close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. దద్దరిల్లిన దిల్లీ  

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆదివారం చేపట్టిన నిరసనలతో దేశ రాజధాని దద్దరిల్లింది. ఆగ్నేయ దిల్లీలోని న్యూఫ్రెండ్స్‌ కాలనీలో జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం విద్యార్థులు, స్థానికులు ఉమ్మడిగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి, ఉద్రిక్తతకు దారి తీసింది. రాత్రి పొద్దుపోయేవరకు ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘర్షణల్లో 60 మంది గాయపడ్డారు.ఉదయం నుంచి కొనసాగిన ఘటనల్లో భాగంగా ఆందోళనకారులు తొలుత నాలుగు బస్సులకు నిప్పంటించారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేయాల్సి వచ్చింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హైదరాబాద్‌లో విద్యార్థుల ఆందోళన

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను), కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనూ ఆందోళనలు జరిగాయి. ఆదివారం రాత్రి ‘మను’ విద్యార్థులు పెద్దఎత్తున వర్సిటీ ప్రధానద్వారం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని ఖండించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు 60 మంది అర్ధరాత్రి సమయంలోనూ ప్రవేశద్వారం వద్ద బైఠాయించి డప్పులు వాయిస్తూ ఆందోళనను కొనసాగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హిట్‌మయర్‌

ఫేవరెట్‌కు షాక్‌. పొట్టి సిరీస్‌ గెలిచిన ఊపుతో వన్డే సిరీస్‌లో అడుగుపెట్టిన కోహ్లీసేనకు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. హెట్‌మయర్‌ నిర్దాక్షిణ్యానికి, షై హోప్‌ సహనానికి బౌలర్లు దాసోహమన్న వేళ.. తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తయింది. కష్టాల్లో పడ్డ జట్టును ఆదుకుంటూ పంత్‌, శ్రేయస్‌ కాస్త గౌరవప్రదమైన స్కోరు అందించినా.. పసలేని బౌలింగ్‌ దాన్ని కాపాడలేకపోయింది. చెపాక్‌ స్టేడియంలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తేలని విద్యుత్తు వివాదం

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ సంస్థల ఉద్యోగుల పంపకాలపై వివాదం తేలలేదు. ఈ అంశంపై గత 2 రోజులుగా విచారణ జరిపిన జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ తుది ఆదేశాలేమీ ఇవ్వకుండానే ముగించింది. వారంలోగా తుది నివేదికను సుప్రీంకోర్టుకు, రెండు రాష్ట్రాలకు ఇస్తామని కమిటీ స్పష్టం చేసింది. ఆదివారం రెండోరోజు హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఆయన విచారణ జరిపారు. ఏపీ దక్షిణ డిస్కం సీఎండీ హరినాథ్‌, జేఎండీ చక్రధర్‌బాబు, తెలంగాణ జెన్‌కో సంచాలకుడు అశోక్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఫాస్టాగ్‌ లేక బారులు..

జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద ఆదివారం తెల్లవారుజామునుంచే ఫాస్టాగ్‌ విధానం అమలులోకి వచ్చింది. రాష్ట్రంలోని 18 జాతీయ రహదారుల్లో ఉన్న టోల్‌ప్లాజాల్లో తొలిరోజు 50.36 శాతం ఆదాయం ఈ విధానం ద్వారా వసూలు అయింది. నవంబరు 2 నుంచి జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఈ విధానంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తూ వచ్చింది. టోల్‌ప్లాజా కేంద్రాల్లో, పెట్రోల్‌ బంకుల్లో, జాతీయ బ్యాంకుల్లో, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చని తెలిపినా.. ఎక్కువ మంది వాహనదారులు ఫాస్టాగ్‌ తీసుకునేందుకు సిద్ధం కాలేదు. ఫలితంగా ఫాస్టాగ్‌ లేని వాహనదారులకు ట్రాఫిక్‌ తిప్పలు తప్పలేదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వణుకుతున్న ఉత్తర భారతం

ఉత్తర భారతంలో చాలా ప్రాంతాలు శీతల గాలులకు విలవిల్లాడుతున్నాయి. జమ్మూ-కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లలోని ఎత్తైన ప్రాంతాల్లో హిమపాతం సంభవిస్తోంది. లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతంలోని ద్రాస్‌ సెక్టార్‌లో ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్‌ 19.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దిల్లీలో ఓ మాదిరిగా పొగమంచు కురుస్తోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సంక్రాంతి దాకా ఊరట

ఫాస్టాగ్‌ లేని వాహనాల యజమానులకు కేంద్రం స్వల్ప ఊరటనిచ్చింది. టోల్‌ప్లాజాలో ఉండే మొత్తం లేన్లలో నాలుగో వంతు లేన్లను నగదు చెల్లించే వాహనాలకు కేటాయిస్తారు. ఇంతకుముందు ఒక్క లేన్‌ మాత్రమే అలా ఉండేది. సంక్రాంతి వరకు (జనవరి 15) ఇలా ఉంచి.. ఆ తర్వాత  ఒక్క లేన్‌ మాత్రమే నగదు చెల్లించే వాహనాలకు అందుబాటులో ఉంచుతారు. ఈ నెల రోజుల పాటు మూడొంతుల లేన్లను ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలకు కేటాయిస్తూ కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ (మోర్త్‌) తాజాగా ఆదేశాలిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

ధనుర్మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజాము నుంచి జనవరి 14వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నివేదించనున్నారు. సోమవారం రాత్రి 11.47 గంటలకు విశేషమైన ధనుర్మాస గడియలు ప్రారంభమవుతున్నాయి. శ్రీవారి ఆలయంలో నెల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో  గోదాదేవి రచించిన 30 పాశురాలను అర్చకులు రోజుకొకటి చొప్పున నివేదిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి గడువు 31 వరకే

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి అని, దానికి గడువు ఈ నెల 31తో ముగిసిపోతుందని ఆదాయపు పన్ను (ఐ.టి.) విభాగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయపు పన్ను సేవల్ని నిరాటంకంగా పొందడానికి గడువులోగా అనుసంధానాన్ని పూర్తి చేసుకోవాలని కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పురాతన వాహనాలకు ప్రత్యేక నంబరు ప్లేట్ల జారీ!

అపురూపమైన పురాతన కాలం నాటి కార్లు, ఇతర వాహనాలను ఎంత డబ్బైనా పోసి  సొంతం చేసుకునే వారికి శుభవార్త. 50 ఏళ్ల క్రితం నాటి పురాతన వాహనాల(వింటేజ్‌ వాహనాలు)కు ప్రత్యేక నంబరు ప్లేట్లను ఇచ్చేందుకు కేంద్ర రోడ్డురవాణా, రహదారుల మంత్రిత్వశాఖ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఓ ముసాయిదా నోటిఫికేషన్‌ సిద్ధం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.