
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 5 PM
1. తెలుగు రాష్ట్రాల సీఎంలకు షెకావత్ లేఖ
తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే సమర్పించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రులిద్దిరికీ షెకావత్ లేఖ రాశారు. గత ఏడాది అక్టోబరు 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా డీపీఆర్‌లు అందివ్వాలని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పరస్పరం కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల ఫిర్యాదులపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ స్పందిస్తూ డీపీఆర్‌లు సమర్పించాల్సిందిగా కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. కిష్టమ్మ చెప్పిన తొలి టీకా ముచ్చట!
తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. టీకా కోసం కొన్ని నెలలుగా ప్రజలు ఎదురు చూస్తున్నప్పటికీ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయోనని పలువురు సందిగ్ధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో తెలంగాణలో తొలి టీకా వేయించుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టమ్మ తన వ్యాక్సిన్ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* టీకా వేయించుకున్న సీరమ్ అధినేత
3. ‘చరిత్రాత్మక తీర్పునకు తిరుపతి వేదిక కావాలి’
ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాలపై 150 దాడులు జరిగేవరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఆలయాలపై జరిగిన దాడులతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని.. ఉన్మాదులు, మతిస్థిమితం లేనివారే దాడులకు పాల్పడ్డారని భోగి రోజు డీజీపీ అన్నారని పేర్కొన్నారు. కనుమ రోజు మాట మార్చిన డీజీపీ.. ఆలయాలపై దాడులను ప్రతిపక్షాలకు అంటగడుతున్నారంటూ మండిపడ్డారు. దాడులు చేసిన వైకాపా వాళ్లను కేసుల నుంచి తప్పిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిపై ఉన్న భక్తితో దాడులను బయటపెట్టిన వాళ్లపై కేసులు పెడతారా?విధ్వంసాలు చేసిన వైకాపా వాళ్లపై కేసులు లేవా? అని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
కొవిడ్ టీకాలు చాలా సురక్షితమైనవి, టీకా వేయించుకునేందుకు ఎవరూ భయపడొద్దని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తిలక్‌నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్ టీకా వేయించుకునేందుకు ప్రజా ప్రతినిధులంతా సిద్ధంగా ఉన్నారని, ప్రధాని సూచనమేరకే ముందుగా టీకా వేయించుకోవడం లేదన్నారు. కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులం కూడా త్వరలో టీకా వేయించుకుంటామని తెలిపారు. మనదేశ పరిస్థితులకు అనుగుణంగా టీకా తయారీ జరిగిందన్నారు. హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ కూడా తయారు చేసిందని, టీకా తయారీ దారుల్లో హైదరాబాద్ సంస్థ ఉండటం గర్వకారణమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. భారత్‌లో టీకా పంపిణీ..ప్రపంచానికి పాఠాలు!
కరోనా వైరస్ విజృంభణతో అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కాస్త ఊరట కలిగిస్తోంది. అయితే, ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభించిన కొన్నిదేశాలు మాత్రం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో ఒకటైన భారత్, కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ పంపిణీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కోట్ల మందికి టీకా అందించేందుకు సన్నద్ధమైన భారత్, ఇందుకోసం ముందుగానే చేసిన ఏర్పాట్లు, ప్రణాళికలు ప్రపంచ దేశాలకు కొన్ని పాఠాలు నేర్పిస్తుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* టీకాపై వదంతులు నమ్మొద్దు: కేజ్రీవాల్
6. రోహిత్ శర్మ ఆరోసారి
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తున్నా.. ఈ ఫార్మాట్లో ఒకే బౌలర్ చేతిలో ఆరుసార్లు ఔటవడం గమనార్హం. గాయం కారణంగా తొలి రెండు టెస్టులు ఆడని హిట్‌మ్యాన్ మూడో టెస్టు నుంచి జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలోనే సిడ్నీ టెస్టులో (26, 52) పరుగులు చేశాడు. ఇక గబ్బాలో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి నాథన్ లైయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో లైయన్ 100 టెస్టుల్లో 397 వికెట్లతో కొనసాగుతున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. కొవిడ్ టీకాలు: కరోనా పోరులో ‘సంజీవని’లు!
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం భారత్‌లో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టీకాలపై వచ్చే ఎటువంటి వదంతులను నమ్మవద్దని.. అవి కరోనా మహమ్మారి పోరులో సంజీవని వంటివని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టంచేశారు. కేవలం శాస్త్రవేత్తలు, నిపుణుల మాటలనే నమ్మాలని దిల్లీ ఎయిమ్స్‌లో జరిగిన వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ద్వారా కేంద్రమంత్రి హర్షవర్ధన్ దేశప్రజలకు సూచించారు. ‘ఇది చరిత్రాత్మకమైన రోజు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో ప్రారంభమైంది. దీంతో గత సంవత్సరంగా మహమ్మారిపై చేస్తోన్న పోరాటానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. ఇప్పటివరకు తీసుకున్న గట్టి చర్యల ద్వారా వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు కట్టడిచేయగలిగాం. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చర్యలు అభినందనీయం’ అని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబును ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా..? కేవలం అభిమానులే కాదు.. తన సహనటులతో పాటు దక్షిణాది.. ఉత్తరాది సినీ ప్రముఖులు కూడా మహేశ్‌బాబు అందానికి ఫిదా అయినవాళ్లే. మంచితనాన్ని కొనియాడినవాళ్లే. తాజాగా మహేశ్‌బాబుపై హీరో మంచు విష్ణు ప్రశంసలు కురిపించాడు. విష్ణు సతీమణి వెరొనికా జన్మదిన వేడుకల్లో మహేశ్ తన సతీమణి నమ్రతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు విష్ణు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ప్రేయసిని చంపి.. గోడలో దాచి..
మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తనతో కలిసి ఉంటున్న ప్రేయసిని హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోని గోడలో దాచిపెట్టాడు. ఈ దారుణ ఘటన పాల్గఢ్ జిల్లాలోని వనగామ్‌లో వెలుగులోకి వచ్చింది. నేరస్థుడిని అరెస్టు చేసి గోడలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు గత ఐదేళ్లుగా 32 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే, గత కొన్ని నెలలుగా ఆమె కనిపించకుండా పోయింది. మహిళ కుటుంబసభ్యులు ఆమె గురించి నిందితుడిని ప్రశ్నించగా.. పని నిమిత్తం గుజరాత్‌లోని వాపికి వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. కొంతకాలం ఎదురుచూసిన కుటుంబసభ్యులు ఆమె తిరిగి రాకపోవడంతో చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. బైడెన్ ప్రమాణం వేళ..
అమెరికా తదుపరి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా డెమొక్రాట్ నేతలు జో బైడెన్, కమలా హారిస్‌లు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసే కార్యక్రమాల్లో ప్రఖ్యాత కళాకారులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ప్రముఖ గాయని లేడీ గాగా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. మరో గాయని, నృత్యకారిణి, నటి జెన్నిఫర్ లోపెజ్ సంగీత కచేరీ కూడా ఉంటుంది. కొవిడ్-19 నిబంధనల నేపథ్యంలో... వీటిలో చాలా కార్యక్రమాలు వర్చ్యువల్ విధానంలోనే ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి