
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 1 PM
1. వైరస్ వ్యాప్తి ఇప్పట్లో ఆగదు: WHO
కరోనా వ్యాప్తి ఈ ఏడాది చివరికల్లా ఆగిపోతుందన్న ఆలోచన పూర్తి తొందరపాటు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అలాంటి ప్రచారాలు పూర్తి అవాస్తవమని పేర్కొంది. సమర్థవంతమైన కరోనా టీకాల వల్ల మరణాలు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైకేల్ ర్యాన్ తెలిపారు. వైరస్ కట్టడికి టీకాలు తోడ్పడుతున్నాయని పేర్కొన్న ఆయన కొవిడ్ వ్యాప్తిని నియంత్రిస్తామని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* పేద దేశాలకు టీకా ఇంత ఆలస్యమా: WHO
2. అణ్వాయుధాగారానికి చైనా పదును
చైనా తన అణ్వాయుధాగారానికి పదును పెడుతోంది. నేలమాళిగలో ప్రత్యేకంగా ప్రయోగ వేదికలను ఏర్పాటు చేస్తోంది. తద్వారా సరికొత్త అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యాన్ని మరింతగా పెంచుకుంటోంది. ఇటీవల చైనాలోని ఒక క్షిపణి శిక్షణ కేంద్రంలో జరిగిన నిర్మాణాలకు సంబంధించి లభ్యమైన ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన అమెరికా ఆయుధ నిపుణుడు హాన్స్ క్రిస్టెన్సెన్ ఈ మేరకు పేర్కొన్నారు. అమెరికా నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి చైనా సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. తేయాకు తోటల్లో ప్రియాంక గాంధీ..
త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అసోంలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రెండో రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా బిశ్వనాథ్ ప్రాంతంలోని సాధురు టీ ఎస్టేట్‌కు వెళ్లి అక్కడి కూలీలతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. కొవిడ్ టీకా తీసుకున్న ఏపీ గవర్నర్
ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు మంగళవారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వైద్య సిబ్బంది వారికి కొవిట్ టీకా వేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) ఎల్.శివశంకర్, విజయవాడ సబ్ కలెక్టర్ హెచ్ఎం.ధ్యానచంద్ర పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* గాంధీ ఆసుపత్రిలో టీకా తీసుకున్న కిషన్‌రెడ్డి
5. ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా?
అత్యాచారానికి గురయిన బాలికను పెళ్లిచేసుకోవడం ఇష్టమేనా? అని సోమవారం సుప్రీంకోర్టు నిందితుడిని ప్రశ్నించింది. మహారాష్ట్ర విద్యుత్తు ఉత్పాదన సంస్థలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మోహిత్ సుభాష్ చవాన్ (23)పై అత్యాచారం కేసు నమోదయింది. 2014-15 ప్రాంతంలో తన దగ్గర బంధువైన బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు అందింది. అప్పటికి ఆమె వయసు 16 ఏళ్లు కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు తగ్గిస్తారా?
దేశంలో ఇటీవల చమురు ధరలు ఆకాశాన్నంటాయి. మునుపెన్నడూ లేనివిధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైం గరిష్ఠాలను తాకాయి. దీంతో దేశంలో ఇంధన ధరలను అదుపులోకి తెచ్చి సామాన్యులకు కాస్త ఊరట కలిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎక్సైజ్ సుంకం తగ్గింపు యోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. హత్య చేసి..తల, మొండెం వేరు చేసి
వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలం మెట్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. కుర్వ చంద్రయ్య(52)ను గుర్తు తెలియని వ్యక్తులు అతికిరాతకంగా హత్య చేశారు. ఘటన అనంతరం దుండగులు తల, మొండెంను వేరు చేశారు. తలను చెరువులో, మొండెంను ముళ్లపొదల్లో పడేశారు. ఆదివారం పొలం పనులకు వెళ్లిన చంద్రయ్య ఎంత సేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చేపట్టిన పోలీసులు మెట్లకుంట ఎల్లమ్మ చెరువు వద్ద చంద్రయ్య మృతదేహాన్ని గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ఇంటి అద్దె అడిగితే అంతమొందించాడు
8. రూ.10లక్షల బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే కార్లు
రోజురోజుకీ పెట్రో ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు వాహనం బయటకు తీయాలంటేనే బెంబేలెత్తిపోతున్నాడు. ఇక కొత్తగా కారు తీసుకోవాలనుకునే వారిని వాహన ధర కంటే ఇంధన రేట్లే భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లపై వినియోగదారులు దృష్టి సారిస్తున్నారు. మార్కెట్లో ఎక్స్‌షోరూం ధర రూ.పది లక్షల బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే.. మంచి ఫీచర్లు ఉన్న కొన్ని చిన్న కార్లపై లుక్కేద్దాం..! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. థియేటర్లో ‘ఆట’.. మీరు రెడీయా!
సాధారణంగా నలుగురు స్నేహితులు కలిస్తే ఎక్కువగా వేటి గురించి చర్చించుకుంటారు? అయితే సినిమాలు లేదా ఆటలు.. ఇంకా అంటే రాజకీయాలు. ప్రస్తుతం రాజకీయాలు పక్కనబెడితే మిగిలిన రెండు విషయాల గురించి మనం ఎప్పుడూ చర్చించుకుంటూనే ఉంటాం. ఆటల్లో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. ఆ భావోద్వేగాలను సినిమాగా మలిస్తే, ఆటలోని కసిని తెరపై ఆవిష్కరిస్తే అద్భుతంగా ఉంటుంది కదా! మరి ఆ పాయింట్‌ను నమ్ముకుని ప్రేక్షకులను అలరించడంతోపాటు, కాసుల వర్షంలో తడవాలని క్రీడా నేపథ్య సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇటీవల కాలంలో విడులైన జెర్సీ, చెక్ వంటి చిత్రాలు ప్రేక్షకుల మదిని దోచాయి. త్వరలో మరికొన్ని చిత్రాలతో తమ ‘ఆట’తో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి అవేంటో చూద్దామా! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఇన్‌స్టాలో విరాట్ రికార్డు
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ మరో మైలురాయి చేరుకున్నాడు. ఇది క్రికెట్లో కాకుండా వ్యక్తిగతంగా రికార్డు కావడం విశేషం. కోహ్లీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పది కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలవడమే కాకుండా ఆసియాలోనే తొలి సెలబ్రిటిగా అవతరించాడు. ఈ నేపథ్యంలోనే ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీల తర్వాత అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఆటగాడిగా టీమ్ఇండియా సారథి నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ఇంగ్లాండ్ మాజీలు.. బ్రాడ్ 8/15పైనా మాట్లాడండి