంసించాడు. మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్యను చెరో రెండు వన్డేల్లో నాలుగో స్థానంలో ఆడించారు. చివరి మ్యాచ్‌లో కేదార్‌ జాదవ్‌ను పరీక్షించారు. స్థిరత్వం గురించి ఆలోచించలేదు. చివరి వన్డే తర్వాత ‘మేం వికెట్లు చేజార్చుకున్నాం. కానీ ఎంఎస్‌, కేదార్‌ అద్భుతంగా ఆడారు. మహీ మునుపటిలా ఆటను ముగించాడు. మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ ఎంత పటిష్ఠంగా ఉందో చెప్పేందుకు ఈ రోజు, శ్రీలంక సిరీస్‌లే ఉదాహరణ’ అని కోహ్లీ అన్నాడు. ఆగస్టులో టీమిండియా శ్రీలంకతో ఆడింది. అక్కడా ప్రయోగాలే చేశారు.

కివీస్‌పై ముగ్గురు

2017 అక్టోబర్‌, నవంబర్‌లో న్యూజిలాండ్‌ భారత్‌లో పర్యటించింది. మూడు వన్డేలు ఆడింది. ఈ మూడింట్లో కోహ్లీసేన నాలుగో స్థానంలో ముగ్గుర్ని ఆడించడం గమనార్హం. ఆ ముగ్గురే కేదార్‌ జాదవ్‌, దినేశ్ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య. మిడిలార్డర్‌లో ఆడగల కొంతమంది ఆటగాళ్ల బృందం ఏర్పాటు చేయడం కోసం జట్టు యాజమాన్యం దృష్టి పెట్టిందని ఎమ్మెస్కే చెప్పాడు. ప్రస్తుతం భారత్‌కు ఎక్కువ మంది ఓపెనర్లు ఉన్నట్టే మిడిలార్డర్‌లోనూ ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నామని వెల్లడించాడు.  అందుకే యువకులకు అవకాశాలు ఇస్తున్నామని వెల్లడించాడు.

 

రహానె ఆగమనం

స్వదేశంలో 2017 నవంబర్‌లో జరిగిన న్యూజిలాండ్‌ సిరీస్‌కు అజింక్య రహానె ఎంపికయ్యాడు. ఒక్క మ్యాచ్‌లోనూ అతడికి అవకాశం ఇవ్వకుండా రిజర్వు ఓపెనర్‌గా బెంచీకి పరిమితం చేశారు. జాదవ్‌, కార్తీక్‌, పాండ్యను నాలుగో స్థానంలో ఆడించారు. అయితే 2018 దక్షిణాఫ్రికా సిరీస్‌లో మాత్రం జింక్స్‌ను నాలుగో స్థానంలో దించారు. ఆరు మ్యాచుల్లో అతడు 35 సగటుతో 140 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. విదేశాల్లో బౌన్సీ, స్వింగ్‌ పిచ్‌లపై మెరుగైన రికార్డు ఉన్న అతడిని ఆ తర్వాత పక్కన పెట్టేశారు. కోహ్లీ మాత్రం ‘రహానెను చూసి ఆనందిస్తున్నా. అతనో అద్భుతమైన ఆటగాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌ ఈ పర్యటనలో కీలకం అవుతుందని మేం గ్రహించాం. అతడు చక్కగా ఆడాడు. ఫాస్ట్‌ బౌలర్లను బాగా ఎదుర్కొన్నాడు’ అని పేర్కొనడం టీమిండియా ద్వంద్వ వైఖరికి నిదర్శనం.

ప్చ్‌..! రాహుల్‌

కోహ్లీసేన 2018, జులైలో ఇంగ్లాండ్‌లో పర్యటించింది. ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో జరిగిన టీ20లో కేఎల్‌ రాహుల్‌ అద్భుత శతకం బాది ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత రెండు వన్డేల్లో అతడిని నాలుగో స్థానంలో ఆడించారు. రాహుల్‌ ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో 9*, లార్డ్స్‌ పరుగులేమీ చేయలేదు. అంతలోనే చివరి వన్డేలో కార్తీక్‌ను తీసుకొచ్చారు. నాలుగో స్థానంలో రాహుల్‌కు చాలినన్ని అవకాశాలు ఇవ్వకుండానే ఆత్మస్థైర్యం దెబ్బతీశారు. ఒక్క వైఫల్యానికే అతడిని పక్కన పెట్టేశారు.

 

రాహుల్‌కు గంగూలీ అండ

కేఎల్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం లేదని గ్రహించిన టీమిండియా మాజీ సారథి గంగూలీ అతడికి అండగా నిలిచాడు.  ‘మిడిలార్డర్‌ బలోపేతానికి కేఎల్‌ రాహుల్‌ కచ్చితంగా అవసరం. నాలుగో స్థానంలో ఆడే వ్యక్తికి జట్టు యాజమాన్యం ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. అప్పుడే అతడు స్థానం కోసం చూడకుండా స్వేచ్ఛగా ఆడగలడు’ అని పేర్కొన్నాడు. కోహ్లీసేన ఈ మాటను పట్టించుకోలేదు.

 

ఆసియా కప్‌లో డీకే

నాలుగో స్థానంలో ప్రయోగాలకు టీమిండియా యాజమాన్యం ఆసియా కప్‌నూ ఓ సాధనంగా ఎంచుకోవడం గమనార్హం. అంతకు ముందు ఇంగ్లాండ్‌ సిరీస్‌ (2018 జులై)లో రెండే మ్యాచుల్లో విఫలమయ్యాడని కేఎల్‌ రాహుల్‌ను పక్కన పెట్టేశారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రదర్శన ఆధారంగా అంబటి రాయడు, దినేశ్ కార్తీక్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. కోహ్లీకి విశ్రాంతినిచ్చిన ఈ టోర్నీలో మూడో స్థానంలో రాయుడు అదరగొట్టాడు. బంగ్లా మ్యాచ్‌ను మినహాయిస్తే మిగతా నాలుగు మ్యాచుల్లో దినేశ్‌ కార్తీక్‌ను వరుసగా నాలుగో స్థానంలో ఆడించారు. కార్తీక్‌ మూడు 30+ స్కోర్లు, రాయుడు అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన సిరీసుల్లో కోహ్లీ రావడంతో రాయుడు 4 స్థానంలో ఆడాడు. సందర్భాన్ని బట్టి డీకే, ధోనీ, పాండ్య, జాదవ్‌ తమ స్థానాలు మార్చుకున్నారు.

​​​​​

ఆశలు కల్పించిన కోహ్లీ

‘వన్డేల్లో విశ్రాంతి కోసం బౌలర్లకు తరచూ విరామం కల్పించాం. నాలుగో స్థానంలో మాత్రం ఎవరో ఒకరు స్థిరంగా ఆడాలని కోరుకున్నాం. రాయుడు ఈ అవకాశాన్ని ఒడిసిపడతాడన్న విశ్వాసం ఉంది. తన అనుభవంతో సొంత రాష్ట్రానికి, ఐపీఎల్‌లో ఎన్నో మ్యాచులు గెలిపించాడు. భారత్‌ తరఫున అతడి వన్డే రికార్డు చాలా బాగుంది. ఇక బ్యాటింగ్‌ ఆర్డర్‌ సమస్య పరిష్కారమైందనే అనుకుంటున్నా’ అని కోహ్లీ రాయుడికి ఆశలు కల్పించాడు.

హిట్‌మ్యాన్‌ ఓటు ధోనీకి

ఆసియా కప్‌లో టీమిండియాకు నాయకత్వం వహించిన రోహిత్‌ శర్మ అభిప్రాయం మరోలా ఉంది. నాలుగో స్థానంలో అతడు ధోనీకి ఓటేశాడు. ‘ధోనీకి నాలుగో స్థానమే సరైందని నా వ్యక్తిగత అభిప్రాయం. అంబటి రాయుడు అద్భుతంగా ఆ పాత్ర పోషించాడు. ఏదేమైనా వారి ఎంపిక మాత్రం కోచ్‌, సారథిపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతంగా చెప్పమన్నారు కాబట్టి అవును, ఆ స్థానానికి ధోనీ సరైనవాడు’ అని కుండబద్దలు కొట్టేశాడు.

పంత్‌×కార్తీక్‌

2018, అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో రాయుడు అదరగొట్టాడు. ఐదు వన్డేల్లో నాలుగో స్థానంలోనే ఆడాడు. 217 పరుగులు చేశాడు. వాంఖడెలో నిర్వహించిన నాలుగో వన్డేలో 81 బంతుల్లోనే శతకం బాదాడు. అతడు స్థిరంగా ఆడటంతో ధోనీ, పంత్‌, జాదవ్‌ను మ్యాచ్‌ పరిస్థితులకు అనుగుణంగా ఆడించారు. ఈ సిరీస్‌కు రిషభ్‌ పంత్‌నుసైతం ఎంపిక చేశారు. జట్టును ఎంపిక చేసే వరకు కార్తీక్‌×పంత్‌ తీవ్ర చర్చనీయాంశం అయింది. 2018లో ఆడిన ఆరు మ్యాచుల్లో 42 సగటుతో తక్కువ పరుగులే చేసినా ప్రపంచకప్‌ ప్రణాళికల్లో పంత్‌ బదులు కార్తీక్‌కు చోటు కల్పించారు.

 

ఆందోళనలో రాయుడు

కోహ్లీసేన 2019 జనవరిలో ఆసీస్‌లో పర్యటించింది. సిరీస్‌ గెలిచి రికార్డు సృష్టించింది. ఇందులో రాయుడు విఫలమయ్యాడు. రెండు వన్డేలు ఆడిన అతడిని మూడో వన్డేలో తప్పించారు. న్యూజిలాండ్‌ సిరీస్‌కు అతడి స్థానంలో కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేశారు. కాఫీ విత్‌ కరణ్‌ వివాదంతో రాహుల్‌పై వేటు పడటంతో రాయుడికి అనూహ్యంగా అవకాశం వచ్చింది. మిడిలార్డర్‌లో ప్రతిసారీ ఆటగాళ్లను మారుస్తుండటంతో తన స్థానం సురక్షితం కాదని గ్రహించిన అతడు ఒత్తిడిలో ఆడాడు. ఐదు వన్డేల్లో 63.34 సగటుతో 190 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కష్టాల్లో పడ్డ మూడో వన్డేలో 40 బంతుల్లో 42 పరుగులతో అజేయంగా నిలిచి కోహ్లీ నమ్మకాన్ని గెలిచాడు. ‘రాయుడు అలా ఆడుతుంటే ఒక బ్యాట్స్‌మన్‌గా అతడిపై ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతోంది’ అని విరాట్‌ అన్నాడు. అయితే ఇదే సిరీస్‌లో విజయ్‌ శంకర్‌ మోస్తారు ప్రదర్శనతో ఆకట్టుకోవడం గమనార్హం.

మళ్లీ రాహుల్‌, పంత్‌

ఆసీస్‌ 2019 మార్చిలో భారత్‌లో పర్యటించింది. ఈ సిరీస్‌లోనూ ప్రయోగాలు వదల్లేదు. స్థిరత్వంపై దృష్టి సారించలేదు. తొలి మూడు వన్డేల్లో రాయుడిని నాలుగో స్థానంలో ఆడించారు. దురదృష్టవశాత్తు అతడు రాణించలేదు. వరుసగా రెండు మ్యాచుల్లో అదరగొట్టిన భారత్‌ మూడో వన్డేలో ఓటమి పాలైంది. ఇందులో రాయుడు విఫలమయ్యాడు. దీంతో నాలుగో వన్డేలో కోహ్లీ ఆడాడు. ఆసీస్‌ 2-2తో సిరీస్‌ సమం చేసింది. దిల్లీలో జరిగిన నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌లో పంత్‌ నాలుగో స్థానంలో వచ్చాడు. తర్వాతి స్థానాల్లో ఆల్‌రౌండర్లు విజయ్‌ శంకర్‌, జాదవ్‌ ఆడారు. ధోనీకి విశ్రాంతినిచ్చారు. సిరీస్‌కు జట్టును ఎంపిక చేసే ముందు పంత్‌ గురించి విపరీతంగా చర్చ జరిగింది. కోచ్‌ రవిశాస్త్రి ఎప్పటిలాగే మిడిలార్డర్‌ను పటిష్ఠం చేయకుండా ఫ్లెక్సిబిలిటీకి ప్రాధాన్యం ఇచ్చాడు. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కర్ని ఆడించాడు.

 

​​​​​​​

ఆశలు సమాధి

నాలుగో స్థానంలో 12 మందిని పరీక్షించిన టీమిండియా యాజమాన్యం చివరికి కేఎల్‌ రాహుల్‌ను ఆ స్థానానికి ఎంపిక చేసింది. ఐపీఎల్‌ ఫామ్‌ ఆధారంగా ప్రపంచకప్‌లో రాయుడికి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. మరీ గొప్ప ప్రదర్శన చేయకున్నా విజయ్‌ శంకర్‌కు అవకాశం ఇచ్చింది. దక్షిణాఫ్రికాపై నాలుగో స్థానంలో ఆడిన రాహుల్‌ శిఖర్‌ ధావన్‌ గాయంతో ఓపెనింగ్‌కు మారాడు. హార్దిక్‌ పాండ్య, విజయ్‌ శంకర్‌, రిషభ్‌పంత్‌ నాలుగో స్థానాల్లో ఆడి మరీ ఆకట్టుకున్నదేమీ లేదు. మొత్తంగా నాలుగో స్థానానికి జరిగిన ప్రయోగాల ఫలితంగా అంబటి రాయుడు కెరీర్‌కు ముగింపు పలికాడు. చివరికి ఫ్లెక్సిబిలిటీ అన్న రవిశాస్త్రి మళ్లీ నాలుగో స్థానంలో మనకో మంచి బ్యాట్స్‌మన్‌ అవసరం ఉందని చెప్పడంతో హతాశులం అవ్వక తప్పలేదు. తిరిగి.. తిరిగి.. ఈ విఫల గాథ.. మళ్లీ మొదలైంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.