వాటాల విక్రయానికి సిద్ధమైన టిక్‌టాక్‌!
close

తాజా వార్తలు

Published : 25/07/2020 00:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాటాల విక్రయానికి సిద్ధమైన టిక్‌టాక్‌!

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: దుందుడుకు చైనాకు ముకుతాడు వేసేందుకు అన్ని దేశాలూ టిక్‌టాక్‌ను పావుగా వాడుకుంటున్నాయి! దీంతో ఆ కంపెనీ మాతృసంస్థ ‘బైట్‌డాన్స్’కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. భారత్‌ తరహాలోనే మున్ముందు మరిన్ని దేశాలు టిక్‌టాక్‌ను నిషేధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెజారిటీ వాటాను విక్రయించేందుకు ఆ కంపెనీ సన్నద్ధమైందని సమాచారం. ది న్యూయార్క్‌ టైమ్స్‌, ది ఇన్ఫర్మేషన్‌ వంటి వార్తా సంస్థలు ఇందుకు సంబంధించిన కథనాలు ఇస్తున్నాయి.

ప్రస్తుతం బైట్‌డాన్స్‌ విలువ 100 బిలియన్‌ డాలర్లకు పైగానే ఉంటుంది. కేకేఆర్‌, టైగర్‌ గ్లోబల్‌, సాఫ్ట్‌బ్యాంక్‌, సెక్వోయియా, జనరల్‌ అట్లాంటిక్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. దేశ పౌరుల వ్యక్తిగత సమాచారం, గోప్యత, సార్వభౌమత్వానికి భంగం కలుగుతుందని టిక్‌టాక్‌, హెలో యాప్‌లను భారత్‌ నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌లను నిషేధించాలని కోరుతూ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు కొందరు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు లేఖ రాశారు. వారి లేఖను పరిగణనలోకి తీసుకుంటున్నామని, నిషేధం గురించి ఆలోచిస్తున్నామని సెక్రెటరీ ఆఫ్‌స్టేట్‌ మైక్‌ పాంపియో సైతం అన్నారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం సైతం టిక్‌టాక్‌పై చర్యలకు సిద్ధమవుతోంది. భద్రత, సమాచార గోప్యత, సమాచార స్వేచ్ఛకు విఘాతం కలిగించడం వంటి అనేక విషయాలపై మంత్రులు చర్చిస్తున్నారు. ఇప్పటికే చైనాతో ఆస్ట్రేలియా సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా సైతం నిషేధానికి సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. దీంతో దిక్కుతోచక మెజారిటీ వాటాను అమ్మి చైనా ముద్రను తొలగించుకొనేందుకు బైట్‌డాన్స్‌ సిద్ధమైందని సమాచారం. ఇప్పటికే అంతర్జాతీయ ప్రధాన కార్యాలయాన్ని చైనా ఆవలకు తరలించేందుకు, కొత్త బోర్డును ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని