
తాజా వార్తలు
కొవిడ్: నిన్న టాయిలెట్ రోల్స్.. నేడు మాస్క్‌లు
టోక్యో: కొవిడ్-19(కరోనా కొత్త పేరు) వైరస్ నానాటికీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే 1800 మందికి పైగా ఈ వైరస్‌కు బలవ్వగా.. 71వేల మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. ఒక్క చైనాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్‌పై తీవ్రమైన ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా వైరస్ దృష్ట్యా కొన్ని అత్యవసర వస్తువులకు గిరాకీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ పరిణామం దొంగతనాలకు దారితీస్తోంది. నిన్నటికి నిన్న హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున టాయిలెట్ రోల్స్ చోరీ జరగగా.. తాజాగా జపాన్‌లో మాస్క్‌ల దొంగతనం చోటుచేసుకుంది.
జపాన్‌లోని కోబ్ నగరంలో గల ఓ రెడ్‌క్రాస్ హాస్పిటల్లో దాదాపు 6000 సర్జికల్ మాస్క్‌లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆసుపత్రిలోని స్టోరేజ్ గది నుంచి వీటిని చోరీ చేశారు. మామూలుగానే జపాన్‌లో మాస్క్‌లను విరివిగా వినియోగిస్తారు. అయితే ఇటీవల చైనాలో కొవిడ్ వైరస్ కారణంగా ప్రజల్లో భయం పెరిగింది. దీనికి తోడు జపాన్ నౌకలో వందలాది మందికి వైరస్ సోకడం అక్కడి ప్రజలకు మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో మాస్క్‌ల వాడకం ఒక్కసారిగా పెరగడంతో వాటి కొరత ఏర్పడింది. దీంతో వాటి ధరలు కూడా చుక్కలను తాకుతున్నాయి. 65 మాస్క్‌లున్న ఒక బాక్స్‌ను ఆన్లైన్లో 50వేల యెన్(456 అమెరికన్ డాలర్లు)లకు విక్రయిస్తున్నారు. ఓవైపు ధరల పెరుగుదల, మరోవైపు మాస్క్‌ల కొరత ఈ చోరీకి దారితీసినట్లు అధికారులు చెబుతున్నారు. తాజా ఘటనల నేపథ్యంలో మాస్క్‌ల ఉత్పత్తిని పెంచాలని జపాన్ ప్రభుత్వం తయారీదారులను కోరుతోంది.
ఇవీ చదవండి..
కరోనాతో ఆస్పత్రి డైరెక్టర్ మృతి