2021లో ఇవే అత్యంత కీలకం!

తాజా వార్తలు

Updated : 24/11/2020 14:02 IST

2021లో ఇవే అత్యంత కీలకం!

సీఐవోలు, సీటీవోల సర్వేలో వెల్లడి

బెంగళూరు: వచ్చే ఏడాది అత్యంత కీలక సాంకేతికతలుగా కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్, 5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లు (ఐఓటీ) నిలుస్తాయని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్స్‌ (ఐఈఈఈ) సర్వే వెల్లడించింది. 2021లో అత్యంత ముఖ్యమైన సాంకేతికతలు, సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై కొవిడ్‌-19 ప్రభావం, సాంకేతికత వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే రంగాలపై ఈ సర్వే నిర్వహించారు. అమెరికా, బ్రిటన్, చైనా, భారత్, బ్రెజిల్‌కు చెందిన చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్స్‌ (సీఐవో), ఛీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్స్‌ (సీటీవో)లు పాల్గొన్నారు. సర్వే ముఖ్యాంశాలు ఇలా.. 
* 2021లో అత్యంత ముఖ్యమైనవిగా ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ ఉంటాయని 32 శాతం మంది, 5జీ వైపు 20 శాతం మంది, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వైపు 14 శాతం మంది మొగ్గు చూపారు. 
* సాంకేతికత కారణంగా అత్యధికంగా ప్రభావితమయ్యే రంగాల్లో తయారీకి 19 శాతం మంది ఓటేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ఆరోగ్య సంరక్షణ (18%), ఆర్థిక సేవలు (15%), విద్య (13%) ఉన్నాయి.
* కొవిడ్‌-19 ప్రభావం నుంచి వ్యాపార కార్యకలాపాలు పుంజుకునేలా చేయడమే అతిపెద్ద సవాలుగా ఉందని సగానికి పైగా (52%) సీఐవోలు, సీటీవోలు వెల్లడించారు. పని చేసే విధానం (22% మంది), కార్యాలయాల పునఃప్రారంభం (17%), ఎక్కడి నుంచైనా పని చేసే విధానాన్ని శాశ్వతం చేయడం (13%) లాంటి విషయంలో సవాళ్లు ఎదురుకానున్నాయని తెలిపారు. వీటన్నింటి కంటే సైబర్‌ ముప్పు అత్యంత సవాలు అని 11 శాతం మంది అభిప్రాయపడ్డారు.
* కరోనా పరిణామాల నేపథ్యంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ను అందిపుచ్చుకోవడం వేగవంతం అయ్యిందని 55 శాతం మంది వెల్లడించగా.. 52% మంది 5జీ, 51% మంది ఏఐ, 42% మంది ఐఓటీ, 35% మంది వర్చువల్‌ రియాల్టీ, 35% మంది వీడియో కాన్ఫరెన్సింగ్‌ వైపు మొగ్గు చూపారు. 
* డేటా చౌర్యం, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి సృష్టించే అంతరాయాలను ఇంతకుముందుతో పోలిస్తే గట్టిగా ఎదుర్కొనగలిగే స్థితిలో ఉన్నాయని అధికులు పేర్కొన్నారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని